నేత‌ల్లారా ఒక సంవ‌త్స‌ర జీత‌భ‌త్యాలు త్యాగం చేయండి!

కరోనా భూతంపై యుద్దం చేయ‌డానికి భార‌త‌మాత ముద్దు బిడ్డ‌లెంద‌రో ముందుకొచ్చి విరాళాలు ఇస్తూ సేవ చేస్తున్నారు. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. వీరందరినీ మించి టాటా గ్రూపు అతి పెద్ద మనసుతో త‌మ‌కు సంబంధించి మొత్తం ఆస్థిని కూడా ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌ని ర‌త‌న్‌టాటా ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే దేశం కోసం మొత్తం ఆస్థిని ధార‌బోస్తానంటున్నాడు ఈ భార‌త మాత ముద్దు బిడ్డ‌.  టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్టు రూ.500 కోట్లు మొత్తం 1500 కోట్ల విరాళం ప్రకటించాయి. దేశం వీరిని చేతులెత్తి మొక్కుతోంది.

అయితే దేశానికి సేవ చేయ‌డానికే వ‌చ్చ‌మంటున్న మ‌న నేత గ‌ణం 545 ఎంపీ, 245 రాజ్యసభ స‌భ్యులు, 4120 ఎమ్మెల్యేలు మొత్తం 4910 మంది వున్నారుగా!  ఈ ఆప‌ద స‌మ‌యంలోనైనా,  మీరెందుకు విరాళాలు ఇవ్వ‌డం లేదు? మీరు దేశానికి సేవ చేయ‌డానికి రాలేదా?  నేత‌ల్లారా ఒక సంవ‌త్స‌రం జీత‌భ‌త్యాలు త్యాగం చేయండి! ఇప్ప‌ట్టికైనా మీరు స్పందించ‌క‌పోతే ప్ర‌జ‌లు ఛీ కొడ‌తారు గుర్తుంచుకోండి.

మ‌న నేత‌ల గురించి దేశం ఏంత‌ ఖ‌ర్చు పెడుతోంది. వీళ్ళు ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి పెట్టే ఖ‌ర్చు ఎంత‌? ఒక‌సారి ఆవివ‌రాల్లోకి వెళ్తే....

* ప్ర‌స్తుతం ఒక్కో శాస‌న‌స‌భ్యుడికి ఏడాదికి జీతం, అల‌వెన్సులు మొత్తం క‌లిపి 27 ల‌క్ష‌ల 60 వేల రూపాయ‌లు వ‌స్తున్నాయి. అలాగే జీతం, అలవెన్సులు కలిపి ముఖ్యమంత్రికి 50 ల‌క్ష‌ల 52 వేల రూపాయ‌లు, స్పీకర్, మండలి చైర్మన్‌కు 49 ల‌క్ష‌ల‌ 32 వేల రూపాయ‌లు, మంత్రులకు, చీఫ్ విప్, విప్‌లకు 48 ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకుంటున్నారు.

* ఒక్కో పార్ల‌మెంట్ స‌భ్యుడికి సంవ‌త్స‌రానికి వ‌చ్చే జీతం మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని 60 ల‌క్ష‌ల 95 వేల రూపాయ‌లు. ఎంపీల జీతభత్యాల చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 106 ప్రకారం దేశంలోని ఎంపీలకు జీతభత్యాలను నిర్ణయిస్తూ 1954లో చట్టం చేశారు. 1968లో రూ.400, 1985లో రూ.1000, 1996లో రూ.1500, 2001లో రూ.4000, 2005సంవత్సరంలో రూ.12,000, 2008లో రూ.16,000, 2010లో రూ.50వేలకు జీతాలు పెంచినారు. వీటితోపాటు ఆఫీసు, డైలీ, వైద్యం, ప్రయాణం, నియోజకవర్గాల ఆలవెన్సులు అదనంగా చెల్లిస్తున్నారు. అంతే కాదు వివిధ కార్పోరేష‌న్‌ల ఛైర్మ‌న్లు, కుప్ప‌లు తెప్ప‌లుగా వున్న రాజ‌కీయ స‌ల‌హాదారుల జీతాలు, అల‌వెన్సుల‌ను  ఒక్కో ప్ర‌భుత్వం ఒక్కోవిధంగా స‌మ‌ర్పించుకుంటోంది. 

* క‌రోనా బాధితుల‌కు అవ‌స‌ర‌మైన వెంటిలేట‌ర్ల కొర‌త తీవ్రంగా వుంది. వీటిని కొనుగోలు చేయ‌డానికి ప్ర‌జాప్ర‌తినిధులంతా త‌మ ఏడాది జీత‌భ‌త్యాల‌ను విరాళంగా ఇచ్చి ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ముందుకురావాలి.  అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం మన దేశంలో వీటి సంఖ్య 50 వేల లోపే ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల కోసం 14 వేల వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో 10-12 లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరస్ బారిన పడిన ప్రతి 100 మందిలో 10 మందికి శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటి వారినే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి తరలించి వెంటిలేటర్‌ను అమర్చుతారు.  శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతూ.. కరోనా వైరస్ బారిన పడిన వారికి మాత్రమే ఈ వెంటిలేటర్ అవసరం ఎక్కువగా ఉంటుంది.  ఒక్కో వెంటిలేటర్‌కు రూ.5-10 లక్షలు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. 

