సీఎం కేసీఆర్ నియంత.. మావోల ఆగ్రహం
posted on Nov 28, 2014 10:24AM
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని గణపతి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలను పోలీసు బూట్లతో అణచివేయడం కోసమే ప్రభుత్వం పోలీసు శాఖకు కోట్లాది రూపాయలను కేటాయిస్తోందని మావోయిస్టు గణపతి ఆరోపించారు. అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకుని పోలీసులతో పౌరహక్కుల సంఘం నాయకుడు కామ్రేడ్ వరవరరావు ఇంటిమీద ప్రభుత్వం జరిపించిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మావోయిస్టు గణపతి తన లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ లైన్లు వేయడానికి మావోయిస్టులను సాకుగా చూపించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.