నా కొడుకు దుర్మార్గుడు.. జ‌గ‌న్ బండారం బ‌య‌ట‌పెట్టేసిన విజ‌య‌మ్మ‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను ప‌ట్టిన కుదేలుకు మూడే కాళ్లు అని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో దిట్ట‌. జ‌గ‌న్ మూర్ఖత్వానికి జైజైలు ప‌లికేందుకు వైసీపీ ముఖ్య‌నేత‌లు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. దీనికితోడు వైసీపీ సొంత మీడియా, ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఉండనే ఉంది. ప్ర‌జ‌ల‌ను పిచ్చివాళ్లు అన్న‌ట్లుగా వారు ట్రీట్ చేస్తారు. తామేంచెబితే అది జనం  న‌మ్మేస్తార‌ని వారి న‌మ్మ‌కం. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో ప్ర‌జ‌లు విసుగు చెందారు. అయినా, జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు, వారి అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా మాత్రం.. ఐదేళ్ల పాల‌న అద్భుతం అంటూ ఢంకా మోగించింది.

జ‌గ‌న్ కుట్ర‌ల‌కు ఒక‌సారి బోల్తాప‌డిన ప్ర‌జ‌లు.. రెండోసారి అల‌ర్ట్ అయ్యారు. ఫ‌లితంగా 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష హోదాకూడా లేకుండా వైసీపీని నేల‌కేసి కొట్టారు. అయినా, జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల్లో మార్పు రావ‌డం లేదు. ఇక వారి అనుకూల మీడియా అయితే.. అసత్యాల, అభూత కల్పనలతో ప్ర‌జ‌ల‌ను క‌న్ఫ్యూజ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇదే విధంగా జ‌గ‌న్‌, వైఎస్ ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల వివాదంలోనూ వ్య‌వ‌హ‌రించింది. త‌న‌కు రావాల్సిన వాటా ఇవ్వాల‌ని కోరినందుకు ష‌ర్మిల‌ను అన్న క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న ఆస్తులు అప్పనంగా కాజేయడానికి చూస్తున్న చెల్లెలిగా  చిత్రీక‌రించింది. జగన్ తో  సహా వైసీపీ నేతలూ అదే తీరులో మాట్లాడారుప. ష‌ర్మిల‌దే త‌ప్పు అనే స్థాయిలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం  చేశారు.  కానీ ఈ వ్య‌వ‌హారంలో విజ‌య‌మ్మ ఎంట్రీ ఇచ్చి అసలు నిజాలు బ‌హిర్గ‌తం చేయ‌డంతో జ‌గ‌న్ ఇంత దుర్మార్గుడో మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మైంది. 

ఇటీవ‌ల వైసీపీ నేత‌లు వైవి సుబ్బారెడ్డి, విజ‌య‌సాయి రెడ్డిలు మీడియా స‌మావేశాలు పెట్టి వైఎస్ ష‌ర్మిల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆస్తిలో ష‌ర్మిలకు వెళ్లాల్సిన వాటాను వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి ఎప్పుడో రాసిచ్చార‌ని, అయితే ఇప్పుడు జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న దాంట్లో  ష‌ర్మిళ‌ వాటా అడుగుతున్నార‌ని చెప్పుకొచ్చారు. జ‌గ‌న్‌పై ష‌ర్మిళ‌ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వెనుక చంద్ర‌బాబు  ఉన్నారనీ, చంద్ర‌బాబు ఏది చెబితే అది ష‌ర్మిల చేస్తోందంటూ అభాండాలు, అవాస్తవాలతో ఇష్టారీతిగా మాట్లాడారు.  వీరే కాకుండా వైసీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా మీడియా ముందుకు వచ్చి ష‌ర్మిలపై  మూకుమ్మ‌డిగా మాట‌ల దాడి చేస్తున్నారు.  ష‌ర్మిలపై జ‌గ‌న్ స‌హా, వైసీపీ నేత‌లు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరును త‌ట్టుకోలేక పోయిన విజ‌య‌మ్మ.. తాజాగా వైఎస్ఆర్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఈ లేఖ‌లో జ‌గ‌న్ తీరు, వైసీపీ నేతల తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు చూస్తుంటే బాధేస్తోంద‌ని.. జ‌ర‌గ‌కూడ‌నివ‌న్నీ తన క‌ళ్ల ముందే జ‌రిగిపోతున్నాయ‌ని.. ఎవ‌రికి ఇష్ట‌మొచ్చిన‌ట్లు వారు మాట్లాడుతున్నారంటూ విజ‌య‌మ్మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఇదే క్ర‌మంలో జ‌గన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో కూడా ఈ లేఖ ద్వారా చటారు.  వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌తికున్న‌ప్పుడే ష‌ర్మిళ‌కు ఆస్తులు పంచారంటూ వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిలు చేసిన వ్యాఖ్య‌ల‌ు పచ్చి అబద్ధాలని విజయమ్మ కుండబద్దలు కొట్టేశారు.  ‘వైఎస్ బ‌తికి ఉండ‌గానే ఆస్తులు పంచేశార‌ని అంటున్నారు.. ఇది అవాస్త‌వం. వైఎస్ఆర్ పిల్ల‌లిద్ద‌రూ పెరుగుతున్న రోజుల నుంచి కొన్ని ఆస్తులు ష‌ర్మిల పేరు మీద‌.. అలాగే కొన్ని ఆస్తులు జ‌గ‌న్ పేరుమీద పెట్టారు. అది ముమ్మాటికీ ఆస్తులు పంచ‌డం కాదు’ అని విజ‌య‌మ్మ స్పష్టం చేశారు. 

రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌తికి ఉండ‌గా ఆస్తులు పంచ‌లేదు. ఉన్న ఆస్తుల‌ను ఒక్కొక్క‌రు చూసుకున్నారు. అంద‌రం క‌లిసి ఉన్నాం. అన్నీ కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకునే స‌రికి ఆయ‌న ప్ర‌మాదంలో వెళ్లిపోయారు. ఈ విష‌యం ఆడిట‌ర్ గా విజ‌య‌సాయిరెడ్డికి స్ప‌ష్టంగా తెలుసు అని విజ‌య‌మ్మ ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ‌శేఖ‌ర రెడ్డి చ‌నిపోయిన త‌రువాత 2019 వ‌ర‌కు క‌లిసే ఉన్నాం. డివిడెండ్ రూపంలో జ‌గ‌న్ వాటా తీసుకొని, 200 కోట్లు ష‌ర్మిల భాగానికి ఇచ్చారు. ఎంవోయూ ప్ర‌కారం.. జ‌గ‌న్ 60శాతం, ష‌ర్మిళ‌కు 40శాతం అయితే, ఎంవోయుకు ముందు స‌గం స‌గం డివిడెండ్ తీసుకునే వారు. ఎందుకుంటే వైఎస్ఆర్ చెప్పిన‌ట్లుగా ష‌ర్మిల‌కు స‌మాన వాటా ఉంది కాబ‌ట్టి. వీట‌న్నింటికి అప్పుడు ఇప్పుడూ నేనే సాక్షిని అని విజ‌య‌మ్మ పేర్కొన్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కొద్దిరోజుల‌కే ఆస్తులు పంచుకుందామ‌ని ప్ర‌పోజ‌ల్ పెట్టాడు. ఆ త‌రువాత‌నే క‌లిసి ఉన్న కుటుంబం ఆస్తుల ప‌రంగా విడిపోవాల‌ని నిర్ణ‌యం జ‌రిగింద‌ని విజ‌య‌మ్మ లేఖ‌లో పేర్కొన్నారు. ఎంవోయూ  ప్రకారం ష‌ర్మిల‌కు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యత గా ఇస్తున్నవి. అటాచ్ మెంట్ లో లేవు కాబట్టి, ఎంవోయు లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎంవోయూలో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం ష‌ర్మిళ‌కు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడని విజయమ్మ స్పష్టం చేశారు. ఇవి కూడా ఇవ్వకుండా.. ఆటాచ్ మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా ష‌ర్మిల‌కు అన్యాయం జరిగిందని లేఖలో విజయమ్మ తెలిపింది.
   
జగన్ రెడ్డి ఎంత ఘోరమైన వ్యక్తో లేఖ ద్వారా విజ‌య‌మ్మ ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా తెలియ‌జేశారు. విజ‌య‌మ్మ లేఖ‌తో వైసీపీ శ్రేణులు సైతం జ‌గ‌న్ తీరుపై మండిప‌డుతున్నాయి. వైసీపీ అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా గ‌త రెండు నెల‌లుగా ష‌ర్మిళ‌పై జ‌గ‌న్‌, ఆయ‌న బ్యాచ్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది. త‌న‌కు రావాల్సిన ఆస్తులు అడిగినందుకు ఆమెను వైసీపీ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు దూషిస్తున్నారు. ఈక్ర‌మంలో ఇటీవ‌ల ష‌ర్మిల క‌న్నీరుకూడా పెట్టుకున్నారు.  తాజాగా విజ‌య‌మ్మ లేఖ‌తో జ‌గ‌న్ సొంత చెల్లి పట్ల  ఎంత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో ప్రజలకు మ‌రోసారి అర్ధ‌మైంది. అయితే, సొంత తల్లి కూడా జగన్ క్యారెక్టర్ ను బయటపెట్టారంటే ఇక జగన్, వైసీపీ నేత‌లు   తమ‌ వాదనను సమర్థించుకుంటారో, సమర్ధించుకోగలుగుతారో చూడాల్సి ఉంది. అయినా జగన్, ఆయన బ్యాచ్, ఆయన మీడియా తీరు తెలిసిన వారు మాత్రం ఇకపై జగన్ తల్లిపై కూడా దూషణల పర్వానికి తెరతీసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.