• Prev
  • Next
  • Rampandu Dans Drama

    రాంపండూ - డాన్సు డ్రామా

    “ ఉత్తరం వచ్చింది సర్ ? ” అంటూ ప్రకటించాడు అచలపతి అనంతరం నిద్రలేవగానే.

    “ ఎవరి దగ్గర్నుంచి " మత్తుగా అడిగేడు అనంతరం కాఫీ కప్పు అందుకుంటూ.

    “ రాంపండు గారి దగ్గర్నుండి "

    “ సుమనోహరితో ప్రణయం విఫలమయింది కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నానని, ప్రేమికుల పట్ల వ్యవహరించే విధానం ఇది కాదని లోకానికి నా ద్వారా సందేశం పంపిద్దామనుకుంటున్నాడా ? ”

    “ ఉత్తరం పైన రాసిన సెంటు అటువంటి ఉద్దేశ్యాలున్నట్టు కనబరచడం లేదండి. పైగా ఇది మైలారం అనే ఊరునుండి వచ్చింది.”

    “ ఇక చెప్పకు. వీడి కథ విని, విని బోరు కొట్టేస్తోంది. వీడు మళ్ళీ ఇంకో పల్లెటూరి చేరి అక్కడ ఓ కుర్రాడుకి ట్యూషన్ మేష్టర్ గా కుదురుకుని ఉంటాడు. వాడి అక్కనో,అమ్మనో వలచి, వరించి నాకు చెప్తాడు. వాళ్ళు నాకు బంధువులయి కూచుంటారు.చివర్లో వీడు ఘొల్లుమంటాడు.అసలు వీడు ప్రేమ గాథలకు అంతే ఉండదా,నాకు తెలియక అడుగుతాను. అచలపతీ! ” అని విసుక్కుంటూనే ఉత్తరం చింపి చదివేడు.

    ఈసారి రొటిన్ కంటే భిన్నంగా ఉందని అనంత్ కి ఒప్పుకోక తప్పలేదు. వీణాపాణి అనే ఈ అమ్మాయికీ, రాంపండు ట్యూషన్ చెప్పే అబ్బాయితో చుట్టరికం లేదు.అంతేకాదు, అనంత్ తో కూడా చుట్టరికం ఏమీ లేదు.పైగా వాళ్ళది ఆ ఊరు కాదు.వాళ్ళ నాన్న ఆర్కియాలజిస్టు. మైలారంలో వచ్చి తవ్వకాలు నిర్వహిస్తున్నాడట. వీణాపాణి, తమ్ముడు కూడా వచ్చి తండ్రి దగ్గర ఉంటున్నాడు.మిగతా విషయాలు మాత్రం షరా మామూలే.ఆ అమ్మాయి ఎప్పటిలాగానే భారతదేశంలో పుట్టిన వీనస్.నడిచిన చోటల్లా వసంతం.నవ్వినప్పుడల్లా పూలవాన.ఇంతకు ముందు రాంపండు ప్రేమించిన అమ్మాయికీ తీసిపోని లేవల్లోనే ఉంది.రాంపండు ఆ అమ్మాయిని చూస్తేనే మెలికలు తిరిగిపోతున్నాడట.అందువల్ల అనంతూ, ఆచలపతీ వచ్చి ప్రేమ సఫలం చేసే ఉపాయాలు చెప్పాలట.

    ఉత్తరం మడుస్తూ " ఆచలపతీ, వీడు ప్రేమలో పడ్డ ప్రతిసారీ ఇంత కొత్తగా ఫీలవడం, ఆ అమ్మాయిని పలకరించలేకపోవడం వింతగా లేదూ ? ”అన్నాడు అనంత్.

    “ సూర్యుడు ప్రతీరోజూ ఉదయిస్తున్నా ఏ రోజుకారోజు ఉదయం ప్రెష్ గానే ఉంటుంది కదా సర్" అన్నాడు అచలపతి.

