చిల్లీ పనీర్

 

 


పనీర్ వంటకాలు ఎన్ని వెరైటీలు ఉన్నా ప్రతీ దానికి ఒక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. అందులో ఈ చిల్లీ పనీర్  రెసిపీలో పనీర్ లోని కమ్మదనం, మిర్చి లోని కారం రెండు కలిసి తయారయ్యేసరికి నోరూరించే రుచి మన సొంతమవుతుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారుచెయ్యాలో చూద్దామా.

కావాల్సిన పదార్థాలు:

పనీర్ - పావు కేజీ

కాప్సికం - 2

ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు

కార్న్ ఫ్లోర్ - 2 స్పూన్స్  

మైదా - 1 స్పూన్

చిల్లీ గార్లిక్ పేస్ట్ - 1 స్పూన్

సోయా సాస్ - 1 స్పూన్

సన్నగా తరిగిన వెల్లుల్లి - 1 స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 స్పూన్

జీలకర్ర - 1/2 స్పూన్

ధనియాల పొడి - 1 స్పూన్

చైనా సాల్ట్ - చిటికెడు

కరివేపాకు - 2 రెమ్మలు

కొత్తిమీర - 1 కప్పు

పచ్చి మిర్చి - 5

నిమ్మరసం - 1 స్పూన్

ఉప్పు, కారం - తగినంత

తయారీ విధానం:

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్పు, కార్న్ ఫ్లోర్, 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని  నీళ్ళు పోసి అందులో పనీర్ ముక్కల్ని వేసి కలపాలి. కావాలనుకుంటే కాస్త మైదా పిండిని కూడా చల్లచ్చు. అలా ఉన్న పనీర్ ముక్కల్ని నూనెలో వేయించి  తీసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద  కడాయి పెట్టి నూనె వేసి జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కాప్సికం ముక్కలు వెయ్యాలి. ఉల్లిపాయ కాస్త వేగాకా ధనియాల పొడి, చిల్లి గార్లిక్ పేస్ట్, సోయా సాస్, కరివేపాకు, కాసిని నీళ్ళు పోయాలి. అందులో తగినంత ఉప్పు కారం వేసి నిమ్మరసం పిండి, వేయించిన పనీర్ ముక్కల్ని కూడా వేసి ఆ గ్రేవీ అంతా పనీర్ ముక్కలకి పట్టేలా కలపాలి. దాని మీద కొత్తిమీర గార్నిష్  చెయ్యటమే. టేస్టీ టేస్టీ చిల్లీ పనీర్ రెడీ.


..కళ్యాణి