ఆలు పులుసు మెంతి కూర
కావలసిన వస్తువులు:
బంగాళా దుంపలు - అర కిలో
పోపుసామాను - తగినంత
కరివేపాకు - నాలుగురెబ్బలు
పచ్చిమిర్చి - ఆరు
ఇంగువ - చిటికెడు
నూనె - చిన్నకప్పు
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
చింతపండు - నిమ్మకాయంత
మెంతి పొడికి కావలసిన వస్తువులు, తయారీ...
శనగపప్పు - రెండు స్పూన్లు
మినపప్పు - రెండు స్పూన్లు
ధనియాలు - ఒక స్పూన్
మెంతులు - స్పూన్ లో సగం
జీలకర్ర - స్పూన్ లో సగం
ఎండుమిర్చి - రెండు
స్టవ్ వెలిగించి బాణలీ పెట్టి, వేటికవి విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి . చల్లరాక మెత్తగా పొడిచేసుకోవాలి.
కూర తయారీ విధానం:
ఆలు అంటే పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టం . అయితే ఈ రోజులో ఆలు ఫ్రై లేదా ఆలు 65 ఇలా పిల్లలకి నచ్చినట్లు చేసిపెడుతూ మన పూర్వపు రుచులకి దూరం అయిపోతున్నాం . పూర్వం పెళ్ళిళ్ళు పేరంటాలప్పుడు, పండుగలకి, నలుగురు కలిసినప్పుడు బంగాళదుంప ముద్దకూర తప్పనిసరిగా చేసేవారు రకరకాల పద్ధతుల్లో. అందులో ఒక రకం కూర ఆలు పులుసు మెంతి కూర.
ముందుగా బంగాళా దుంపలని కుక్కర్‌లో ఉడికించి చెక్కు తీసి కాస్త మెదిపి పెట్టుకోవాలి. మరీ చిన్నముక్కలు చెయ్యకూడదు. పెద్దముక్కలే కూరకి రుచిని ఇస్తాయి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు వేసుకోవాలి. ఈ కూరకి పోపు కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. పోపు వేగాక చిదిమిన బంగాళాదుంప ముక్కల్ని వేసి, చిటికెడు ఉప్పు వేసి 5 నిమిషాలు వేయించాలి. ఆ తరువాత చింతపండు పులుసు పోసి, పసుపు, తగినంత ఉప్పు చేర్చి కలియబెట్టాలి. చింతపండు పులుసు ముక్కలకు అంటి, ఉడుకు మొదలయ్యాక మెంతిపొడి వేసి కలపాలి. పది నిమిషాలు మూత లేకుండా ఉడికించి స్టవ్ ఆపేయాలి. కూర దించే ముందు ఫైన చెమ్చా నూనె వేసి కలపకుండా వదిలెయ్యాలి. కమ్మటి వాసన వస్తుంది కూరకి.
ఈ కూర అన్నంలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. చింతపండు పులుపు, మెంతిపొడి కమ్మదనం కలసి కూరకి మంచి రుచి వస్తుంది.
అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మలు ఈ కూర చేసి పెట్టిన జ్ఞాపకం మదిలో మెదిలిందా? మరింకేం... మీ పిల్లలకి మన అచ్చ తెలుగు కూర రుచి చూపించండి.
-రమ