* ఎన్నికల సమయంలో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి కనిష్టంగా ఐదుకోట్ల రూపాయలతో మొదలుపెట్టి,  గరిష్టంగా పాతిక, ముప్పైకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  అదే ఎం.పి. ఎన్నిక‌ల‌కు ముప్పై కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నారు. ఈ ఖ‌ర్చంతా కేవ‌లం త‌మ కోసమే పెట్టుకున్నారు మ‌న నేత‌లు. డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి గెలిచారు ఒక‌రు. డ‌బ్బు ఖ‌ర్చు చేసి అంత డ‌బ్బు పోగొట్టు కున్నా ఓడిపోయారు మ‌రొక‌రు. ఓడినా, గెలిచినా అంత డ‌బ్బు పోయినా వారి జీవ‌న‌శైలిలో ఎలాంటి మార్పు వుండ‌ద‌నేది మ‌నంద‌రం ప్ర‌తి ఎన్నిక‌ల్లో చూస్తూనే వున్నాం. 

త‌మ కోసం అంతంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌డానికి వెన‌కాడ‌ని ఈ నేత‌గ‌ణం, ప్ర‌స్తుతం వున్న ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ జేబుల్లో ఎందుకు చెయ్యి పెట్ట‌డం లేదు. త‌మ ఖ‌జానాల్లోంచి డ‌బ్బును ఎందుకు బ‌య‌టికి తీయ‌డం లేదు? క‌నీస మాన‌వ‌త్వం నేత‌ల‌కు ఉండ‌దా? కేవ‌లం ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల కోసం ఖ‌ర్చు పెట్టి ఆ త‌రువాత రెండు చేతుల‌తో సంపాదించుకోవ‌చ్చ‌నే ఎన్నిక‌ల్లో ఇష్టంతో ఖ‌ర్చు పెడ‌తారా? ఇప్పుడు ఖ‌ర్చు చేస్తే ఆ డ‌బ్బు తిరిగిరాద‌నేగా ఆ దిశ‌గా నేత‌లు ఆలోచించ‌డం లేదా! నేత‌ల‌కు ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌, జ‌వాబుదారీత‌నం లేదా? ఇంకెప్పుడు ప్ర‌జా సేవ చేస్తారు?

* మీ డ‌బ్బు మీకు తోడుగా రాద‌ని క‌రోనా వైర‌స్ నిరూపించింది. ఈ వైర‌స్ నీడ‌లో మీరూ వున్నార‌న్న సంగ‌తి మ‌రువ‌వ‌ద్దు. ఒక వేళ మీకు క‌రోనా రాద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం మీకు ఉండ‌వ‌చ్చు. కానీ మీ చుట్టుప‌క్క‌ల ఎవ‌రికి వ‌చ్చినా మీకూ చావు త‌ప్ప‌దు జాగ్ర‌త్త‌... 

క‌రోనా వైర‌స్ మంచి సందేశం ఇస్తోంది. అది ఏమిటంటే మీరే కాదు, మీ ప‌క్క‌నున్న‌వారు కూడా బాగా వుండాలి. లేక‌పోతే మీ ప‌ని గోవిందా! అది విష‌యం. కాబ‌ట్టి మీరు దాచి పెట్టిన సంప‌ద‌ను ఇప్ప‌ట్టికైనా తీయండి. మ‌హా అయితే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చాయ‌నుకోండి. క‌రోనాతో పోటీచేస్తున్నామ‌ని భావించి ఖ‌ర్చుపెట్టండి. ఒక్కో ఎమ్మెల్యే క‌నీసం ఐదు కోట్లు, ఎంపి ప‌ది కోట్ల రూపాయ‌లు బ‌య‌టికి తీయండి. లేదా భారీ ఎత్తున వెంటిలేట‌ర్లు కొని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు దానం చేయండి. రాజ‌కీయ నేత‌ల్లారా క‌ళ్లు తెర‌వండి. క‌రోనా భూతాన్ని చూసైనా భ‌య‌ప‌డండి. ప్ర‌పంచం మొత్తం వ‌ణికిపోతోంది. అయినా మ‌న నేత‌ల‌కు చ‌ల‌నం లేదు. 

* మ‌న దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య త‌క్కువ వుంది అని అనుకుంటున్నారా? అందుకు కార‌ణం ఏమిటి? అస‌లు 130 కోట్ల జ‌నాభా వున్న మ‌న దేశంలో ఇంత వ‌ర‌కు కేవ‌లం 35 వేల మందికి మాత్ర‌మే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిగాయ‌ట‌. ఇది వాస్త‌వ ప‌రిస్థితి. క‌నీసం ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకునే సామ‌ర్థ్యం కూడా మ‌న ద‌గ్గ‌ర లేదు. అందుకే నేత‌ల్లారా మీ ద‌గ్గ‌రున్న డ‌బ్బు తీయండి. దేశాన్ని ఆదుకునేందుకు ముందుకు రండి.

కరోనా మహమ్మారితో పోరాడటానికి ఈ ప్రజా ప్రతినిధులందరూ కలిసి మీ ఏడాది జీత‌భ‌త్యాల్ని విరాళంగా ఇవ్వండి. అలా చేయ‌కుండా, సిగ్గు లేకుండా ప్రతిసారీ దేశంలోని మధ్యతరగతి ప్రజలను సహాయం చేయమని విజ్ఞప్తి చేయ‌డం మీ దివాళాకోరుత‌నానికి అద్దం ప‌డుతోంది. ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఈ ఆప‌ద స‌మ‌యంలోనైనా క‌ళ్లు తెర‌వండి. ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుండి నిజ‌మైన ప్ర‌జా సేవ చేయండి. ప్ర‌జా సేవ అంటే కేవ‌లం ప‌ద‌వులు, హోదా అనుభ‌వించ‌డ‌మే కాదు అవ‌స‌రం అయిన‌ప్పుడు ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌డానికి వారి ప‌క్షాన‌ నిల‌బ‌డాలి.