జీవితం ఓ నాటక రంగం

జీవితం ఓ నాటక రంగం అనుకుంటే ఆ నాటకానికి రింగ్సైడ్ సీట్లు దొరికేది మా డాక్టర్లకే. ప్రపంచంలో ఏ ఇతర వృత్తిలోనూ, మనుషుల గుండెల్లోకి తొంగిచూసి, వాళ్ల భయాల్ని, బాధల్నీ అంత దగ్గరగా పంచుకునే అవకాశం లేదు డాక్టర్లకి తప్ప. ప్రతి డాక్టరూ తమ అనుభవాల్ని అక్షర రూపంలో పెట్టగలిగితే కొన్ని వేల రహస్యాలతో కూడిన మహోద్ర్గంథాలు తయారయ్యేవి.

మా వృత్తిలో ఏ రెండు రోజులూ ఒకలాగా వుండవు. అందుకే డాక్టర్ జీవితంలో స్తబ్ధత, బోరు రొటీన్ అన్నమాటలే దొర్లవు. రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు. రకరకాల ప్రవర్తనలు. రకరకాల స్పందనలు. ఇదో హ్యుమన్ ఎమోషనల్ కలిడోస్కోప్. ఈ ప్రయాణంలో ఎంతమందో తారసపడ్తుంటారు. కానీ కొందరే గుర్తుండిపోతారు. తీపినో, చేదునో మిగిల్చి పోతారు. పోయిన సంవత్సరం మాటిది. సోమవారం ఓపి చాలా బిజీగా ఉంది.

రూమ్ లోకి వీల్ చెయిర్ లో ఓ 80 ఏళ్లాయన, వాళ్ళావిడ (70) వచ్చారు. వీళ్లని చక్రవర్తి దంపతులు అందాం. కలకత్తా నుంచి వచ్చారు. భార్యకి ఎల్వీ ప్రసాద్ లో కాటరాక్ట్ ఆపరేషన్ కని వచ్చారట. ఆయనకి మోకాళ్ల నొప్పులకి నా దగ్గరకొచ్చారు. ఇద్దరూ పెద్దరికానికి ప్రతీకగా చరమాంకంలో ఒకరికొకరు అనే భావన కళ్లలో కాంతులీనుతుండగా, ఆది దంపతుల్లా అగుపించారు. “మోకాళ్ళు బాగా అరిగిపోయాయి. ఆపరేషన్ చేసి కొత్త జాయింట్స్ వేయాలి" అని చెప్పాను చక్రవర్తి గారికి.

“మా ఆవిడ కాటరాక్ట్ కి సరిపడే డబ్బులే ఉన్నాయి. మాకిక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు. కలకత్తాలో ఇల్లు అమ్మిన తర్వాత కాని ఆపరేషన్ చేయించుకోలేను" అని ఆయన చాలా నిస్సహాయంగా చెప్పిన మాటలెందుకో హృదయాన్ని కలిచివేశాయి.

పిల్లలు (పిట్టలు) ఎగిరిపోయినాక ఎందరో ఇలాంటి ఒంటరి తల్లిదండ్రులు అనారోగ్యం పాలై హాస్పిటల్స్ చుట్టూ, మాలాంటి డాక్టర్ల కోసం పడిగాపులు కాస్తూ బ్రతుకు బండిని లాగడానికి ఎన్ని కష్టాలు పడుతుంటారో. విదేశాల్లో అయితే వయస్సు మీదపడ్డా ఎవరిమీదా ఆధారపడనక్కర్లేదు . ప్రభుత్వాలు బోల్డన్ని రాయితీలు, సదుపాయాలు కల్పిస్తాయి. నాలో కల్గిన ఆ హృదయ ప్రకంపన, వెంటనే నాతో "మీరు తర్వాత ఇల్లు పైకం పంపిద్దురు. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోండి” " అనేట్లు చేసింది.

ఆయన కళ్లలో ఒలికిన కృతజ్ఞతాభావం మరువలేనిది. ఇలాంటి క్షణాలు చాలు, జీవితంలో ధన్యత పొందడానికి. వెంటవెంటనే చక్రవర్తిగారి మోకాళ్ల ఆపరేషన్. ఆమె కళ్ల ఆపరేషన్ దిగ్విజయంగా జరిగిపోయాయి. రోజూ రౌండ్స్ లో వాళ్లిద్దరూ నాకు మనస్పూర్తిగా అందించే పొగడ్తలు అభినందనలు వింటుంటే ఆనందంగా, ఉండేది. ఆ తర్వాత వారంరోజులకే నేను మూడు వారాల పాటు అమెరికా వెళ్లడం జరిగింది.

వెళ్ళే ముందురోజు చక్రవర్తి గారు, నా చేతులు పట్టుకుని "బాబూ, నీ మేలు జన్మలో మరిచిపోలేను. మళ్లీ నడిపించావు. నేను కలకత్తా వెళ్లిన తర్వాత డబ్బులు పంపిస్తాను" అని కళ్లనీళ్లతో వీడ్కోలు పలికారు.

