ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదు: మంత్రి అజయ్

 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని విలీనం చేస్తామని కానీ.. ప్రైవేటీకరిస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారని, వారి ఆందోళన అసంబద్ధబమని అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లారన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని పండగ సమయంలో సమ్మెకు వెళ్లారని విమర్శించారు. అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ప్రజల కోణంలో ఆలోచించకుండా రాజకీయం చేస్తున్నాయని.. ప్రతిపక్షాలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని అజయ్ పేర్కొన్నారు. టెంట్‌ వేసిన చోటల్లా విపక్షాలు వాలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కర్రు కాల్చి వాత పెట్టినా ప్రతిపక్షాలు మారడం లేదని అజయ్ అన్నారు.

ఆర్టీసీకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తప్పుడు ప్రచారం సరికాదని, 2014బ్యాలెన్స్ షీట్‌లో ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4,416 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఆర్టీసీ బతకాలంటే లాభాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో ఆర్టీసీకి నష్టాలే వచ్చాయన్నారు. కేసీఆర్‌ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీకి 14 కోట్ల లాభం వచ్చిందన్నారు. ఐదేళ్లలో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3,303 కోట్లు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని అజయ్ ప్రశ్నించారు. 5 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉన్నవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన మరింత మంది ఉద్యోగులను తీసుకుంటామని, బస్సు సర్వీసులను పెంచుతామని తెలిపారు. అన్ని రకాల బస్సు పాస్‌లను అనుమతించాలని ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని అజయ్ హెచ్చరించారు.