TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 66
ముచ్చర్ల రజనీ శకుంతల
"అయామ్ జెన్నిఫర్..." చెప్పింది టిఫిన్ చేయడం పూర్తయ్యాక.
"హమ్మయ్య...ఇప్పటికైనా మీ పేరు చెప్పారు. బైదిబై..అయామ్ శ్రీకర్. ఎట్ యువర్ సర్వీస్ చైర్మన్ ని" చెప్పాడు పర్సులో నుంచి తన పర్సనల్ విజిటింగ్ కార్డు తీసి ఆమెకిస్తూ.
"ఏంటీ...మనమిక విడిపోదాం అని చెబుతున్నారా?" అంది జెన్నీఫర్.
"అదేంటి...ఎలా ఎందుకనుకున్నారు?"
"విజిటింగ్ కార్డు యిస్తే మరేమిటి అర్థం..మళ్లీ కలుద్దామనేగా..అంటే ఇప్పుడు విడిపోదామనేగా..."
శ్రీకర్ కు ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు.
"నేను పజిల్ లా కనిపిస్తున్నాను కదూ..."
"మామూలు పజిల్ లా కాదు. క్రాస్ వర్డ్ పజిల్ లా..." నవ్వి అన్నాడు.
"సరే..స్ట్రయిట్ పాయింట్ కు వచ్చేస్తాను. నేను మరోవారం రోజుల్లోగా స్టేట్స్ కు వెళ్ళిపోతున్నాను. నా క్రెడిట్ కార్ద్సు, డబ్బు వున్న బ్యాగుపోయింది. అఫ్ కోర్స్ పోలీస్ క్లయింట్ యిచ్చాను. కానీ దొరుకుతుందన్న నమ్మకం లేదు.
ఈవారం రోజులుగా హోటల్ ఖర్చులు, ప్లస్ నా ఖర్చులకు రోజూ రెండు వేలు కావాలి. ఈవారం రోజులు నేను మీ గెస్ట్ ని అనుకోండి. ఆ అమౌంట్ మీరు 'పే' చేయండి. అందుకు ప్రతిఫలంగా..." ఒక్కక్షణం ఆగి అతని వైపు చూసి నవ్వి, అతని చేతిని తన చేతిలోకి తీసుకొని, మృదువుగా నొక్కి వదిలింది.
శ్రీకర్ కు ఒక్కసారిగా ఎగిరి గంతేయాలనిపించింది.
"బట్..వన్ కండీషన్. ఈలోగా ఏ రోజైనా నా బ్యాగు దొరికితే ఆ రోజుతో మన అగ్రిమెంట్ క్యాన్సిల్ ...ఈలోగా నన్ను 'యూజ్' చేసుకోవచ్చు..."
"నేను మూడువేలు ఇస్తాను. ఏమైనా అభ్యంతరమా?" అడిగాడు శ్రీకర్ హుషారుగా జెన్నిఫర్ వంక చూస్తూ.
"ఎందుకు...డిస్కౌంట్ ఆఫర్ ని వదులుకొని, ఎక్స్ ట్రా యివ్వడం.."
"మీ నిజాయితీ నచ్చింది కాబట్టి..మీకు ఎంత అవసరమో ...అంతే అడిగారు. అందుకు ప్రతిఫలంగా వేల్యూని అంచనా కూడా వేయలేని ఆనందాన్ని అందిస్తున్నారు."
"వెరీగుడ్...ఇంగులో కూడా నిజాయితీనా?" అంది జెన్నిఫర్.
"నిజాయితీ అన్నది దేనిలోనైనా ఉండాలి కదా" శ్రీకర్ అన్నాడు.
"సరే...ఈరోజు నుంచే మన అగ్రిమెంట్ మొదలవుతుంది. మీరు నైట్ ఎయిట్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ఇదిగో..నా హోటల్ పేరు, రూమ్ నెంబర్..." అంటూ ఓ పేపర్ మీద హోటల్ పేరు, రూమ్ నెంబర్ రాసిచ్చింది.
శ్రీకర్ పర్సుతీసి మూడు వేలు తీసి జెన్నిఫర్ కు యిచ్చాడు.
"ఈ డబ్బు తీసుకొని నేను మిమ్మల్ని మోసం చేస్తే? అసలు నేను యిచ్చింది రాంగ్ అడ్రస్ కావచ్చుగా...ఏ నమ్మకంతో నాకు ఈ డబ్బు యిస్తున్నారు?"
