• Prev
  • Next
  • Rampandu-Football

    రాంపండూ - ఫుట్ బాలూ

    ఉత్తరం చూడగానే అనంత్ నిట్టూర్చాడు.

    “అచలపతీ...ఈ ఉత్తరం నీకేమైనా అర్థమయిందా ? ” అని అడిగాడు.

    అచలపతి చిన్నగా దగ్గి " నాకు అర్థమయినంత వరకు -మీ ప్రియ మిత్రుడు రాంపండు గారికి ఒక ఆస్ట్రేలియన్ జాతి పామేరియన్ కుక్కపిల్ల, ఫుట్ బాల్ బూట్ల జత -ఒకటో రకంవి, కావాలని అనుకుంటున్నారండి. వాటిని ఎలా పంపాలో మీకు వేర్వేరు మార్గాలు సూచించారండి.” అని విన్న వించాడు.

    అనంత్ కి ఒళ్ళు మండింది.

    “ అంటే ఆ పాటి కూడా నాకు అర్థం కాక నిన్ను అడిగాననుకుంటూన్నావా అచలపతీ ? అసలా ఫుట్ బాల్ బూట్లు ఎందుకంట ?”

    అచలపతి మళ్ళీ వినయంగానే " సర్, నాకు తెలిసినంతవరకు -ఫుట్ బాల్ బూట్లు ఫుట్ బాల్ ఆడడానికి ఉపయోగిస్తారు. బహుశా రాంపండు గారికి ఫుట్ బాల్ ఆడాలనే కోరిక కలిగి వుంటుంది.” అన్నాడు.

    అచలపతి కేసి నమిలి మింగేసినట్టు చూసి అనంత్ పళ్ళు గిట్ట కరిచి " ఓహో ! అందుకా, నేను మరి ఎందుకో అనుకున్నానులే ! మరి కుక్క పిల్ల కూడా ఎందుకు ? దాంతో కలిసి ఫుట్ బాల్ ఆడతాడా ? ” అనడిగాడు కసిగ్గా.

    అచలపతి సంయమనం కోల్పోలేదు.

    “ నాకు తెలిసున్నంత వరకు -పామేరియన్ కుక్క పిల్లలు ఫుట్ బాల్ ఆటలో పెద్దగా ఆసక్తి చూపవండి. మరి ఆస్ట్రేలియన్ జాతి కుక్కపిల్లలు వైవిధ్యంగా ఉంటాయేమో నాకు పెద్దగా తెలియదు.”

    అనంత్ కోపం నాసాళాని కెక్కింది. “ ఓహో...మరి రాంపండు గాడు ఇది నాకు రాయడంలో అర్థం ఏమిటిట ? నేనేమైనా క్రిస్మన్ తాత అనుకుంటున్నాడా ? వాడిక్కావలసిన వస్తువుల లిస్టు రాసిస్తే అన్నీ వాడి గుమ్మంలో పడేసి పోవడం తప్ప నాకు వేరే పనేమీలేదా ? ”.

    అచలపతి వినయంగా ఒంగాడు.

    “ తెలియదు సర్. మీరు చెప్తే వాలివాడ వెళ్లి రాంపండు గారిని కనుక్కుని వస్తాను ". అనంత్ నుదురు కొట్టుకున్నాడు.

    “ తప్పకుండా వెళ్ళు. వెళ్లి ఈ విషయంతో బాటు అన్ని సంగతులూ కనుక్కుని రా. ఈ మధ్యే ఆ వీణాపాణిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు.చెప్పినవాడు మైలారం వెళ్ళక, ఈ వాలివాడలో ఎందుకు తేలినట్టు ? రేపే వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఎలాగూ వెళుతున్నావు కాబట్టి బూట్స్ తీసుకెళ్ళు.కుక్కపిల్ల సంగతి తర్వాత చూద్దాంలే ! “.

