త్రిశంకు స్వర్గంలో వల్లభనేని వంశీ

 

కర్ణుడి చావుకి వేయి కారణాలన్నట్లు విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి నుండి తొలగింపబడటానికి వల్లభనేని వంశీకి కూడా అన్నే కారణాలున్నాయని చెప్పవచ్చును. అన్నిటి కంటే ప్రప్రదానంగా చెప్పుకోవలసింది ఆయన దుందుడుకు స్వభావం, ఎవరినీ ఖాతరు చేయని లక్షణం అని పార్టీ కార్యకర్తలు అంటారు. తత్ఫలితంగా కృష్ణా జిల్లాలో ఆయనను వ్యతిరేఖించేవారే ఎక్కువయిపోవడంతో ఆయన పదవి కోల్పోయారని చెప్పవచ్చును. ఆయనను వ్యతిరేఖించే వారిలో మైలవరం శాసన సభ్యుడు మరియు కృష్ణ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు, కేశినేని నాని ఉన్నారు. వీరిరువురి ఒత్తిడి వలనే చంద్రబాబు వంశీని విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించి, దానిని కేశినేని నాని అనుచరుడయిన నాగుల్ మీరాకు కట్టబెట్టారు.

 

పార్టీకి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని వంశీకి తెదేపా కార్య నిర్వాహక సంఘానికి కార్యదర్శిగా పదవి ఇచ్చినపటికీ, గత ఏడాది ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు వంశీ వెళ్లి ఆయనను కలవడం నేటికీ పార్టీలో ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. నాటి నుండి వంశీ పై పార్టీకి అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడూ వంశీ స్నేహితులయిన వంగవీటి రాధ కృష్ణ, కొడాలి నాని ఇద్దరూ వైకాపాలోకి మారిన తరువాత కూడా వంశీ వారితో స్నేహం కొనసాగిస్తుండటం వారి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

 

ఈ నేపద్యంలో వంశీ పార్టీలో తనకు సరయిన గౌరవం లేదని భావించడం సహజమే. అందువల్లే ఆయన వైకాపా వైపు చూస్తున్నాడని పుకార్లు చెలరేగడంతో వంశీ వెంటనే స్పందిస్తూ తనకు చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికలలో గన్నవరం నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని, ఒకవేళ ఆయన మాట తప్పితే తానూ పార్టీని, రాజకీయాలను విడిచిపెట్టి ఇంటి దగ్గర కూర్చోంటాను తప్ప వైకాపాలో చేరబోనని ప్రకటించారు. అంతే కాకుండా తనకు గన్నవరం సీటు మీద తప్ప ప్రస్తుతం తనకు అప్పగించిన పదవిపై ఏమాత్రం ఆసక్తి, ఇష్టం లేదని, ఒకవేళ పార్టీలో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే తానూ ఈ పదవిని కూడా వీడి సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు.

 

పార్టీకి ఇన్నేళ్ళ సేవలందించిన తరువాత ఈ రోజు ఇటువంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ ఇక తెలుగు దేశం పార్టీలో ఎన్నాళ్ళు కొనసాగగలడు? ఒకవేళ పార్టీ వీడి బయటకి వస్తే ఇప్పుడు చెపుతునట్లు రాజకీయ సన్యాసం చేస్తాడా లేక జగన్ మోహన్ రెడ్డి పంచన జేరుతాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది?

 

ఏది ఏమయినప్పటికీ, చంద్రబాబు ఆయనకీ గన్నవరం టికెట్ ఇస్తార లేదా అనే విషయం మీదనే అంతా ఆధారపడిఉంది. టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆయన పార్టీని వీడటం 100 శాతం ఖాయం. ఒకవేళ ఇచ్చిన తరువాత కూడా పార్టీలో ఇవే పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది గనుక అప్పుడు ఆయన ఏమి చేస్తారో చూడాలి. ఏమయినప్పటికీ, వంశీ పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో వ్రేలాడుతున్నట్లే ఉందని చెప్పవచ్చును.