TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఈ మాటన్నది ఓ భావకవి. ‘కడుపు నిండుగా ఉంటే ప్రతిరోజూ పండగే’ అన్నాడింకో ఆకలి కవి. పెద్దయిన తర్వాత ఇది నిజమేమో గానీ, చిన్నప్పటి రోజుల్లో మట్టుకు పండుగ రోజులు స్పెషల్. ఒక్కో పండుగ ఒక్కో రకమైన సందడి, ముందస్తుగా ప్రతి పండుగ రోజు గారెలు, పాయసం చేసేది అమ్మ. తర్వాత కొత్త బట్టలు ఇంకో స్పెషల్. ఇంకా పెద్ద థ్రిల్ ఏంటంటే ఆరోజు చదువుకోన్నక్కర్లేదు. ఇన్ని మంచి విషయాల్లో ఒక్కటే తెగ బోరుగా ఉండేది. తలంటుకోవడం. షాంపూ సౌకర్యం కూడా లేదప్పుడు.
కుంకుడు రసం కళ్లలోకి పోయినప్పుడు మంటలు, ఈ తలంటు ఏ వెధవ కనిపెట్టాడో! సంక్రాంతి పండుగకి అమ్మమ్మ వాళ్ళూరు వెళ్లేవాళ్లం. అది సత్తెనపల్లి తాలూకాలో క్రోసూరు అనే పల్లెటూరు. ప్రక్కనే మూడు మైళ్ళ దూరంలో పీసపాడు అని ఇంకో పల్లె. పిన్ని వాళ్ళూరు. సంక్రాంతి పండుగ మట్టుకు ఖచ్చితంగా పల్లెలోనే ఎంజాయ్ చేయాలి. చలిరోజులు. అయినా ఉదయమే జీవగాడు మమ్మల్ని లేపి చలిమంటలకు రెడీ చేసేవాడు. ఎండుగడ్డి, పిడకలలో మంట వేసేవాడు. పిల్లలందరం చెవులు, తల గుడ్డలతో కప్పుకుని చుట్టూ కూచుని చలి కాచుకునే వాళ్లం. ఆ చలిలో ఊదితే నోట్లో నుంచి పొగలాగా వచ్చే సీను అదరహో, నోట్లో పుల్ల సిగరెట్టు స్టైల్ లో పెట్టి ప్రతి ఒక్కడూ చెయిన్ స్మోకర్లాగా కటింగ్ ఇచ్చేవాడు.
తర్వాత సూపర్ బ్రేక్ఫాస్ట్, వేడి వేడి బోన్నన్నంలో, తీయని పెరుగు. వరి అన్నం ఉందిరా’ అని మా అమ్మమ్మ గోల చేసినా నాకు ఇదే ఇష్టంగా ఉండేది. ఎందుకంటే బాపట్ల వెళ్తే మళ్లీ దొరకదు. ఈలోపు ఇంటిముందు సంక్రాంతి ముగ్గులు, గొబ్బిళ్ళు తయారయ్యేవి. ముగ్గులు తొక్కకుండా గొబ్బిళ్లపైన మందార పూలు పెట్టడం మాలాంటి పిల్ల హీరోల పని, బాపుబొమ్మ లాంటి అందమైన అమ్మాయిలు ఎవరూ కనపడ్డట్టు గుర్తులేదు ఆ రోజుల్లో. మా అమ్మమ్మో, ఇంకో ముసల్లమ్మో ముగ్గులేసినట్లు గుర్తు. తర్వాత అందరం మా అవ్వని బ్రతిమిలాడో, దొంగతనం చేసో తలో ఒక గిద్ద జొన్నలు సంపాదించి బయట అరుగు మీద కూచుని ఎదురు చూసేవాళ్లం. ఎవరికోసం? ఇంకెవరికోసం – గంగిరెద్దు బసవన్న కోసం.
జొన్నలు లంచం ఇస్తే గంగిరెద్దుతో ట్రిక్ చేయించే వాడు. ఆ మూగజీవి బసవన్న ప్రశ్నలు అర్ధమయినట్లు తల ఊపడం చూసి తెగ సంబరపడే వాళ్లం. అరిసెలు లేకపోతే సంక్రాంతే లేదు. పండగకు నాలుగు రోజులు ముందునుంచే అమ్మ, అమ్మమ్మ అందరూ కూచుని తెగకష్టపడి అరిసెలు వండేవాళ్ళు. అరిసెల పిండి దొంగతనం చేసి దాచిపెట్టుకుని కొంచెం కొంచే తింటుంటే ఏ స్విస్ చాక్లెట్ కి ఆ రుచి ఉంటుంది చెప్పండి. సంక్రాంతి సాయంత్రం, ఊరు బయట తాటితోపుల్లో కబడ్డీ పోటీలు జరిగేవి. ఆ రోజుల్లో వాళ్ళే మాకు టెండూల్కర్ లు, ధోనీలు. రాత్రికి డేరా టాకీసులో సిన్మా. మా మేనమామ ఊరు సర్పంచి కాబట్టి మనకి విఐపి సీట్లు. అంటే చెక్క కుర్చీలు, ఇంటర్వెల్ లో సోడా, శెనక్కాయలు.