    అచలపతి వాలివాడ వెళ్లి తిరిగి వచ్చేదాకా అనంత్ సస్పెన్స్ లోనే కొట్టుమిట్టులాడుతున్నాడు. రాంపండు మైలారంలో ఉండే రోజుల్లో వీణాపాణి అనే అమ్మాయితో ప్రేమలో పడడం.ఆమెను మెప్పించడానికి ఓ డాన్సు డ్రామా ఏర్పాటు చేయడం అనంత్ కి తెలుసు.ఆ డ్రామా ఘోరంగా ఫ్లాపవడంతో వీణాపాణి రాంపండుని తిట్టి, జన్మలో తనకు మొహం చూపించ వద్దనడం కూడా తెలుసు.

    అయితే కొన్నాళ్ళకు ఆ డ్రామా డ్రామా ఫ్లాపవడానికి భూషణం పన్నిన కుట్రే కారణమని వీణాపాణికి తెలిసిందట.పశ్చాత్తాపం తో తిరిగి రాంపండు తో మాట్లాడసాగిందట. క్రమంగా మనసు మెత్తబడి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామనుకోవడం జరిగిందట. ఇవన్నీ పదిహేనురోజుల క్రితం రాంపండు వచ్చి అనంత్ కి చెప్పిన విశేషాలు. మరి ఇంతలోనే రాంపండు వేరే వూళ్ళో ఫుట్ బాల్ ఆడడం ఎందుకో తెలియలేదు. అచలపతి వస్తూనే సమాచారం మోసుకువచ్చాడు.

    రాంపండుకి, వీణాపాణికి మళ్ళీ చెడిందట. రాంపండు కోపంతో బస్సెక్కి, మరో అందమైన అమ్మాయీ కనబడిన మొట్టమొదటి ఊళ్ళో దిగిపోయాడట. ఆ ఊరే వాలివాడ. ఆ అమ్మాయే మేనక. జంతువులంటే మహాప్రేమట.వాళ్ళ ఊరన్నా కూడా ప్రేమట. ఆమెను ప్రేమించడానికి రాంపండు ఆ ఊళ్ళో తిష్టవేసి ఆమె చుట్టూ తిరుగుతున్నాడట. అనంత్ కి ఇక్కడ సందేహం వచ్చింది.

    “ జంతువులంటే ప్రేమ అన్నావు కాబట్టి ఆమెను ఇంప్రెస్ చేయడానికి కుక్కపిల్ల అడిగి ఉంటాడనుకో. మరి ఫుట్ బాల్ ఆడడం ఎందుకు...? ”.

    “ అది రెండో ఇష్టానికి సంబంధించినదండి...మేనమ గారికి వాలివాడ అంటే మహా ఇష్టమని చెప్పాను కదా. ప్రతీ సంక్రాంతికి వాలివాడకు, పొరుగున ఉన్న సుగ్రీవవాడకు మ్యాచ్ అవుతుంది. అది కురుక్షేత్రం లెవల్లో అన్నదమ్ముల మధ్య యుద్ధమంత భీకరంగా సాగుతుందట.రాంపండు గారు వాలివాడ తరపున ఆడి, దాన్ని గెలిపించి,ఊరుపేరు నిలబెట్టి, మేనకగారి మనసును చూరగొనడానికి ప్రయత్నిస్తున్నారు సర్ " అని వివరించాడు అచలపతి.

    అనంత్ నిట్టూర్చాడు. “ఆ వీణాపాణి కాస్త ఇంటెలింజేంటు అమ్మాయిలా కనబడింది.తనని చేసుకుంటే వీడూ బాగుపడతాడేమోననుకున్నాను. కానీ వీడికా రాత లేనట్టుంది. పోయి,పోయి ఆ జంతుప్రియను ప్రేమిస్తున్నాడు ".

    “ సర్, సంక్రాంతి ఆటల పోటీల సమయానికి మీరక్కడికి తప్పకుండా రావాలని రాంపండు గారు మరీ మరీ చెప్పారండి. కుక్కపిల్లను వెతికే పని నా కప్పగించారు ".

    “ నేను వెళ్ళే లోపున దొరికితే నేను పట్టుకేళతానులే కానీ,మన రాంపండు గాడికి ఫుట్ బాల్ ఆడడం బాగా వచ్చా అని నాకనుమానం. స్కూలు రోజులో ఏదో ఆడేవాడనుకో "అంటూ నాన్చాడు అనంత్.

