తెలంగాణాలో వైకాపాని ఎందుకు కొనసాగిస్తున్నట్లో?
posted on Oct 29, 2015 5:32AM
తెలంగాణా రాష్ట్రంలో కూడా వైకాపా ఉండీ లేనట్లే ఉంది. అక్కడ ఏదో ఒక ప్రత్యేక కారణం వలనో లేక ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించో పార్టీని కొనసాగిస్తునట్లుంది తప్ప మిగిలిన రాజకీయ పార్టీలలాగ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలను ఆకట్టుకోవాలి...ఎన్నికలలో పోటీ చేసి ఎప్పటికయినా అధికారంలోకి రావాలి...అనే ఉద్దేశ్యం వైకాపాకి ఉన్నట్లు కబడటం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఆ పార్టీ వ్యవహార శైలిని చూస్తే ఆ తేడా మరింత స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. బహుశః తెరాసతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న రహస్య అనుబంధం కారణంగానే తెలంగాణాలో వైకాపా నేతలు చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తోందనే అనుమానాలున్నాయి. అలాగని తెరాస ప్రభుత్వానికి వైకాపా బహిరంగంగా మద్దతు తెలపలేకపోతోంది. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీపై దుష్ప్రభావం చూపవచ్చుననే భయంతోనే దూరంగా ఉండవలసి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపా, తెరాసలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా తెరాస ప్రభుత్వం ఏదో ఒక అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యుద్దాలు చేస్తూనే ఉంది. ఆ కారణంగా అది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో నెలకొని ఉంది. అటువంటి పార్టీతో బహిరంగంగా చేతులు కలిపినట్లయితే ఆంధ్రాలో వైకాపాపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే తెరాసకి దూరంగా ఉండవలసి వస్తోందని భావించవచ్చును. కానీ ఆ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య అనుబందం అప్పుడప్పుడు ఏదో రూపంగా బయటపడుతూనే ఉంటుంది. మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం, ఓటుకి నోటు కేసులో తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా, తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వంటివన్నీ అందుకు చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.
ఇటువంటి వ్యవహారాలన్నీ నిశితంగా గమనించినట్లయితే, తెరాసకు అండగా నిలుస్తూ తమ ఉమ్మడి శత్రువు తెదేపాను తెలంగాణాలో ఎదగకుండా నిలువరించడానికే అక్కడ వైకాపాను కొనసాగిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు తెరాసకు ఓటు వేయకపోవచ్చును. వారి ఓట్లు వేరే ఇతర పార్టీలకో లేక గంపగుత్తగా తెదేపాకు పడకూడదనుకొంటే, తప్పనిసరిగా ఆంధ్రాకు చెందిన వైకాపా ఉండాలి. అప్పుడు వారి ఓట్లు ఆ రెండు పార్టీల మధ్య చీలిపోతుంటాయి. దాని వలన వైకాపాకి ఒరిగేదేమీ ఉండకపోయినా, తెదేపాను దెబ్బ తీస్తూ పరోక్షంగా తెరాసకు సహాయపడినట్లవుతుంది. అందుకే తెలంగాణాలో వైకాపాని సజీవంగా ఉంచినట్లు అనుమానం కలుగుతోంది.
ఆ అనుమానాలని ద్రువీకరిస్తునట్లుగా వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా కూడా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఇంతకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకు బహిరంగంగా మద్దతు ప్రకటించినందుకు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. అందుకే ఈసారి తెరాసకు మద్దతు పలకకుండా ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లుంది. ప్రజల ఓట్లు చీలితే దాని వలన తెరాసకే లాభం చేకూరుతుంది కనుక పరోక్షంగా తెరాసకు సహాయపడినట్లునట్లు ఉంటుంది. తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణం నాయుడు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసారు.
వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా పోటీ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు..అభ్యంతరం చెప్పడం సబబు కాదు. కానీ తెలంగాణాలో వైకాపాని సజీవంగా ఎందుకు ఉంచుతున్నారనే విషయం దీని ద్వారా అర్ధం అవుతోంది. తెదేపాని దెబ్బ తీయాలని వైకాపా ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో తెదేపా నష్టపోతుందో లేదో తెలియదు కానీ తెలంగాణాలో వైకాపాని నమ్ముకొన్న నేతలు, కార్యకర్తలు మాత్రం పావులుగా మారి నష్టపోవడం తధ్యమని చెప్పవచ్చును.