"నామీద నాకున్న నమ్మకంతో నేనెప్పుడూ మనుష్యుల్ని తప్పుగా అంచనా వేయనని నా నమ్మకం"
"సరే...నా క్రెడిట్ కార్డు...హ్యాండ్ బ్యాగ్ మరో నాలుగైదు రోజుల వరకూ దొరక్కూడదని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అంది జెన్నిఫర్.
శ్రీకర్ నవ్వి "మీ కోరికే నా కోరిక..మీకో విషయం చెప్పనా...డెడ్ బాడీని సైతం బెడ్ మీదికి రప్పించే స్టన్నింగ్ స్ట్రక్చర్ మీది..." అన్నాడు.
"ఇది బెడ్ మీద చెప్పాల్సిన డైలాగ్" అంది జెన్నిఫర్.
దూరం నుంచి ఇదంతా గమనిస్తోన్న జేమ్స్ బాండ్ కు వాళ్ళ మాటలు సరిగ్గా వినిపించడం లేదు.
శ్రీకర్ ఒక్కడే కారులో బయల్దేరడం గమనించాడు.
తనిప్పుడు ఆ అమ్మాయిని ఫాలో అవ్వాలా? శ్రీకర్ నా? ఒక్కక్షణం ఆలోచించి...శ్రీకర్ నే ఫాలో అవ్వడం బెటరనే డెసిషన్ కు వచ్చాడు.
* * *
శ్రీకర్ ఆఫీసులోకి ఎంటరవ్వగానే లూసీ నవ్వుతూ ఎదురొచ్చింది.
"లూసీ! నాకు ఎదురు రావడాల మీద నమ్మకముండదు కానీ, ఎందుకో నువ్వు ఎదురు రావడం ఆనందాన్ని కలిగిస్తూంది. రోజూ ఇలానే ఎదురురా...అలా అని దిష్టి తీయడాలు వద్దు" నవ్వుతూ అన్నాడు.
"సర్....ఇవ్వాళ మీ అపాయింట్ మెంట్స్ వివరాలు..." అంటూ ఏదో చెప్పబోయింది.
"ముందు నన్ను రిలాక్స్ అవ్వనీ..అన్నట్టు నువ్వు టిఫిన్ చేసావా?"
"చేసాను. నేను స్టే చేసిన హోటల్ లో కాదు. మన ఆఫీసు చివరనున్న హోటల్ లో" చెప్పింది లూసీ.
"దట్స్ గుడ్...అక్కడ పెసరట్టు, ఉప్మా బావుంటుంది. ప్రియంవదకు రవ్వదోశ అంటే యిష్టం" చెప్పాడు శ్రీకర్.
లూసీ నవ్వి అంది "మరి మీకు?"
"మిక్స్ డ్ టిఫిన్లు...అన్నీ కలిపి కొద్దికొద్దిగా టెస్ట్ చేయడంలో థ్రిల్ వుంటుంది" అన్నాడు లూసీ వైపు చూసి.
లూసీకి టాపిక్ మరోవైపు వెళ్తోందని అర్థమైంది.
శ్రీకర్ బ్రీఫ్ కేసు టేబుల్ మీద పెడుతూ "లూసీ...ఓ బ్రోకర్ కి చెప్పాను. మంచి ప్లాట్ ఒకటి చూడమని. రెండు మూడ్రోజుల్లో చూస్తాడు. అప్పటివరకూ హోటల్ లో స్టే చేయ్.
హోటల్ మేనేజర్ కు ఫోన్ చేసి చెప్పాను. నీ రూమ్ బిల్లు, లంచ్, డిన్నర్...అన్ని బిల్లులూ ఆఫీసుకు పంపించమని చెప్పాను"
"అదేంటి..నేను కదా...పే చేయాల్సింది" అంది లూసీ.
"నీకు అకామిడేషన్ దొరికే వరకూ ఆ బాధ్యత ఆఫీసుదే. అన్నట్టు ఇవ్వాళ నైట్ ఓ అపాయింట్ మెంట్ వుంది. మరిచిపోకుండా గుర్తుచెయ్" అన్నాడు శ్రీకర్.
"చెప్పండి సార్...ఏమిటది?"
"నైట్ ఎయిట్ వో క్లాక్ కి ఓ అమ్మాయిని కలవాలి" చెప్పాడు శ్రీకర్.
|