మా వాళ్లందరూ, “సర్ ఇక ఆ డబ్బుల గురించి మర్చిపోండి. ఈ ముసలాయన కలకత్తా వెళ్లి ఇల్లు అమ్మి, ఇక మీ డబ్బు పంపించినట్లే. గాంధీగారి ఖాతాలో రాసుకోండి" అంటూ నా దయాగుణం గురించి జోకులు వేసుకుంటున్నారు. నేను అమెరికా నుంచి వచ్చాక, పేషంట్లు అందరి గురించీ ఎంక్వయిరీ చేస్తుండగా నా సెక్రటరీ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. చక్రవర్తికి, నేను వెళ్లిన మర్నాడే హార్ట్ ఎటాక్ వచ్చిందనీ, ఎమర్జెన్సీ బైపాస్ చేశారనీ, కానీ ఫలితం లేకపోయిందనీ, నా హాలిడే పాడు చేయడం ఎందుకని నాకు చెప్పలేదనీ, చక్రవర్తి మరణం చాలా బాధ కలిగించింది.

నా ఆపరేషన్ బిల్లు, తర్వాత బైపాస్ ఆపరేషన్ బిల్లు అంతా కలిపి మూడు లక్షల దాకా బాకీ ఉంటే ఆ పైకం నేనే కట్టి ఆ దంపతులకి ఏ జన్మలోనో రుణం ఉండి, ఇలా తీర్చుకున్నాను అనుకుని నా రొటీన్ లో పడిపోయాను.

అలా వాళ్ళు నన్ను ఓ పిచ్చోడిలాగా అనుకుని "సర్. ఇక మీరు అప్పులు పెట్టడం మానండి, ఎందుకయినా మంచిది మోచేయి ఎక్స్ రే తీయించుకోండి, ఎముకఉన్నాయో లేదో" అంటూ జోకులేసుకున్నారు.

ఆ తర్వాత మూడు నెలలు గడిచాయి. ఓ రోజు పోస్ట్ లో ఇంగ్లీష్ లో రాసిన ఉత్తరం, దానితో పాటూ 3 లక్షల రూపాయల చెక్కువచ్చాయి, చక్రవర్తి గారి భార్య పంపింది.లెటర్ సారాంశం "డాక్టర్ గారూ! మీ మేలు మరిచిపోలేదు. మా ఆయన చివరిగా నాతో అన్నమాట డాక్టర్ గారి బాకీ ఉంచుకోవద్దని. పైకం సమకూర్చుకోవడంలో ఆలస్యం జరిగింది. ఏమీ అనుకోవద్దు" అని.

ఆ చెక్కు తిరిగి పంపించేద్దామనిపించింది. కానీ ఆమె జీవితాంతం నాకు రుణగ్రస్తురాలిగా భారాన్ని మోయాల్సి వస్తుంది కదా అని ఆపని చేయలేదు. కానీ ఆ డబ్బు నా అకౌంట్ లో వేసుకోవడానికి మనసొప్పలేదు. ఆ డబ్బుని, తర్వాత కొంతమంది బీదపేషంట్లకి ఉపయోగించి మనసు బరువు దించుకున్నాను. మానవవత్వం విలువలు ఇంత ఉన్నతంగా, ఉదాత్తంగా ప్రరర్శించిన చక్రవర్తి గారి భార్య ఎక్కడున్నా హృదయాంజలి ఘటించాలి.

ఇలాంటి వ్యక్తులు, కోటికి ఒకరుంటే చాలదా ప్రపంచంలో మంచితనాన్ని బతికించడానికి. 'నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన' అని వేటూరి గారు ఎప్పుడో అన్నారు. ఈ నాటకరంగంలో ఎన్నిరకాల నటనలో, కొంతమంది గొప్ప విద్యావంతులు, డాక్టర్లతో అన్ని రకాల సేవలు పొంది, చివరకు బిల్లు కట్టాల్సిన టైంలో తగాదా పెట్టుకుని ఎగ్గొట్టి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు.

మరి ఏమీ చదువుకోని 75 ఏళ్ళ పండు ముదుసలి, ఉన్న ఒక్క తోడును పోగొట్టుకుని ఉన్న ఇంటిని అమ్ముకుని, నాకు డబ్బులు పంపిందే. ఆమె పంపకపోతే నేను ఏమీ చేయనని, చేయలేనని తెలిసి కూడా. నా చుట్టూ ప్రక్కల అసూయ, అత్యాశ, మోసం కరాళ నృత్యం చేస్తున్నప్పుడల్లా ఆమె గుర్తొచ్చి నా మదిలో ఆశాజ్యోతి వెలిగిస్తుంటుంది.