పట్టిసీమపై జగన్ పోరాటం దేనికో?

 

రాయలసీమ జిల్లాలకు నీరందించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పట్టిసీమ ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ముందుకే సాగాలనుకోవడంతో, జగన్మోహన్ రెడ్డి తన యంపీలను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి పిర్యాదు చేసారు. అయితే వారు కూడా సానుకూలంగా స్పందించకపోవడంతో, నేటి నుండి మూడు రోజుల పాటు కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో బస్సుయాత్రకి బయలుదేరారు. ఈ పట్టిసీమ ప్రాజెక్టు వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతారని వారికి నచ్చజెప్పి వారి మద్దతు కూడగట్టి దీనిపై ఉద్యమించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఒకవేళ ఈ పట్టిసీమ ప్రాజెక్టు వలన రాష్ట్రానికి నష్టం తప్ప ఎటువంటి లాభం ఉండదని కేంద్రం భావిస్తే దానిని నిలిపివేయించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ నిలిపి వేయలేదంటే అర్ధం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదులు చేయడం వలన ఆయన అధికార తెదేపాను రాజకీయంగా దెబ్బతీయలనుకొని ఉండవచ్చును. కానీ ఆ కారణంగా కేంద్రం రాష్ట్రానికి రావలసిన నిధులను త్రొక్కిపెడితే రాష్ట్రం నష్టపోతుందనే ఆలోచన ఆయనకు లేకపోవడం చాలా దురదృష్టకరం.

 

కానీ తెదేపా వాదన మరొకలా ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయినట్లయితే వైకాపాకు మంచి పట్టు ఉన్న రాయలసీమ జిల్లాలలో పొలాలకి నీరు అందుతుంది కనుక, అక్కడి రైతాంగం తమకు నీళ్ళు అందించిన తెదేపా వైపు మళ్ళిపోయినట్లయితే ఇక తమ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయంతోనే ఈ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని వాదిస్తోంది. రాష్ట్రంలో ఒక్క వైకాపా మాత్రమే దీనిని ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆలోచిస్తే మాత్రం తెదేపా చేస్తున్న వాదనను నమ్మవలసి వస్తోంది. వచ్చే ఏడాదిలోగా ఎట్టి పరిస్థితులలో కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారానే రాయలసీమకు నీళ్ళు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చాలా దృడంగా చెపుతున్నప్పుడు వైకాపా వాదనలు అర్ధరహితం అవుతాయి.

 

వైకాపా వాదిస్తున్నట్లు ఒకవేళ ఈ ప్రాజెక్టు వలన రాయలసీమకు ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోయినా లేదా దీనివలన కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు తీవ్ర నష్టం కలిగినా లేదా ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయినా దాని వలన మొట్టమొదట తెదేపా పార్టీకే ఎదురుదెబ్బ తగిలవచ్చును. ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వచ్చే ఎన్నికలలో అందుకు తెదేపా మూల్యం చెల్లించక తప్పదు. ఈ సంగతి తెదేపా అధిష్టానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదనుకోలేము. అంటే ఈ ప్రాజెక్టు వలన రాయలసీమ జిల్లాలకు నీళ్ళు అందించగలమనే పూర్తి నమ్మకం ఉన్నందునే రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసిందని స్పష్టమవుతోంది. అంటే వైకాపా విషయంలో తెదేపా చేస్తున్న వాదనలు కూడా నిజమేనని భావించవలసి ఉంటుంది.

 

ఇక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇదివరకు రాజధాని ప్రాంత రైతులకు అండగా నిలబడతానని, వారి తరపున తమ పార్టీ ప్రభుత్వంతో అవసరమయితే కోర్టులలో న్యాయపోరాటాలకి కూడా సిద్దమేనని హామీ ఇచ్చేరు. కానీ ఇప్పుడు ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిచి తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్లయితే వారి భూములు వారికిచ్చేస్తానని చిన్న మెలిక పెట్టడంతో రైతులు కూడా ఆయనపై నమ్మకం కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రైతుల తరపున ప్రభుత్వంతో పోరాడుతానని జగన్మోహన్ రెడ్డి మరో కొత్త హామీ ఇస్తున్నారు.

 

అయితే రైతన్నల కోసం అంటూ ఆయన చేస్తున్న ఈ పోరాటాలన్నీ తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికేనని అర్ధమవుతున్నప్పటికీ ఆయన అంత నిర్భయంగా ప్రజలకు నమ్మబలకడం గొప్ప విషయమే. తన పార్టీ ఉనికిని, ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఆయన ఈవిధంగా ఆటంకాలు కల్పించేందుకు పూనుకోవడం శోచనీయం. పట్టిసీమ ప్రాజెక్టు వలన రాయలసీమలో వైకాపా ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కలగవచ్చని తెదేపా నేతలు చేస్తున్న వాదనలు నిజమనుకొన్నట్లయితే, ఇంతకు ముందు హుదూద్ తుఫాను, తరువాత పంట రుణాల మాఫీ, ఆ తరువాత రాజధాని భూములపై పోరాటం చేసి మధ్యలోనే విడిచిపెట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఈ పోరాటాన్ని మాత్రం ఆపకుండా కొనసాగించవచ్చును.