ఏటికి ఎదురీదుతున్న తెదేపా, బీజేపీలు

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బలహీనంగా ఉన్న బీజేపీ అక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకొంటుంటే, తెలంగాణా రాష్ట్రంలో బలహీనపడిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అక్కడ బలపడాలని అంతే గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే రెండు పార్టీలకు రెండు విభిన్నమయిన సమస్యలున్నాయి.

 

రాష్ట్ర విభజన సమయంలో ఎదురయిన సవాళ్ళను తట్టుకొని తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో బలంగా నిలబడగలిగింది. కానీ ఎన్నికలలో ఓడిపోవడంతో బాగా డీలాపడిపోయింది. అదే అదునుగా తెరాస పార్టీ అనేకమంది తెదేపా నేతలను, యం.యల్యేలను, కార్యకర్తలను పార్టీలోకి ఆకర్షించడంతో మరింత డీలాపడింది. ఇప్పటికే పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉండిపోయిన తెదేపా నేతలు మరో ఐదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉండవలసి వస్తోంది. మరో నాలుగున్నరేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల ఏ పార్టీలు ఎవరితో పొత్తులు పెట్టుకొంటాయో, విడిపోతాయో, దాని వలన రాజకీయ పరిస్థితులు ఏవిధంగా మారుతాయో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కనుక తెదేపా నేతలలో ఆందోళన నెలకొని ఉండటం సహజమే.

 

ఇదంతా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తెలియదనుకోలేము. కానీ ఆయన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత, తెలంగాణావైపు తొంగి చూసేందుకు కూడా క్షణం తీరిక ఉండటం లేదు. అయినప్పటికీ గత రెండు మూడు నెలలుగా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంతకుముందు వరంగల్, కరీంనగర్ లో చంద్రబాబు పర్యటించి అక్కడ పార్టీ సభలు నిర్వహించారు. మళ్ళీ ఈనెల 23వ తేదీన మహబూబ్‌నగర్ పట్టణంలో పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పార్టీ నేతలలో, కార్యకర్తలలో కూడా కొత్త ఉత్సాహం కలిగే అవకాశం ఉంటుంది.

 

ఇక బీజేపీ విషయానికి వస్తే ఇప్పటికీ ఆ పార్టీ ఆంధ్రాలో బలహీనంగానే కనబడుతోంది. అందుకు రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. సీనియర్ నేతల ఉదాసీన వైఖరి, మిత్రపక్షమయిన తెదేపాను విమర్శించలేని బలహీనత.

 

పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చాలా కీలకమయింది. అదేవిధంగా తమ ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసింది? ఇంకా ఏమేమి చేయబోతోందనే విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడం కూడా చాలా అవసరం. కానీ పార్టీలో సీనియర్ నేతలు ఈ రెండు అంశాలపై చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందు వలన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మందకోడిగా సాగుతోంది, ప్రజలలో పార్టీ పట్ల అపోహలు నెలకొన్నాయి.

 

కాస్త నోరు విప్పి మాట్లాడగల బీజేపీ నేతలు ఎంతసేపు తెదేపా మిత్రధర్మం పాటించడం లేదని ఆరోపించడానికే పరిమితమవుతున్నారు. నిజానికి తెదేపా నేతలు కేంద్ర ప్రభుత్వం చేసిన విమర్శల కంటే, బీజేపీ నేతల ఉదాసీనత కారణంగానే ఆ పార్టీకి ఎక్కువ నష్టం కలుగుతోందని చెప్పవచ్చును. వారు తమ పార్టీ గురించి, తమ ప్రభుత్వం గురించి, రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులు, పధకాలు, ప్రాజెక్టుల గురించి చెప్పుకోలేకపోవడంతో పార్టీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజలలో అపోహలు ఏర్పడి నష్టం జరుగుతోంది. ప్రజల అపోహలు దూరం చేసేందుకు వారు ఎటువంటి కృషి చేయకుండా, ఇతరులను ఆడిపోసుకోవడం వలన ఏమి ప్రయోజనం?

 

మిత్రధర్మం కారణంగానే తెదేపా ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించలేకపోతున్నామని వారు సమర్ధించుకోవచ్చును. కానీ కనీసం ఇతర పార్టీల నేతలు తమ ప్రభుత్వాన్ని పార్టీని నిందిస్తున్నప్పుడయినా ఎందుకు స్పందించలేకపోతున్నారో బీజేపీ నేతలో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది. ఏది ఏమయినప్పటికీ పార్టీలో సీనియర్ నేతలు నిద్రావస్థలో ఉన్నప్పుడు పార్టీలో చైతన్యం ఆశించడం కష్టమే.

 

తెలంగాణాలో తెదేపా ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులతో పోల్చి చూసుకొన్నట్లయితే ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి చాలా మెరుగుగానే ఉన్నట్లు భావించవచ్చును. కానీ తెలంగాణాలో తెదేపా ఏటికి ఎదురీది మరీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, ఎటువంటి సమస్యలు లేకపోయినా బీజేపీ నేతలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోవడం చాలా విచిత్రమే.

 

పార్టీ బలంగా ఉన్నప్పుడే అందులో నాయకులకి రాజకీయాలలో ఒక గుర్తింపు ఉంటుందనే చిన్న విషయాన్ని బీజేపీ నేతలు కూడా గుర్తుంచుకొంటే మంచిది. కనుక పార్టీ కోసం కాకపోయినా వారు తమ ఉనికిని, రాజకీయ భవిష్యత్ కాపాడుకోవడానికయినా సమిష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. లేకుంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం మాట అటుంచి వచ్చే ఎన్నికల నాటికి వారి పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో వారే ఊహించుకోవచ్చును.