    “ అలా అయితే ఆయన చాలా రిస్కు తీసుకుంటున్నారనే చెప్పాలి సర్. నాకు ఊళ్ళో అందిన సమాచారం ప్రకారం ఆ రెండు ఊళ్ళ మధ్య ఏటా జరిగే పోటీలో రక్తసిక్తం కాని ఏడాది ఇప్పటిదాకా లేదట. పుట్ బాల్ రూల్స్ ప్రకారంగా ఆడాలన్న పట్టింపు, రెండూ జట్లకూ లేదట సర్. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు తన్నుకోవడమేనట ".

    “ ఆపాటి దానికి ఈ ఆట ఎందుకు ? హాయిగా తన్నేసుకుంటే పోయేదిగా !” అనంత్ కి అనుమానం వచ్చింది.

    “ అందుకు రెండూళ్ళ వాళ్ళు ఒప్పుకోరు సర్. రామాయణ కాలం నుండి ఆ రెండు ఊళ్ళ మధ్య ఈ ఆట సాగుతోందని ప్రతీతిట సర్. వాలి సుగ్రీవుల రాజ్యాలు ఇక్కడే ఉందని ఎవరో చరిత్రకారుడు కూడా చెప్పాడట.ఆట ఆపినా, సౌమ్యంగా ఆడినా పెద్దల పట్ల, సాంప్రదాయం పట్ల ఆపచారం చేసినట్టే భావిస్తారుట సర్. అందుకే 1968లో ఏడుగురు ఆటగాళ్ళు చచ్చిపోయినా పోలీసులకు చెప్పకుండా రెండూళ్ళ వాళ్ళూ దాచి పెట్టారుట " అచలపతి చెప్పాడు.

    “ ఏడుగురు చచ్చిపోయారా ? ”

    “ ఏడుగురు ఆటగాళ్ళాండి. చూసేవాళ్ళతో కలిపితే పన్నెండండి. 1864 లో పోలిస్తే ఆ అంకె సగం కంటే తక్కువేటండి. 1967 లో మళ్ళీ...” అచలపతి ఇంకా ఏవో గణాంకాలు వల్లిస్తున్నాడు కానీ అనంత్ వినలేదు.

    రాంపండు ప్రాణం నిలపాలంటే తక్షణం వాలివాడలో వాలాల్సిందే అనుకున్నాడు.

    ***

    మర్నాడు ఆ సమయానికి వాలివాడలో అనంత్ రాంపండుకి బుద్ధి గరపబోతున్నాడు.కానీ రాంపండు గరిపించుకునే మూడ్ లో లేడు. తను చిన్నప్పటి నుండి రఫ్ అండ్ టఫ్ టైపుట. అనంత్ వాళ్లలాటి కోసం రొమాంటిక్ అవతారంలో కనిపించినా లోపల్లోపల తను చిరునవ్వు అసలైనా హీ -మాన్ ట.

    ఆడవాళ్ళ చిరునవ్వు గెలవడం కోసం కత్తులతో ద్వంద్వయుద్ధం చేసి చచ్చిపోయే ఇంగ్లీషు నైట్స్ తాలూకు రక్తం తనలో ప్రవహిస్తోందట. సప్త సముద్రాలు ఎక్కడున్నాయో తెలియక వదిలేసాడట కానీ లేకపోతే అవన్నీ దాటి చెట్టుతోర్రలో ప్రేయసి అడిగిన జాంపండు తెచ్చిపెట్టే టైపుట.

    ఈ ఫుట్ బాల్ వీరయుద్ధంలో చచ్చిపోయినా ఫర్వాలేదుట. ఏడాదికోసారి మేనక భర్తతో సహా తన సమాధికి నడిచి వచ్చి ఓ కన్నీటి బొట్టు విడిచినా చాలుట. ఆ బొట్టు తాగి దెయ్యంగా ఇంకో ఏడాది ఆయుష్షు పోసుకుంటాడట. ఈ ఉపన్యాసం విన్నాక అనంత్ కాస్త చలించాడు.

    “ ఒరేయ్, పోనీ నేను చెప్పినట్టు ఊరొదిలి పారిపోవద్దులే. ఆ రోజు కాలు బెనికిందని చెప్పి ఆట మానేసి ఇంట్లో కూచో. అప్పుడు నీ పరువు పోదు. మేనకకు నీ మీద కోపం రాదు " అన్నాడు.

