'పగలే వెన్నెలా, జగమే ఊయలా...'

పగలే వెన్నెలా. జగమే ఊయలా - కదిలే ఊహలకే కన్నులుంటే' సినారె గారి అద్భుత కవిత్వం. చిన్నప్పటి నుంచీ నా మనస్సులో ముద్రించుకు పోయిన పాట ఇది. పూజాఫలం సినిమాలో జమున అందమైన కళ్ళతో అభినయం. ఊహ తెలిసే రోజుల్లో, ఓ ఎండాకాలం వెన్నెల రాత్రి మా సరోజిని అత్తయ్య ఈ పాట పాడగా మొదటిసారి విన్నాను, అప్పటి నుంచీ ఈ పాట ఎక్కడ విన్నా, ఆగి పూర్తగా వినాల్సిందే. అంతగా కట్టివేసిందీ పాట నన్ను. ఓ మిత్రుడు అన్నట్లు కొన్ని పాటలు కళ్లు మూసుకొని వినాలి. కొన్ని చెవులు మూసుకొని వినాలి.

ఈ పాట ఖచ్చితంగా కళ్లు మూసుకునే వినాలి. మిమ్మల్ని ఎక్కడో వెన్నెల నిండిన ప్రశాంత తీరాలకి తీసుకెళ్లి వదులుతుంది. దేవుడు మనకిచ్చిన వరాల్లో వెన్నెల ఒకటని నా స్వచ్చమైన అభిప్రాయం. వెన్నెలని అనుభవించని జీవితం అమావాస్యే. వెన్నెలకు వసంత కాలం తోడయిందనుకోండి పెసరట్టు ఉప్మా చందమే. వాడ్రేవు వీరలక్ష్మీదేవి 'ఆకులో ఆకునై' అనే ఓ గొప్ప భావుకత్వం వున్న పుస్తకాన్ని రాసింది.

దాంట్లో ఆమె ఇలా అంటుంది - 'అక్టోబర్ నెలా, మార్చి నెలా - ఈ రెండు నెలలూ, సంవత్సరం మొత్తానికి వరాల్లా అనిపిస్తాయి, మిగిలిన కాలమంతా ముసురు, ఎండ, ఉక్క, చలి. అయినా భరిస్తాం. మార్చి వస్తుంది. వసంతం వస్తుంది అక్టోబర్ వస్తుంది. శరత్తు వస్తుంది. అన్న చిరు ఆశతో తక్కిన కాలాలను స్థిమితంగా భరించగలగడమే కదా సాధనా.' ఎంత నిజం! మార్చి నెలలో కనీసం ఒక్క నిండు పున్నమి వెన్నెల రాత్రన్నా మీరు ఆరు బయట పడుకుని, మంచి వెన్నెల పాటల్ని వినకపోతే మీ ఖర్మ. పిండారబోసినట్లు వెన్నెల, చల్లటి గాలి, కమ్మని సంగీతం,

ఇంతకంటే ఏం కావాలండి బాబూ మనసుని ఆనందంతో నింపడానికి. కొంతమంది రసిక రాజులు ఇంకొంచెం ముందుకు వెళ్లి - 'చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపంలో...' అంటూ వెన్నెల రాత్రుల్లో చల్లటి గాలిని వేడెక్కించడానికి ఇంకో మార్గం కనిపెట్టారు. ఆయనెవరో కవి కాబట్టి సరిపోయింది గాని. నాలాంటి మర్యాదస్తుడు, ఏకపత్నీ వ్రతుడు అలా ఊహించకూడని (పత్రికాముఖంగా ) వదిలేస్తున్నాను. అసలా మాటకొస్తే, చాలా మంది కవుల హృదయాల్లో మరులు గోల్పేది వెన్నెలే. బాల గంగాధర్ తిలక్ అయితే ఏకంగా, 'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అని కమిట్ అయిపోయాడు.

ఆ స్ఫూర్తినే. యండమూరి 'వెన్నెల్లో ఆడపిల్ల' అని ఓ మాంచి రొమాంటిక్ పుస్తకం రాసేశాడు. బహుశా వెన్నెల్లో ఆడపిల్ల అందం ద్విగుణీకృతం అవుతుందేమో! వచ్చే పున్నమి నాడు మా ఆవిడని వెన్నెల్లో నుంచోపెట్టి చూడాలి - మరిచిపోకుండా. తెలుగు సిన్మాలో వెన్నెలని, కన్నుల పండుగగా వాడుకున్నారు చాలామంది. వెన్నెలలో, నదీవిహారం 'లాహిరి లాహిరి లాహిరిలో' మాయాబజార్ దృశ్యం ఎవరయినా మరిచిపోగలరా! 'తారా చంద్రుల విలాసములతో - విరిసే వెన్నెల వరవడిలో - పూల వలపులో ఘుమఘుమలాడే పిల్ల వాయువుల లాలనలో' అని ఏఎన్నార్, సావిత్రి పాడుకుంటే ఎన్ని పిల్ల గుండెలు ప్రేమతో నిండి పొలెదూ!!

వెన్నెల పాటల్లో, నాకు చాలా నచ్చేపాట – ఆరాధనలో 'వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా' అనే పాట. ఆ టెర్రస్ మీద ఏఎన్నార్ ని నిద్ర పుచ్చుతూ స్వాంతనంగా సావిత్రి పాడుతుంటే - నా మది నింగా వెన్నెలే. ఇంకో చిలిపి వెన్నెల పాట గుర్తురాక మానదు ఈ సందర్భంలో. 'ఈ వెన్నెలా - ఈ పున్నమి వెన్నెలా - ఈనాడూ, ఆనాడూ ఒకే వెన్నెలా' కవి ఎన్ని సొగసులు పోయాడో ఈ పాటలో. “ఒంటరి వాళ్లు ఒపనది - జంటకు చాలీ చాలనది" అట వెన్నెల. కొత్తగా పెళ్లయిన జంటలూ ఇంకా ఆలస్యం దేనికి? మళ్లీ సంసార సాగరం మిమ్మల్ని ముంచేలోపు తొందరగా వెన్నెల రాత్రులని అనుభవించండి.

చివరగా తిలక్ గారి భావ కవిత్వంలో వెన్నెలమ్మకి వీడ్కోలు నీరాజనాలు పలుకుదాం. “ఈ రాత్రి నిద్రిత సర్వధాత్రి మీద ఎవరు ఈ తళుకు తళుకు కలల పుప్పొడిని వెదజల్లారు! ఎవరీ మెరిసే ముఖమల్ జంపఖానా పరిచి వెళ్లారు! వ్యధలతో, బాధ్యతలతో, భయాలతో మహితమైన నా మనస్సుకు ఇప్పుడూరట కలుగుతోంది. ఈ వెన్నెల నా మనస్సులోకి జారుతోంది.. నా గుండె పగుళ్ల నిండి కారుతోంది. నా అంతరాంతర రంగస్థలాన ఏకాకి నటుడైన నన్ను తన మైత్రీ మధుర భావంతో కమ్ముకుంటుంది. నా లోపలి గుప్త వీణ తంత్రీ నివహాన్ని వేపధు మృదులాంగుళుల తాకి పలికిస్తోంది. నన్ను బతికిస్తోంది - నా బతుక్కి ఆనందాన్ని, అర్ధాన్నీ ఆశనీ రచిస్తోంది.