    “అలాగా, మనకు పెద్దగా తెలియదులే.కాస్త ఆలస్యంగా లేస్తాను కదూ" అంటూ అనంత్ అప్పటికి తన ఆశ్చర్యాన్ని కట్టిపెట్టాడు కానీ రెండు రోజుల తర్వాత మైలారంలో రాంపండు స్వయంగా తన ప్రేమకథ వినిపిస్తున్నాప్పుడు మళ్ళీ అడిగిచూశాడు.ఆ సమయంలో రాంపండు అనంతాన్ని ఓ మట్టిదారి పక్కనున్న పోదలమధ్య కూచోపెట్టి ఉన్నాడు.వీణాపాణి వాళ్ళ తమ్ముణ్నితీసుకుని సాయంత్రం వాకింగ్ కి వచ్చేదారి అదేట!ప్రశ్న విని రాంపండు మరింత ఆశ్చర్య పడ్డాడు.

    “ ఆ దేవత ఎదుటపడి నిలవడమే కష్టం.ఆ తేజస్సు అలాటిది.పలకరించడం కూడానా, చాల్లే ఎవరైనా వింటే నవ్విపోతారు.” అని కేకేలేశాడు. చివరికి రాంపండు ఎదురుచూసిన ముహూర్తం రానే వచ్చింది.అప్సరసలు కూడగట్టుకుని వీణాపాణి వేషంలో ఆ దారిన రావడం జరిగింది. కానీ ఆమె ఒంటరిగా లేదు.పక్కన ఖాకీ ఫాంటు, చొక్కా టక్ చేసుకున్న పొడగరి యువకుడు తోడుగా ఉన్నాడు! రాంపండు మూర్చపోయి వెనక్కి పడిపోయాడు.కానీ పోదల్లోని ముళ్ళు గుచ్చుకోవడంతో లేచి కూచున్నాడు. కొద్ది గంటల్లో అచలపతి పూర్తి సమాచారం అందచేసాడు.ఆ ఊళ్ళో అతనికి తెలిసున్న బట్లర్ చెప్పినదాన్ని ప్రకారం ఆ యువకుడి పేరు - పరశురామ్.తవ్వకాలలో ప్రసిద్ధుడు. వీణాపాణి తండ్రికి అతనంటే అభిమానం.అతను లేకపోతే పనిసాగదని చెప్పి హేడాఫీస్ తో మాట్లాడి ప్రత్యేకంగా రప్పించాడు. పెళ్లి కాలేదు. వీళ్ళ పక్కనున్న క్వార్టర్స్ లోనే ఉంటున్నాడు. రాత్రిళ్ళు గిటార్ వాయిస్తూంటాడు.వీణాపాణి తన కొచ్చినంత వరకు చిన్న పియానోలాంటి సింథ సైజర్ వాయిస్తూంటుంది. ఇవి వింటూనే రాంపండు అమాంతం అచలపతి కాళ్ళ మీద పడినంత పని చేశాడు.

    “ అచలపతీ, నువ్వే ఏదో ఒకటి చేసి, ఈ కథ తక్కినవాటిలా ముగిసిపోకుండా చూడాలి. విలన్ ఇంత గ్లేమరస్ గా ఉండడం ఏమీ బాగా లేదు.మంచి ఉపాయం చెప్పి వీణాపాణి దగ్గర నా గ్లామర్ పెంచు " అని బతిమాలేడు. అచలపతి గొంతు సవరించుకున్నాడు.

    “కథలో మలుపులు రాకుండా పోవు సర్. నా మిత్రుడు చెప్పిన దాని ప్రకారం వీణాపాణి గారికి తమ్ముడంటే వల్లమాలిన అభిమానం. మీరు అతన్ని మచ్చిన చేసుకుంటే తప్పకుండా ఆమెకు దగ్గరవుతారు " అన్నాడు.

    అనంతానికి మాత్రం చికాకు వేసింది.

    “అచలపతీ, నువ్వ చెప్పేది పరమపాత సలహా. ఈ ఐడియా ఆ పరుశురామ్ కి కూడా వస్తుంది.” అని తీసిపారేశాడు. అచలపతి మాత్రం నిబ్బరంగానే ఉన్నాడు.

    “ ఇదీ కాల పరీక్షకు తట్టుకున్న ఫార్ములా సర్. పైగా పగలంతా పరశురామ్ కి గొడ్డలి పెట్టి తవ్వడానికే సరిపోతుంది.రాంపండు గారి దగ్గర బోల్డంత ఫ్రీ టైమ్ ఉంది ".

