జగన్నాథుని రథోత్సవం పండుగతో సమానం. చాలా దేవాలయాల్లో రథోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. ఉత్సవ విగ్రహాలతో రథాలను ఊరేగిస్తారు. ముఖ్యంగా పూరీలో జగన్నాథుని రథ యాత్ర మహా వైభవంగా జరుగుతుంది. జగన్నాథుని రథోత్సవాన్ని చూట్టానికి భక్తులు దేశం నలుమూలల నుండీ తరలివస్తారు. రథోత్సవాన్నిరెండు కళ్ళూ చాలవు.
రథోత్సవం కోలాహలంగా, కనుల పండుగ్గా ఉంటుంది గనుక దాని గురించి చాలా చెప్పుకుంటాం. కానీ, అసలు రథోత్సవం జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటో మనకు అంతగా తెలీదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గొప్ప భక్తి భావన ఉన్నప్పటికీ దేవాలయానికి వెళ్ళి దణ్ణం పెట్టుకునేంత వీలు, వెసులుబాటు అందరికీ, అన్నిసార్లూ ఉండదు. కనీసం పర్వదినాల్లో అయినా దేవుణ్ణి దర్శించుకోవడం అవసరం అని పెద్దలు చెప్పారు. పండుగ రోజుల్లో భగవంతుని ప్రార్ధించుకోవడంవల్ల మనకు మేలు జరుగుతుంది. దేవుని కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి. అందుకే అలాంటి శుభ దినాల్లో ఆలయాల్లో మరింత రద్దీ ఉంటుంది. ఇసుక వేస్తే రాలనట్టుగా భక్తులు తండోపతండాలుగా వస్తారు.
మామూలుగానే గుడికి వెళ్ళడానికి అవకాశం లేనివారికి ఇంత జనసందోహంతో, కొండవీటి చాంతాడులా బారులు తీరి, భక్తులతో కిక్కిరిసి ఉన్న ఆలయానికి వెళ్ళడానికి అసలే వీలు కుదరదు కదా! పనుల హడావిడితో వెళ్ళలేని వారి సంగతి అలా ఉంచితే, అనారోగ్యంతో, వృద్ధాప్యంతో, వైకల్యంతో నిస్సహాయులై వెళ్ళలేనివారు కొందరుంటారు. మరో ముఖ్యమైన సంగతి ఏమంటే, పూర్వం రోజుల్లో కొన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అలా అణచివేతకు గురైన కులాలవాళ్ళు దేవుని దర్శించుకోవాలని తపించేవారు.
ఏ కారణంగా అయితేనేం, దేవుని దర్శించుకోవాలని ఎంతో తపన ఉండీ, గుడికి వెళ్ళలేక బాధపడే వారికోసం ఏర్పాటు చేసిందే రథోత్సవం. ఆలయంలో ఉండే మూలవిరాట్టును ఎటూ కదల్చలేరు. కదిలించకూడదు. కనుక మూల విరాట్టుకు బదులుగా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. రథాన్ని వీధివీధిలో, ఇంటింటికీ తిప్పుతూ అందరికీ దేవుని దర్శనం అయ్యే అవకాశం కలిగిస్తారు. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారు.
రథోత్సవాల్లో చుట్టుపక్కల ప్రజలంతా పాల్గొంటారు. ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళలేకపోయినవారంతా ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని భక్తిగా నమస్కరించుకుంటారు. సంతృప్తులౌతారు. ఇక జగన్నాథుని రథోత్సవం గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. అతి పెద్ద రథం గనుక వేలాదిమంది కలిసి లాగుతారు. రథాన్ని లాగడం అదృష్టంగా భావిస్తారు.
జగన్నాథుని రథోత్సవంలో మన ధ్యాస, ధ్యానం అంతా దేవునిపైనే నిలపాలి తప్ప రథాన్ని అలంకరించిన తీరు, రథంముందు ఏర్పాటు చేసే ఆటపాటలు, వచ్చిన జనసందోహం మొదలైన అంశాలపై కాదు. గుడికి వెళ్ళలేకపోయినా, మన ముందుకు వచ్చిన దేవునికి భక్తిగా నమస్కరించుకోవాలి.