Life is so good. చలిమంటతో మొదలయ్యి డేరా టాకీసులో సిన్మాతో పరాకాష్టకు చేరుకునేది సంక్రాంతి పర్వదినం. ఆ మర్నాడు చిన్నమ్మ వాళ్ళూరికి ప్రయాణం. అక్కడ మళ్ళీ ఇంకో పండుగ. అక్కడ దొరికే తీయని పెరుగు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకలేదు నాకు. ఇక దీపావళి. నాకు అత్యంత ఇష్టమైన పండగ. అప్పటికీ ఇప్పటికీ కూడా. చిన్నప్పుడు పరీక్షలప్పుడు ఎలా తయారయ్యే వాళ్ళమో గుర్తులేదు కానీ దీపావళి వస్తుందంటే నెలరోజుల ముందునుంచే తయారు. నెలనెలా జీతంలో మిగిల్చి, కూతురి పెళ్లికి తండ్రి ఏ రకంగా డబ్బు సమకూర్చుకుంటాడో అంతకంటే భీకరంగా పావలాలు, అర్ధరూపాయిలు పోగుచేసి రోజు ఓ చిచ్చుబుడ్డో, ఓ లక్ష్మీ బాంబో కొని దాచేవాళ్లం. దాచడం ఎందుకంటారా? నాన్నకి తెలిస్తే చివరికి అసలు సామాను కొనడానికి డబ్బులు ఇవ్వరేమో అని.
ఈ చాచిన సామాన్ని మళ్ళీ ఎవారికీ తలియకుండా మేడమీద ఎండబెట్టాలి కదా! దీపావళి రేవనగా, నాన్న డబ్బులిచ్చే వాడు. తపాకాయలకి నేను, మా బాబాయి తమ్ముళ్ళిద్దరం కలిసి వెళ్లి సామాను కొనేవాళ్లం. పాముబిళ్ళలు, కాకరపువ్వోత్తులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, మతాబులు, లక్ష్మిబాంబులు వగైరా, వగైరా. దీపావళి ఉదయం, అందరి కంటే ముందు లేచే వాళ్లం. టపాకాయలు ఎండపెట్టాలి కదా. మేడ మీద కాకులు రాకుండా కాపలా డ్యూటీలు వేసుకుని. మా బాబాయికి డ్యూటీ ఉండేది కాదు. పెద్ద బాసు కదా. మా అమ్మ ప్రతి దీపావళికి నాకు తెగ ఇష్టమైన మైసూర్ పాక్ చేసేది. మైసూర్ పాక్ లు బొక్కుతూ రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూపులు. పగలంతా తుపాకీ బిళ్లలు మాత్రం పేల్చుకోవడానికి పర్మిషన్.
మాలాంటి అర టిక్కెట్లందరికీ ఒక్క బిళ్ళ మాత్రమే పెట్టి పేల్చే తుపాకీ ఉండేది, మా బాబాయికి మట్టుకు, నిజం తుపాకీ లాగా ఉండి వర్సగా పేల్చుకునే తుపాకి బిళ్లలుండేవి. పెద్ద కటింగ్ ఇచ్చేవాడు. రాత్రి అవ్వగానే పండగే పండగ, అమ్మ పెట్టిన ప్రమిదలతో ఇల్లంతా కళకళ. నెల రోజులు కష్టపడి పోగుచేసిన టపాకాయలన్నీ ఒక్క గంటలో అయిపోయేవి. కొన్నిసార్లు నాన్న స్నేహితుడు ఓ పోలీస్ సబ్ ఇన్ పెక్టర్ గారు మరిన్ని టపాసులు పంపేవారు. అక్కడ డబుల్ ఆనందం. ఇంకో గంట కాల్చేవాళ్లం. ‘చేతులు కాలతాయి జాగర్త’ అని నాన్న అరుపులు. ఈలోపుగా ఎవరో ఒకరికి కాలో చేయో కొదోగొప్పో కాలడం కూడా మామూలే. వెంటనే ‘బర్నాల్’ ఆయింట్ మెంట్ ప్రత్యక్షం. జీవితానికి రివైండ్ బటన్ ఉంటే నా మొదటి స్టాప్, చిన్నప్పటి దీపావళి పండుగ రోజుకే.
|