    *****

    రెండు వారాలు గడిచేయి.వీణాపాణి తమ్ముడు తనకు బాగా దగ్గరయ్యాడని రాంపండు ఉత్తరాలు రాస్తున్నాడు. అమ్మయ్య అని నిట్టూరుస్తూండగానే ఓ రోజు టెలిగ్రాం రాంపండు నుండి!

    ” వచ్చి నన్ను కాపాడు. లేదా ఎవరైనా పంపి నా శవాన్ని తెప్పించుకో "అని.

    “కథేమిటి ఇలా అడ్డం తిరిగింది, ఆచలపతీ ?”అని అడిగేడు అనంత్. అచలపతి దగ్గర సమాచారం రెడీగా ఉంది.అతని బట్లర్ ప్రెండ్ ఎప్పటికప్పుడు వార్తలు పంపుతూనే ఉన్నాడు.రాంపండు జీవితంలోకి భూషణం మళ్ళీ ప్రవేశించాడు.రాంపండు వేంవరంలో ఉండే రోజుల్లో ఇదే భూషణం స్కూలు ఆటల పోటీలపైన పందాలు కాసి రాంపండుని నానారకాలుగా ఏడిపించుకుతిన్నాడు.ఇప్పుడు అతనూ మైలారంలో బంధువులింట్లో తేలాడుట. రాంపండు కొత్త ప్రేమగాథ వినగానే దానిమీద బ్రాకెట్టు ఆడడం మొదలుపెట్టాడట.వీణాపాణి రాంపండుని వరిస్తుందా,పరశురాముణ్ని వరిస్తుందా అన్న సంగతి మీద పందాలు కాయమని ప్రోత్సహించి, కరక్టయితే ఇన్ని రెట్లు అన్ని రేటు ఫిక్స్ చేశాడట.తమ్ముడి ద్వారా వీణాపాణికి రాంపండు దగ్గరవ్వడం చూసి జనాలు రాంపండే పెళ్ళాడతాడని పందాలు కాశారట

    . “బానే వుంది. రాంపండు హాట్ ఫేవరేట్ అయ్యాడన్నమాట " అని సంతోషించబోయాడు అనంత్.

    “ కానీ అతను నెగ్గితే భూషణం వ్యాపారానికి దెబ్బ తగులుతుంది.అందుకని ఓ కుట్ర పన్నాడు సర్. ఓ రోజు సాయంత్రం వీణాపాణి తమ్ముడిని వెంటబెట్టుకుని రాంపండు మార్కెట్ కి వెళితే, అక్కడ భూషణం కనబడ్డాడు. అతని వెంట ప్రెసిడెంటు పేరయ్యగారి కొడుకు - వీణాపాణి తమ్ముడి వయస్సే - ఉన్నాడు. కుర్రాళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ ఇడ్లీలు తినగలరో అన్న విషయం చర్చకు వచ్చింది. భూషణం, రాంపండు పందాలు వేసుకున్నారు.కుర్రాళ్ళు కూడా సై అన్నారు.పోటీ భీకరంగా సాగింది. వీణాపాణి తమ్ముడు రాంపండు తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయలేదు. పొట్ట పగిలేట్లా టిని పేరయ్యగారి అబ్బాయిని ఓడించాడు. కథ ఇక్కడితో ఆగి వుంటే బాగుండిపోను సర్. కానీ మర్నాడు పొద్దున్న కుర్రాళ్లిద్దరూ పొట్టలు చేత్తో పట్టుకుని బాధ పడడం, డాక్టర్లను పిలిపించడం జరగడంతో వీణాపాణికి సంగతంతా తెలిసిపోయింది.

    రాంపండు తన తమ్ముడి ప్రాణాలతో చెలగాటం ప్లస్ జూదం ఆడాడని తెలిసి ఆమె అసహ్యించుకొని రాంపండుకి ఆ మాట చెప్పేసింది.దాని పర్యవసానమే ఈ టెలిగ్రాం సర్."అని ముగించాడు అచలపతి.

    “ఇంత చెప్పినవాడిని, మరి వీణాపాణి అభిమానం ఎలా చూరగొనాలో ఏదో ఒక ఉపాయం చెప్పకూడదా,అచలపతీ " అన్నాడు అనంత్ విసుగ్గా.