    రాంపండు అనంత్ ను చూసి జాలిగా నవ్వాడు. “ఎలా అనగలిగావురా అంతమాత ? ఒక పక్క మేనక నన్ను వాలివాడ పరువుని కాపాడే ఏకైక రక్షకుడిగా చూస్తూ ఉంటే ఆమె నమ్మకాన్ని వమ్ము చేసి నేను దొంగ వేషాలు వేయాలా ? ఇదే ఇంకోడేవడైనా అని ఉంటే ఈ పాటికి బతికి ఉండగలిగి వాడా ? ”.

    రాంపండు పోజు చూసి అనంత్ కి ఒళ్ళు మండిపోయింది. “ వాలివాడ పరువు కాపాడే బాధ్యత నీ మీద ఉన్నప్పుడు నువ్వు సుగ్రీవవాడ తరవున ఆడాలి మరి " అనేసి వచ్చేశాడు. వచ్చి అచలపతికి ఫోన్ చేశాడు.

    “ అచలపతీ..ఈ రాంపండు గాడు ఎవడిమాటా వినేట్టు లేదు.ఆది తీరతానంటున్నాడు.ఆర్భక ప్రాణి...గుటుక్కుమంటేడేమోనని భయంగా ఉంది.ఏదైనా ఉపాయం చెప్పు.” అన్నాడు.

    అచలపతి దగ్గర ఉపాయం రెడీగా ఉంది. “సర్, రాంపండు గారు ఇంతకు తెగించడానికి కారణం వీణాపాణి మీద ఆయనకున్న కోపమే ననుకుంటున్నాను. ఎక్కడైతే ప్రేమ బాగా వుంటుందో అక్కడే కోపం ఎక్కువవుతుంది. వీణాపాణిని సాధించడానికి రాంపండు గారు ఈ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది.”

    “ కరెక్టే. మధ్యమధ్యలో ఆ వీణాపాణికి నా సత్తా ఏమిటో తెలిసి రావాలి అంటూ రాంపండు గొణుగుతున్నాడు కూడా. ఆమె మీద కసితోనే ఈ మేనకకు రెట్టింపు లవ్ చేస్తున్నాడని పిస్తోంది".

    “ ఆయన మనస్సులో వీణాపాణి మీద ఉన్న ప్రేమను బయటకు తీసుకురావాలంటే ఒకటే మార్గం సర్. వీణాపాణి పేరు మీద ఓ టెలిగ్రాం ' నా పొరబాటు తెలుసుకున్నాను. నన్ను క్షమించి తిరిగి రా 'అని ఇవ్వాలి.”

    “ గుడ్. అచలపతి మంచి ఐడియా చెప్పావ్.నువ్వు మైలారం వెళ్లి అక్కణ్ణుంచి టెలిగ్రాం ఇయ్యి.ఇప్పుడే ఇచ్చేయకు.ముందే వెళ్లి చూసి వచ్చేసి మళ్ళీ ఆటకు సిద్ధమవుతాడు.ఆట రోజున పొద్దున్నే అందేట్టు నేనున్నా హోటలు అడ్రసుకు పంపు.నేను పట్టుకెళ్ళి ఇచ్చి దగ్గరుండి వాణ్ణి వెనక్కి పంపిస్తాను.మేనక దక్కకపోతే అదే పోయే,ప్రాణం దక్కుతుంది.” అన్నాడు అనంత్.

    అచలపతి టెలిగ్రాం సరిగ్గా అనుకున్న టైముకే వచ్చింది.దాని గురించి కాసుక్కూర్చున్న అనంత్ హుటాహుటిగా ఆట స్థలానికి బయలుదేరాడు.అప్పటికే రణరంగం సిద్ధమయింది. ఇసకేస్తే రాలనంత మంది జనం.వాలివాడ, సుగ్రీవవాడ జనాలే కాక చుట్టుపట్ల పదూళ్ళ జనం చేరారు.సగం మంది ఆ ఊరికి,తక్కిన సగం ఈ ఊరికి సపోర్టట.రక్తం ఏరులై పారడానికి సిద్ధంగా కాలువలు అవీ తవ్వి కూచున్న ఫీలింగ్ వచ్చింది అనంత్ కి.

