కేసీఆర్ మాస్టర్ ప్లాన్... ఆర్టీసీలో మొదలుకానున్న వీఆర్ఎస్ స్కీం!
posted on Nov 23, 2019 3:24PM
ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ రాబోతుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. స్టాఫ్ తగ్గించటం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో 50 వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. యాభై శాతం ప్రైవేట్ రూట్లకు ప్రైవేటు బస్సులను తీసుకు వస్తే ఇక ఆర్టీసీలో మిగిలేది అయిదు వేల బస్సులు మాత్రమే. ఇప్పటి వరకూ 10,400 ల బస్సులకు ఈ యాభైవేలమంది కార్మికులు పనిచేసేవారు. బస్సుల సంఖ్య సగానికి తగ్గడంతో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది కార్మికులు సరిపోతారు. దీంతో ఆర్టీసీలో విఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీని పై కొంత కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించకపోవచ్చు అనేది మరికొందరు అధికారులు చెబుతున్న మాట. సమ్మె ముగిసిన తరువాత యాభైవేలమంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఆ తరువాత వీఆర్ఎస్ ను తెరపైకి తేవాలని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుంది. వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు కొంత ప్రోత్సాహకంగా ఆర్టీసీ ఇచ్చే బెనిఫిట్స్ తో పాటు ప్రభుత్వం కూడా కొంత నగదును కలిపే అవకాశముంది. వాలెంటరీ రిటైర్ మెంట్ పథకాన్ని అమలులోకి తెస్తే అప్పటికప్పుడు కాకుండా ఒకట్రెండేళ్లలో సగం మంది ఉద్యోగులు తగ్గుతారని ఆర్టీసీ యాజమాన్యం అంచనా. ప్రభుత్వం వీఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే రిటైర్ మెంట్ దగ్గరగా లేదా మరో ఐదారేళ్ల సర్వీసున్న కొంతమంది ఉద్యోగులు వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
దీనిపై విమర్శలు రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతి పక్షాలు ఎదురు దాడికి దిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం వెనక ప్రతిపక్షాల రాజకీయ లబ్ది ఉందని అధికార పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. ఈ సమ్మె వల్ల ఆర్టీసి కోలుకోలేని ఆర్ధిక భారం మూటగట్టుకున్నదని ఇక ఆర్టీసీని ఆదుకోవడం ప్రభుత్వానికి కూడా కష్టమే అంటూ ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరించాలనేది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. అయితే యాభై శాతం మించకుండా ఉంటుందనేది సీఎం స్పష్టంగా చెప్తున్న మాట. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సంస్థల్లో వీఆర్ఎస్ తీసుకొస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం లేదు.