    “నా ఉద్దేశ్యంలో రాంపండుగారు సాంఘిక సేవ చేసి గ్రామ ప్రజల ఆదరాభిమానాలను చూరగొనడం మంచిది సర్.పదిమందీ మంచిగా మాట్లాడితే వీణాపాణి మనసు మారవచ్చు". ఆ ముక్కే ఉత్తరం రాసి పడేశాడు అనంత్.

    *****

    నాలుగు వారాలు గడిచేయి. ఓ రోజు అనంత్ ఇంటికి తిరిగి వచ్చేసరికి రాంపండు అతని పక్క మీద తిష్టవేసి ఉన్నాడు.సుఖంగా నిద్రపోవాలిట. లేకపోతే రాత్రి రెండు షోలు వరసగా చూడడం కష్టమట.

    అనంత్ కు తలా తోక అందలేదు.రాంపండు అందించాడు. దాని ప్రకారం అచలపతి సలహాను రాంపండు అక్షరాలా పాటించాడు.జనాలకు మొదట్లో ఉన్న సందేహాలు క్రమంగా పటాపంచలు అయిపోయాయి.రాంపండంత మంచివాడు లేడన్న సంగతి దావానంలా వ్యాపించింది.రోగోష్టి వాళ్లకు సేవలు,వృద్ధులకు పాఠాలు,పట్నం వెళ్లి రైతులకు విత్తనాలు తేవడాలు, లావాదేవీలు జరపడానికి డాక్యుమెంటు రాశి పెట్టదాలు - వేయేల, రాంపండు అందరికీ తలలో నాలుక అయిపోయాడు.

    జనాలంతా ఏకగ్రీవంగా ఈసారి రామనవమి ఉత్సవాలు రాంపండు చేతుల మీదుగానే జరగాలని నిశ్చయించారు. ముఖ్యంగా ప్రతీ ఏటా స్కూలు పిల్లల చేట వేయించే "శ్రీ రామజయం "అనే నృత్యనాటిక ఈసారి రాంపండు ఆధ్వర్యంలోనే జరగాలని యావన్మందీ ప్రతిపాదించడం, పాత కోపాన్ని పక్కకు పెట్టి ప్రెసిడెంటు పేరయ్యగారు సరేననడం జరిగింది.

    రాంపండు మంచివాడని లోకమంతా కోడై కూస్తుంటే, తను మాత్రం వేరే కుంపటి ఎందుకు పెట్టాలని వీణాపాణి కూడా రాంపండు ఎడల తన మనస్సు మార్చుకుంది.పైగా పరశురాముడికి తవ్వకాల్లో ఉన్న మజా, అమ్మాయిలను షికార్లకు తిప్పడంలో లేనట్టుంది.ఈ డ్రామా కు హార్మోనియం తనే వాయిస్తానండి.

    “అంతా బాగానే వుంది.మరి అక్కడే వుంది "శ్రీరామజయం " నాటకం సంగతి చూసుకోకుండా ఇక్కడకొచ్చి పడ్డావేం ?” అని అడిగేడు అనంతం.

    “ఆ పని మీదే వచ్చా. ఊళ్ళో పాప్ డాన్స్ పోటీలు జరుగుతున్నాయి కదా. అని చూసిన వాటిల్లో కొన్ని పాప్యులర్ ఐటమ్స్ ను ఆ నాటకంలో పెడదామని ప్లాను.ఇంక డిస్టర్బ్ చేయకు. పడుక్కోనీ,రాత్రి మూడు డాన్స్ లు వరసగా చూడాలి "అంటూ రాంపండు అటు తిరిగి పడుకున్నాడ

    “ఒరే సన్నాసీ, పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేయకు.అసలే నువ్వు వీణాపాణి మనసు దోచుకుంటావా లేదా అన్నవిషయం మీద భూషణం గాడు బ్రాకెట్టు నడిపిస్తున్నాడు. మైలారం జనమే కాదు, పక్కవూళ్ళ జనాలు కూడా ఎగబడి పందాలు కడుతున్నారు...” అన అనంతం ఏదో అంటూండగానే రాంపండు లేచి కూర్చున్నాడు.