    గ్రౌండులోకి దిగకుండానే రాంపండుని పట్టుకుందామనుకున్నాడు.కానీ అంతమంది జనంలో రాంపండు ఎక్కడున్నాడో తెలుసుకోవడం మహా కష్టమైంది.చివరికి గ్రౌండ్ మధ్యలోకి పరిగెత్తుతున్నప్పుడు వెంటాడి పట్టుకున్నాడు.

    “ ఒరేయ్, ఆగాగు.నీకో ముఖ్యమైనా కబురు చెప్పాలి " అన్నాడు అనంత్ ఒగరుస్తూ.

    “ ఇప్పుడు ఆటలో విజయం తప్ప మరేదీ ముఖ్యం కాదు నాకు " అన్నాడు రాంపండు నాటకఫక్కీలో.

    " ఈ టెలిగ్రాం చూస్తే నువ్వలా అనవ్.” అంటూ అనంత్ చొక్కా జేబులో చెయ్యి పెట్టాడు. టెలిగ్రాం తగల్లేదు.ఆ తర్వాత పాంటు కుడి జేబులో వెతికాడు.ఊహో...ఎడమ జేబులో...ఆ తర్వాత హిప్ పాకెట్ లో...ఊహూ...ఎక్కడా లేదు.హడావుడి లో చొక్కా మార్చినప్పుడు మర్చిపోయి వుంటాను అనుకున్నాను అనంత్.కానీ రాంపండు ఇవేమీ పట్టించుకోలేదు.

    “నీ టెలిగ్రాం నీ దగ్గరే అట్టే పెట్టుకో. తర్వాత చూద్దాం" అన్నాడు విసుగ్గా.

    “ ఒరేయ్, టెలిగ్రాం సంగతి పక్కన బెట్టి నా నీ ప్రాణాలు కాపాడుకోరా.ఈ మేనకకు నీ మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా నిన్నిలా బలిపీఠం ఎక్కించేది కాదు. కనీసం నీకు వీరతిలకం కూడా అద్డలేదు చూడరా.”

    “ పాపం ఈ జనసమ్మర్ధంలో నా దగ్గరికి చేరలేకపోయి వుంటుందిరా. ఆ గుంపులో కూచుని నా విజయం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది.ఇక కబుర్లాపు.నన్ను కదనరంగంలోకి దూకనీ " అంటూ ముందుకు పరిగెత్తాడు రాంపండు.

    రాంపండుని ఫుల్ షేపులో చూడడం అవాల్టి కి అదే ఆఖరుసారి అనంత్ కి. ఎందుకంటే కొద్ది సెకండ్లలోనే ఆట ప్రారంభం కావడం,సుగ్రీవవాడ వాళ్ళు మాటిమాటికి రాంపండుని చుట్టు ముట్టడం జరిగింది.ముఖ్యంగా ఓ ఎర్రచొక్కా వాడు, రాంపండు కంటె సైజులో రెట్టింపు ఉన్నవాడు రెండు నిమిషాలకో సారి రాంపండుని వాటేసుకుని ఉక్కిరిబిక్కిరి చేయడం జరిగింది.కొద్దిసేపట్లో అనంత్ కి అర్థమయిందేమిటంటే -మామూలు పుట్ బాల్ రూల్స్ కీ , ఇక్కడ ఆడే ఆట రూల్స్ కీ పెద్దగా పోలికల్లేవు.

    ఇద్దరు ఆటగాళ్ళు తోసుకోవడానికి, కుమ్ముకోవడానికి ,మధ్యలో బంతి ఉండవలసిన అనసరం లేదు.! ఆట పావుగంట గడిచేసరికి అందరికీ అర్థమయింది -ఈసారి సుగ్రీవవాడ ఆటగాళ్ళందరూ రాంపండు మీదనే దృష్టి కేంద్రీకరించారని.దానికి కారణం కూడా తెలిసి పోయింది.'మేమూ , మేమూ అన్నదమ్ముల్లాంటి వాళ్ళం.కొట్టుకుంటాం,చంపుకుంటాం.

