• Prev
  • Next
  • మై డియర్ రోమియో - 47

    Listen Audio File :

    Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

     

    మై డియర్ రోమియో - 47

     

    స్వప్న కంఠంనేని

     

    వైభవ్ ముందు ఆగింది హనిత.
    వైభవ్ ఆమె మొహంలోకి చూశాడు. భావరహితంగా వుందామె మొహం.
    వైభవ్ కి టెన్షన్ గా అనిపించింది. స్టిఫ్ గా నిలబడ్డాడు.
    హనిత నెమ్మదిగా అంది.
    "నా దగ్గర పిచ్చి వేషాలేయకు. నేనసలే మంచిదాన్ని కాదు. ఇప్పటికే నలుగుర్ని చంపేశాను. ఎంత మందిని?''
    వైభవ్ స్టన్ అయ్యాడు.
    "ఎంతమందిని?'' రెట్టించింది హనిత.
    బిత్తరపోయి చూస్తున్న వైభవ్ ని చూసి నవ్వింది హనిత.
    చూపుడువేలిని అతనికేసి చూపిస్తూ హస్కీ స్వరంతో చెప్పింది.
    "లవ్ యూ సో మచ్ వైభవ్!!!''
    మరుక్షణం చుట్టూ మూగినవాళ్ళ విజిల్స్ తో కాలేజీ క్యాంపస్ దద్దరిల్లింది.
    జీవితంలో మొదటిసారిగా సిగ్గుపడింది హనిత.
    హనితని అడ్మైరింగ్ గా చూస్తుండిపోయాడు వైభవ్.
     ఒకమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే వాళ్ళకు ప్రపంచమంతా అద్భుతంగా కనిపించడమే కాక తామిద్దరమే వున్నట్టుగానూ, భూమి, ఆకాశం, ప్రకృతి అంతా తమ కోసమే సృస్టించబడ్డట్టుగాను కనిపిస్తాయి.
    ప్రస్తుతం అదే పరిస్థితిలో వున్నారు హనిత, వైభవ్ లు.
    "మేడ్ ఫర్ ఈచ్ ఆదర్'లా వున్న హనిత, వైభవ్ ల జంటను చూస్తూ చిలిపి కామెంట్స్ విసురుతూ ఎంజాయ్ చేయసాగారు స్టూడెంట్స్.
    సరిగ్గా అప్పుడే "ఆగండి'' అన్న స్వరం వినిపించింది.
    తెలుగు సినిమాలలో క్లైమామ్స్ సీన్ లో వచ్చి విలన్ చెప్పే రొటీన్ చీప్ డైలాగ్ వినిపించేసరికి అందరూ ఆశ్చర్యంగా తలలు తిప్పి చూసారు.
    ఆమె మీనా!
    "ఏమండీ! నన్నన్యాయం చేస్తారా? నన్ను ప్రేమించానని ఇన్నాళ్ళు నాకు మాయమాటలు చెప్పి ఇప్పుడు యింత మోసం చేస్తారా?'' వైభవ్ తో అందామె.
    ఫక్కున హనిత పగలబడి నవ్వసాగింది. మీనా, వైభవ్ లు కూడా ఆమెతోపాటే నవ్వసాగారు.
    స్టూడెంట్స్ వాళ్ళతో జత కలిపారు.
    "వైభవ్! మన పెళ్ళి జరుగుతుందంటావా?'' అడిగింది హనిత.
    పార్క్ లో పచ్చగడ్డి మీద కూర్చుని వున్నారు వాళ్ళు. వైభవ్ ఎదురుగా హనిత ఒక కాలు మడిచి విలాసంగా ఠీవీగా కూర్చుంది.
    ప్రేమలో పడ్డ వాళ్ళలో వాళ్ళకు తెలీకుండానే కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయి. కళ్ళలో మెరుపు, బుగ్గల్లో ఎరుపు, పెదాల్లోకి రక్తం తన్నుకొచ్చి ఉబ్బి అందంగా కనిపిస్తాయి.
    అసలే అందమైన జంట. మరీ ముచ్చటగా, ముద్దుముద్దుగా కుందేలు పిల్లల్లా వున్నారు చూడడానికి.
    "తప్పకుండా జరుగుతుంది హనీ'' స్థిరంగా చెప్పాడు వైభవ్.
    "మరి మన పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతేనో?'' అమాయకంగా ఉంది హనిత మొహం.
    "ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పారిపోయి అయినా సరే పెళ్ళి చేసుకుందాం సరేనా?''
    "అప్పటివరకూ ఎందుకు? ఇప్పుడే ఎక్కడికైనా పారిపోదామా?'' కొంటెగా అంది హనిత.
    "ఇక నువ్వు జోకులేయడం ఆపి మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే మంచిది'' సీరియస్ గా మొహం పెట్టి చెప్పాడు వైభవ్.
    "ఈ బుద్ధు నాకెక్కడా దొరికాడురా బాబూ! అస్సలు రోమాన్స్ తెలియదు. ఇతనితో ఎలా కాపురం చేయాలిరా దేవుడా'' తల నేలకేసి కొట్టుకుంది హనిత.

  • Prev
  • Next