    “ ఏమిటీ, పవిత్రప్రేమ,అదీ హృదయానిది కాదు.రెండు హృదయాలది.దాని మీద ఈ పాడు జనులు పందాలు కడతారా? వీళ్ళ నెత్తి మీద రాళ్ళు కురవ్వ? మజ్నూ కాలంలో కూడా ఇంత ఘోరం లేదనుకుంటాను.అవునొరీ, అది సరేగానీ పరశురామ్ గాడి మీద ఎన్ని రెట్లు ఇస్తున్నాడురా ? ”

    “ఛీ...నీకు సిగ్గులేదురా. నీలాటి ఆజన్మ జూదరి జన్మలో బాగుపడడురా ! భూషణం గాడు ఏదో కుట్రపన్ని నాటక ప్రదర్శన చెడగొడతాడు చూసుకోరా అని చెబుతూంటే పందెం గురించి అడుగుతావేమిట్రా ? నేను చెప్పను ఫో " అని అనంత్ విసుక్కున్నాడు.

    ఆ మర్నాడు తెల్లవారు ఝారుమున మైలారం బస్సేక్కుతూ రాంపండు అనంత్ కి ఫోన్ చేశాడు.

    “ ఒరేయ్, 'శ్రీరామజయం ' అనే పేరు ఓల్డ్ స్టయిల్ లో లేదూ, సపోజింగ్, రా... రా... రామా...రా ! అని పెడితే మోడ్రన్ టచ్ ఇచ్చినట్టూ ఉండదూ "అని. సమాధానంగా అనంత్ వినిపించిన తిట్లు వినబడ్డాయో లేదో తెలియదు గానీ మూడో రోజుకి పోస్టులో ఒక పెద్ద వాల్ పోస్టర్ వచ్చింది. మైలారం శ్రీరామ సేవా సమితి ఏప్రిల్ 22, శ్రీరామనవమి సందర్భంగా సమర్పించు అధునాతన పౌరాణిక నృత్య నాటిక " రా...రా...రామా...రా !”. కథా రచన - రాంవరం పాండురంగం (అనే రాంపండు ), గేయ రచన - రాంవరం పాండురంగం (అనే రాంపండు ), సంగీతం - రాంవరం పాండురంగం (అనే రాంపండు ), కళాదర్శకత్వం - రాంవరం పాండురంగం (అనే రాంపండు ), నృత్య దర్శకత్వం - రాంవరం పాండురంగం (అనే రాంపండు ), సాయంత్రం 7గం !!లకు రంగనాయకులు ఆడిటోరియంలో అందరూ ఆహ్వానితులే రండి, రండి, ఇది రామలీల కాదు, రాంపండు లీల.చూడండి, చూసి తరించండి, రాంపండును మెచ్చి రాముడి మెప్పు పొందండి. పోస్టర్ ను పూర్తిగా చదివేక " ఆచలపతీ, మన రాంపండుకి ఇంత కీర్తికాంక్ష ఉందని తెలియదు సుమా " అన్నాడు అనంత్ తెల్లబోతూ.

    “పల్లె ప్రజలకూ, పట్నవాసం ప్రజలకూ ఉన్న తేడా రాంపండు గారు గుర్తించినట్లు లేదు సర్.ఇంత పబ్లిసిటీని పట్నంలో భరిస్తారు గానీ, పల్లె ప్రజలు నిరసిస్తారు.భూషణం గారి అంచనా తప్పదని అనిపిస్తోంది సర్.” “ఈ ప్రదర్శన గురించి కూడా భూషణం బెట్లు కట్టిస్తున్నాడా ?”

    “అవునుసర్. ఇటు రాంపండు గారికి పెరుగుతున్న ప్రాముఖ్యత చూసి, అటు పరశురాముడి ఛామ్ చూసి ప్రజలంతా కన్ ప్యూజ్ అయి పందాలు కట్టడానికి వెనకాడుతున్నారు.అందువల్ల ఆ పెళ్లి పందాన్ని విడగొట్టి, ఈ ప్రదర్శన సక్సెస్ గురించి విడిగా పందాలు కట్టిస్తున్నాడు భూషణం. మీరు రాంపండు గారిని హెచ్చరిస్తే మంచిది.ప్రదర్శన జయాపజయాల మీద చాలా ఆధారపడి వుంది "

    “ నాటక ప్రదర్శనకు రమ్మనమని మరీ మరీ రాశాడు.ఎలాగు వెళ్ళేది కాస్త ముందుగా వెళితే ఏదైనా పొరబాటుంటే సవరించవచ్చు " అన్నాడు అనంత్ సానుభూతి చూపుతూ. అన్నాడే కానీ మైలారం వెళ్ళినా రాంపండుని కలవడం గగనం అయిపొయింది.