    మధ్యలో వాలిసుగ్రీవుల మధ్య రాములవారిలా ఈ రాంపండు గాడిని ఎవరు దాపురించమన్నారు.'అని సుగ్రీవవాడ వాళ్లకి కోపంట.ఇలాంటి ఔట్ సైడర్స్ మళ్ళీ ఈ పోటీ వైపు కన్నెత్తి చూడకుండా తరతరాల పాటు గుర్తుంచు కోవడానికి గాను, రాంపండును ఒక ఉదాహరణగా మిగిలిద్దామని కంకణం కట్టుకున్నారట వాళ్ళు.కంటికి కొట్టొచ్చేట్టు డ్రస్ వేసుకోవడం ద్వారా రాంపండు ని అవతలి వాళ్లందరూ బాగా గుర్తు పెట్టుకోగలిగేరు.

    ఒక్కోడు రావడం రాంపండుని తన్నేసి పోవడం. కాళ్ళతోకాళ్ళు నొప్పిపుట్టాక చేతులతో !వాలివాడ మట్టిని రాంపండు చాలా సార్లే రుచి చూశాడు.వాడలా చూసినప్పుడల్లా సగం మంది జనం కేరింతలు కొట్టారు.రాంపండు ఒక్కడే దెబ్బలు తిన్నాడని ఆనడం కరక్టు కాదు కానీ,గ్రౌండ్ మొత్తంలో ఫుట్ బాల్ తర్వాత ఎక్కువ తాపులు తిన్నని మాత్రం అతనే.

    రాంపండు అందరికీ తెలిసి పోయేట్లా మరీ అంత గాడీ డ్రస్ వేసుకోకుండా వుంటే బాగుండేదని,కం ఫ్యూజన్ లో వేరే వాళ్లకు కూడా వడ్డన జరిగేదనీ అనంత్ అనుకున్నాడు.కానీ ఇంటర్వెల్ లో రాంపండుని గుర్తు పట్టగలిగినది ఆ డ్రస్ వల్లనే !ముక్కు, మొహం ఏకమయి పోవడం వల్ల రాంపండు షేపులు పూర్తిగా మారిపోయాయి.

    “ ఒరేయ్, ఇప్పటికైనా మేలుకో.మేనక కాకపొతే మరో రంభ దొరుకుతుంది.బతికుంటే ఇంకో రొమాంటిక్ ఎపిసోడ్ నడుస్తుంది.ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చేయ్ "చెప్పి చూశాడు అనంత్.

    “ఇప్పుడు మేనక కోసం కాదురా. నా కోసం ఆడుతున్నాను.ఆ సుగ్రీవవాడ జనాలను మట్టుపెట్టకపొతే నా పేరు రాంపండే కాదు. ముఖ్యంగా ఆ ఎర్రచొక్కావాడి రక్తం కళ్ళ జూడకుండా వదిలిపెట్టను చూడు " అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు రాంపండు.

    అతని పట్టుదల చూసి వాలివాడ వాళ్ళు సిగ్గుపడ్డారు.ఎక్కడో ముక్కూ ,మొహం తెలియని (ఇప్పుడు బొత్తిగా తెలియటం లేదు) వ్యక్తీ తమ ఊరికోసం ఇంతా త్యాగం చేస్తూ ఉంటే తాము మాత్రం మెత్తగా ఉన్నారేమిటని. ఇంటర్వెల్ తర్వాత ఆటలో రాంపండు ఫుట్ బాల్ ఎక్కడుందో పట్టించుకోలేదు.

    సుగ్రీవవాడ ఆటగాళ్ళు ఒక్కోడి దగ్గరికి వెళ్లడం,పొట్టలో తన్నడం, కన్ను సగం మూసుకుపోయి సరిగ్గా కనబడక ఒక్కోసారి గాల్లో కూడా తన్నేసేడు.కానీ కాలు ఝుళిపించడం మాత్రం మానలేదు. సర్కస్ లో బపూన్ కి వచ్చినంత పాపులారిటి వచ్చింది అతనికి.ఇరుపక్షాల జనం కూడా అతని చేష్టలు చూసి జయజయధ్వానాలు పలికేరు.

