టీ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ..కేసీఆర్ ప్లాన్ సూపర్..
posted on Sep 29, 2015 10:35AM
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల సెప్టెంబర్ 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తరువాత వాయిదాల అనంతరం మళ్లీ ఈరోజు నుండి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు మాత్రం అసెంబ్లీలో చాలా వేడి వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యల గురించి చర్చించనున్నారు. ఏ అంశం మీదైతే ప్రతిపక్షాలు అధికార పార్టీమీద విమర్శల వర్షం కురిపిస్తున్నారో.. ఏ అంశం మీదైతే అసెంబ్లీలో చర్చించి అధికార ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్లాన్ చేశాయో ఇప్పుడు ఈ రోజు అదే అంశం మీద చర్చించనున్నారు. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిపక్షనేతలు ప్రశ్నించాలని అంశాల జాబితాలో తయారుచేసుకున్న నేపథ్యంలో మొదటిది రైతు ఆత్మహత్యల అంశం. దీని మీద టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామనుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఆ ఛాన్స్ వారికి ఇవ్వలేదు. తానే ముందుగా ఈరోజు రైతుల అత్మహత్యలపై ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు చర్చ జరిగే సమయంలో ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండటానికి ఈరోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను సైతం రద్దు చేశారు. మొత్తానికి కేసీఆర్ ప్రతిపక్షనేతల ప్లానింగ్ ముందుగానే గమనించి తానే రివర్స్ ప్లాన్ చేసినట్టున్నారు.