    ఆ నృత్య నాటిక మీదనే తన జీవితమంతా ఆధారపడినట్లు,తన యావచ్చక్తి నీ, యావత్ సమయాన్నీ దానికే కేటాయించాడు రాంపండు. తన స్క్రీన్ ప్లేలో వేలుపెడితే స్నేహితుడని కూడా చూడకుండా చంపేస్తానన్నాడు. దానికి తోడు ఊరి ప్రజల ఉత్సాహం కూడా ఉరకలు వేస్తోంది. ఈసారిపట్నవాసం కుర్రాడొకడు వచ్చి కొత్త, కొత్త చమక్కులు చూపబోతున్నాడని, అవేమిటో చూడాలనీ ఆరాటపడుతున్నారు. భూషణం పని యమబిజీగా ఉంది.

    ప్రదర్శన రోజు ఆడిటోరియం నిండిపోయింది.గుండెలు పీచుపీచుమంటుండగా అనంత్ ఆడిటోరియం వెనక బెంచీలో - ఏదైనా ఆఘాయిత్యం జరిగితే పారిపోవడానికి వీలుగా గుమ్మం దగ్గర కూచున్నాడు. కాసేపు పోయాక చూస్తే పక్కనే పళ్ళికిలిస్తూ భూషణం " ఏంటి గిరాకీ ?” అన్నాడు అనంత్ కళ్ళేగరేస్తూ.

    “ చెప్పు.నాటకం పూర్తిగా ఆడుతుందో లేదో పందెం కడతావా ? రేట్లు చెబుతాను "అన్నాడు సిగ్గుమాలిన భూషణం.

    “ చస్తే కట్టను.నువ్వేదో చేసి ఈ నాటకం చెదగొడతావనిపిస్తోంది.” అన్నాడు అనంత్ ఒళ్ళు మండుతుండగా.

    “రాంపండు ఉండగా ఇంకోడికి ఆ చాన్సెందుకిస్తాడు ?” అన్నాడు భూషణం వెకిలినవ్వు నవ్వుతూ అంటూనే "అదిగో ఆడిటోరియ ఎలక్ట్రీషియన్. అతనితో కాస్త పనుంది.వస్తా " అని పరిగెట్టాడు.

    నాటకం తెర తీశాక మొదటి రెండు సీన్సులోనూ రాంపండు ఉనికి తెలియలేదు.అంటే బొత్తిగా తెలియలేదని కాదు. పిల్లలు డైలాగులు చెప్పడం మర్చిపోయినప్పుడల్లా అతని కంచుకంకంఠం మైకులో సంభాషణలు అందిస్తోంది.'ఆ ప్రాంప్టింగుగాడికి మైకు తీసేసి, ఈ పిల్లలకు పెట్టండేస్" అంటూ అరిచేడో గడిగ్గాయి ఆడియన్స్ లోంచి.

    ”మైకులో సంభాషణలు అందించునది -రాంవరం పాండురంగం (అనే రాంపండు )”అంటూ వెక్కిరించాడు

    ఇంకొక గ.గా హాల్లో భూషణం మనుష్యులు నలుమూలలా కాసుకుని ఉన్నట్టు అనుమానం వచ్చింది అనంతానికి.

    అంతలోనే సడన్ గా కరెంట్ పోయి హాలంతా చీకటయిపోవడంతో ఆ అనుమానం బలపడింది.

    రాంపండు ఈ అవకాశాన్ని విడదలచుకోలేదు. “లేడిస్ అండ్ జెంటిల్మన్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి లైట్లు పోయాయి " అని స్టేజి మీద నుండి ఎనౌన్స్ చేసాడు.

    “వాటె తెలివి !వాటె తెలివి !వాటె డిస్కవరీ !వాటె డిస్కవరీ !” అంటూ గడుగ్గాయిలు ప్లస్ ఆకతాయిలూ అరిచారు.