    రాంపండు కి ఇంకా పూనకం వచ్చింది.కాళ్ళు నెప్పిపెట్టాక తలతో పొడవడం మొదలుపెట్టాడు.అతనికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి వాలివాడ వాళ్ళు అతని వెంట నడిచారు.సుగ్రీవవాడ వాళ్ళ ఆత్మస్థైర్యం సడలింది. ఈ హడావుడి లో బాలు వచ్చి రాంపండు కాలుకి ఎలా ఎలా తగిలిందో కానీ వెళ్లి గోల్ కీపర్ రాంపండు శరీరం కింద నలుగుతున్నాడు.

    బంతి ఆపబోయిన అతని చెయ్యి రాంపండు పంటి కాటుకి గురయ్యింది.ఏతావాతా ఆ రోజు ఆటలో నమోదయినా ఏకైక గోల్ రాంపండు ఖాతాలో జమ అయింది.అతడే ఆనాటి ఆటకు హిరో! ఆ తర్వాత జనం అతనికి పట్టిన నీరాజనాలకు అంతేలేదు.అనంత్ అతనికి ఫర్లాంగ్ దూరంలో ఉండిపోవలసి వచ్చింది. మర్నాడు పొద్దున్నే మాత్రమే అనంత్, రాంపండుని ఏకాంతంగా కలవగలిగేడు.మూలుగుల మధ్య రాంపండు చెప్పిన సమాచారం విని అనంత్ మూర్చబోయాడు.

    నిన్నటి రోజున ఆట స్థలంలో మేనక లేదట.ఆస్ట్రేలియన్ జాతి పామేరియన్ కుక్కపిల్ల అక్కడ దొరుకుతోందని సిటీ నుండి ఎవరి ఫోను చేస్తే దాని కోసం వెళ్లిపోయిందట.

    “చూశావురా ఘెరం ! తన కోసం నేను ప్రాణాలను పణంగా పెట్టి ఆడితే, ఆట కూడా చూడకుండా వెధవ కుక్కపిల్ల కోసం సిటీకి వెళ్లి కూచుంటుందా ? అన్యాయం కదూ.అదే అంటే తనకు కోపం వచ్చేసింది. అసలే ఫోను చేసిన ఆ పెద్దమనిషి కనబడటలేదుట.

    కుక్కపిల్ల దొరకలేదన్న ఏడుపుకి తోడు నేను పెట్టిన చివాట్లతో మరీ కోపం తెచ్చుకుంది.తిట్టేసి వెళ్ళిపోయింది.ఇటువంటి కృతఘ్నురాలంటే నాకు మనసు విరిగిపోయిందిరా !” అంటూ ఘెల్లుమన్నాడు రాంపండు.

    ఇంటికి తిరిగిరాగానే అనంత్ అచలపతిని పిలిచాడు.

    “ ఆచలపతీ, ఆ ఫోనుకాల్ నువ్వే చేసి వుంటావని నాకు తెలుసు.దాని వల్ల మంచే జరిగింది గానీ దాని అవసరం పడుతుందని ఎలా ఊహించావ్? మేనక సంగతి నీకు అంతబాగా తెలుసా !” ఆచలపతి సీరియస్ గానే సమాధానం చెప్పాడు.

    “సర్..నాకు మీ సంగతి కూడా బాగానే తెలుసు.టెలిగ్రాం విషయంలో ఏదో ఒక తెలివితక్కువ పని చేసి తీరతారనుకున్నాను.ఒకవేళ టెలిగ్రాం ఇచ్చినా మీ ప్లాను ప్రకారం రాంపండు వెనుకంజ వేయడని కూడా అనుకున్నాను.ఎందుకైనా మంచిదని మేనక మేడమ్ కి ఫోన్ చేశాను. కావలసిన రిజల్టు రాబట్టుకున్నాం "

    “ హారి అసాధ్యుడా " అని మనసులోనే అనుకుని అనంత్ మారు మాట్టాడకుండా ఊరుకున్నాడు.

    ఎమ్బీయస్ ప్రసాద్

    (పి.జి.ఉడ్ హవుస్ రాసిన "ది ఆర్దియల్ ఆఫ్ యంగ్ టప్పీ " కథ ఆధారంగా )

  • Prev
  • Next