మ్యాంగో పాపడ్

 

 

కావలసిన పదార్థాలు:

మామిడిపండ్లు                          - నాలుగు
చక్కెర                                      - వంద గ్రాములు
యాలకుల పొడి                        - ఒక చెంచా
నెయ్యి                                     - రెండు చెంచాలు

తయారీ విధానం:
ఇది వేసవిలో మాత్రమే చేసుకోగల స్నాక్ ఐటమ్. ఒక్కసారి చేసి దాచుకుంటే సంవత్సరమంతా తినవచ్చు. ముందుగా మామిడిపండ్లను తొక్క తీసేసి, మిక్సీలో వేసి మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి, వేడెక్కాక మ్యాంగో ప్యూరీ వేయాలి. రెండు నిమిషాలు ఉడికించాక చక్కెర వేయాలి. చక్కెర కరిగి పాకంలా అవుతున్నప్పుడు మంట బాగా తగ్గించేయాలి. ఉండలు కట్టకుండా, అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడుతున్నప్పుడు యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దించేసి చల్లార బెట్టాలి. ఓ ప్లేట్ కి గానీ, పాలిథీన్ షీట్ కి కానీ నెయ్యి రాసి... దానిమీద మ్యాంగో మిశ్రమాన్ని వేసి పల్చగా పరవాలి. దీన్ని రెండు మూడు రోజుల పాటు బాగా ఎండబెట్టి, ముక్కలుగా కోసి డబ్బాలో పెట్టాలి. ఇవి చాలాకాలం నిల్వ ఉంటాయి. పిల్లలకి బాగా నచ్చే స్నాక్ ఐటమ్ ఇది.


- Sameera