    “ఈ అద్భుతమైనా ఎనౌన్స్ మెంటు చేయువారు -రాంవరం పాండురంగం (అనే రాంపండు )”అంటూ పాత గడుగ్గాయి మళ్ళీ అరిచాడు.

    హాలంతా గొల్లుమని నవ్వులు. ఐదు నిమిషాల తర్వాత లైట్లు వచ్చినా, పది నిమిషాల దాకా సద్దుమణగలేదు.చీకట్లో సీట్లు మార్చేసిన వాళ్ళ మీద, కాళ్ళు తొక్కేసిన వాళ్ళ మీద పోట్లాడేవాళ్ళు ఎక్కువయిపోయారు.స్టేజి మీద నడిచేది ఎవరూ పట్టించుకోవడం లేదు.పరిస్థితి అదుపులోకి తేవడానికి డైరెక్టరు రాంపండు అమోఘమైనా ఆలోచన ఒకటి చేశాడు.హఠాత్తుగా ఎక్కణ్ణుంచో హనుమంతుడు వెలిశాడు.వెలిసి డిస్కో డాన్స్ చేసేశాడు.జనాలంతా నిర్ఘాంతపోయి చూడడంతో సైలంటు అయిపోయారు.

    నాటకం ముందుకు సాగింది.కాస్సేపటికి శూర్పణఖ వచ్చి లక్ష్మణుడ్ని చూసి "అమ్మ నీ కమ్మని కోత " పాట అభినయిస్తుండగా రాంపండు ప్రెసిడెంటుగారిని మచ్చిక చేసుకునేందుకు దాచుకున్న బ్రహ్మాస్త్రం బయటకు లాగేడు.

    “వేదిక మీదకు వచ్చి బాల కళాకారులతో బాటు ఆడి, పాడి వారిని ఉత్సాహ పరచవలసినదిగా ప్రెసిడెంటు పేరయ్య గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను "అని ఎనౌన్స్ చేసేశాడు.

    అందరు ఆయన కేసే చూడడంతో పేరయ్య గారు తెల్లబోయి, మొహం ఎర్రబోయి, విసవిసా బయటకు వెళ్ళిపోయాడు.ఆయన వెంటనే ఆయన కుటుంబం. రాంపండు

    "పోనీ మునసబుగారు....” అంటూ ఇంకోళ్ళను పిలవబోతుండగా కరణం గారు వింగ్స్ లోకి పరిగెత్తుకుని వెళ్లాడు.వెంటనే ఆయన రాంపండుని మందలించినది మైకులో వినబడింది కూడా

    " మీ పట్నవాసాల్లా ఉండదిక్కడ. చాటుమాటు సరసాలే కానీ స్టేజెక్కి గంతులేయ్యరు.రేపాయన ఊళ్ళో తలెత్తుకు తిరగాలా ? ”

    “ ఈ పల్లెటూరి గబ్బిలాయిలతో ఇదే గొడవ. ఏదీ స్పోర్టివ్ గా తీసుకోరు " అంటూ రాంపండు విసుక్కున్నది కూడా గట్టిగానే వినబడింది.దానికి సమాధానంగా హాల్లో విజిల్స్, కేకలు, లైట్లు పోవడం జరిగింది.'ఈ చెత్త వాగుడు వాగినది -రాంవరం....”అంటూ పాత గడుగ్గాయి మళ్ళీ గళం విప్పాడు.

    నాటకానికి హైలెట్ క్లయిమాక్స్ లో పెట్టాడు రాంపండు. అది సిటీలో చూసిన ఓ పాప్ గ్రూప్ సాంగ్ లోంచి సరాసరి పిక్కాడు. స్టేజి మీద నటీనటులంతా "ఆరంజెస్, ఆరంజెస్, నీకో ఆరంజ్,నాకో ఆరంజ్ " అంటూ నారింజ కాయలు జనాల్లోకి విసురుతారు.అంటే నిజం నారింజకాయలు కాదు. ఆ ఆకారంలో వూలుతో చేసినవన్నమాట.

    అదీ అందమైన అమ్మాయిలు అలవోకగా, తమాషాగా విసురుతుంటే ప్రేక్షకులు పులకరించి పోతారు. రాంపండు కూడా అలా పులకరించిపోయాకనే దాన్ని తన నాటకంలో ప్రవేశపెట్టాడు.రాముడి పట్టాభిషేక సమయంలో జనాలంతా ఆనందం పరవళ్ళు తొక్కుతూ,ఇలా నారింజకాయలు విసురుతారని వాడి కల్పన.

    ఆలోచన వరకు బాగానే ఉంది.కానీ దాన్ని అమలు చేయడంలో వచ్చింది చిక్కు.ఈ నాటకంలో ఉన్నవి నిజం నారింజకాయలు.అవి కూడా పిల్లలు యధాశక్తీ కొద్దీ, జబ్బసత్తువ కొద్దీ, ప్రేక్షకులలోకి విసిరికొట్టారు.

    స్టేజికి అల్లంత దూరంలో కూచున్న అనంత్ మొహం మీద కూడా ఒకటి తగిలి చితికి కళ్ళలోకి రసం చిప్పిల్లిందంటే ఆ దృశ్యం ఎంత రసాభాస అయిందో ఊహించుకోవచ్చు.

    నారింజ దెబ్బలు తప్పించుకోవడానికి జనాలంతా లేచి పరుగులు పెట్టారు.కొన్ని డైరక్టుగా తగిలితే, కొన్ని గోడలకు కొట్టుకుని చితికి నెత్తి మీద రసం పోశాయి. కళ్ళు మండడంతో కొందరు కసికొద్దీ అవే నారింజకాయల్ని పట్టుకుని స్టేజి మీదకు విసిరేశారు.ఆకతాయిలు ప్లస్ గడుగ్గాయిల గుంపు ఈ విషయంలో ప్రధాన పాత్ర వహించింది.గాలిలో ఎక్కడ చూసినా నారింజకాయల వాసనే, నారింజకాయల బాంబులే.

    రాంపండు పరిస్థితి ఎలా వుందో చూడడానికి అనంతం స్టేజి మీదకు పరుగులు పెట్టాడు. అప్పటికే లేటయ్యింది. వీణాపాణి రాంపండును ఛడామడా తిట్టి, జన్మలో తనకు మొహం చూపించవద్దందిట.

    ” ఏమిట్రా ఇది ?” అంటే రాంపండు సగం ఏడుస్తూ చెప్పాడు

    "నేను పూలు నారింజకాయలే చేయించానురా. బోల్డు డబ్బు తగలేశా. కానీ భూషణం గాడు పిల్లలకు లంచం పెట్టి అసలు నారింజకాయలు పెట్టాశాడట.రిహార్సల్స్ లో నేను కాస్త స్ట్రిక్ట్ గా ఉండటంతో పిల్లలకు కూడా విసుగుపుట్టి వాడి ఐడియాకు సరేననేశారట.ఎంత అన్యాయమో చూడు ".

    “ అది తర్వాత చూస్తాను కానీ నువ్వు ముందు దీనికి దొడ్డిదారి ఏదైనా ఉందేమో చూడు.పారిపోయి ప్రాణాలు రక్షించుకో " అని చెప్పేసి అనంతరం స్టేజి దిగేశాడు.

    ఊరికి తిరిగొచ్చాక ఆచలపతిని పరామర్శించేడు -

    " పాపం నువ్వు చెప్పిన ప్లానులు ఫలించలేదోయ్. రాంపండు ప్రేమ మళ్ళీ ఫెయిలయింది.పాపం నీకు బాధగా ఉందేమో " అని.

    "మరీ అంట బాధలేదు సర్. రాంపండు గారి ప్రేమ ఎలాగైనా విఫలమవుతుందని నేనూ బెట్ కట్టాను. మా స్నేహితుడు ద్వారా భూషణం గారు కట్టించుకున్నారు.ఓ ఐదువందల దాకా కలిసి వచ్చిందనుకోండి ' అన్నాడు అచలపతి కాస్త వినయంగానే వంగి.

    -ఎమ్బీయస్ ప్రసాద్

                     (పి జి ఉడ్ హవుస్ రాసిన "ది మెట్రోపాలిటన్ టచ్ " కథ ఆధారంగా )

     

  • Prev
  • Next