రాజకీయాలు చేసుకోవడానికే ప్రత్యేక హోదా పనికొస్తోందా?

 

ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ నేతల మాటల మధ్యే పొంతన కనబడటం లేదు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ ప్రతిపాదన ఇంకా నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని చెపుతుంటే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక ఏ రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని విస్పష్టంగా చెప్పారు. ఆయన బీహార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నప్పుడు ఈ విషయం ప్రకటించారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ రాజకీయ నాయకుడు పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపించే ఇటువంటి ప్రకటనలు చేయరు. కానీ బీహార్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి ఇప్పటికే రూ.1.65లక్షల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ఉన్నారు కనుక ఆ దైర్యంతోనే అరుణ్ జైట్లీ ఆ మాట చెప్పగలిగారని భావించవచ్చును. కనుక ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని భావించవచ్చును.

 

ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాదని కాంగ్రెస్, వైకాపాలు దృడంగా నమ్ముతున్నందునే తమ రాజకీయ లబ్ది కోసం దాని కోసం పోరాటాలు చేస్తున్నాయి. గత 15నెలలుగా బీజేపీ నేతలు పరస్పర విరుద్దంగా చెపుతున్న ఇటువంటి మాటలను విని రాష్ట్ర ప్రజలు కూడా ఇక ప్రత్యేక హోదా రాదని మానసికంగా సిద్దపడ్డారు. అందుకే వారు ఆ రెండు పార్టీలు చేస్తున్న పోరాటాల పట్ల నిరాసక్తిగా ఉన్నారని భావించవచ్చును. ప్రత్యేక హోదా రాకపోయినా కనీసం బీహార్ రాష్ట్రానికి ఇచ్చినట్లుగా భారీ ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుకొంటున్నారు. కాంగ్రెస్, వైకాపాలు ఆ విషయం గ్రహించి కేవలం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కోసం పోరాటాలు చేస్తుంటే బహుశః అప్పుడు ప్రజలు వాటికి మద్దతు పలికేవారేమో? బీహార్ ఎన్నికలు పూర్తికాగానే మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించవచ్చని తెదేపా నేతలు చెపుతున్నారు. ఒకవేళ కేంద్రప్రభుత్వం బిహార్ ఎన్నికల తరువాత నిజంగానే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించినట్లయితే ఇక కాంగ్రెస్, వైకాపాలు ప్రత్యేక హోదా కోసం పోరాడినా ప్రజలు పట్టించుకోకపోవచ్చును.

 

అప్పుడు ఆ రెండు పార్టీలు ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనే అంశాలని భుజానికెత్తుకొంటాయేమో? ఎందుకంటే ఆ రెండు హామీల అమలులో చాలా జాప్యం జరుగుతోంది. పోలవరం నిర్మాణానికి ఇంకా చాలా ఏళ్ళు పట్టవచ్చును కనుక ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు గురించి ప్రతిపక్ష పార్టీలు పోరాటం మొదలుపెట్టవచ్చును. బిహార్ ఎన్నికల తరువాత కూడా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించకపోతే, అప్పుడు ప్రజలు ప్రతిపక్ష పార్టీల పోరాటాలకి మద్దతు పలుకవచ్చును.

 

ప్రత్యేక హోదా విషయంలో ఇంతవరకు ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, నిరాహార దీక్షలు, రాష్ట్ర బందులు చేసినా రాష్ట్ర బీజేపీ నేతలు గట్టిగా స్పందించలేదు. అదేదో తెదేపా అంతర్గత సమస్య అన్నట్లుగా పట్టించుకోకుండా ఊరుకొన్నారు. కానీ తెదేపా నేతలు గల్లా జయదేవ్, నందమూరి బాలకృష్ణ ప్రత్యేక హోదా విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయగానే బీజేపీ నేతలు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాక వెంకటసత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులు మిత్రపక్షమని కూడా చూడకుండా తెదేపా ప్రభుత్వంపై విరుచుకుపడటం గమనార్హం.

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజి కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కోరుకొంటున్నారు. ఇప్పటికే ఏడాదిన్నర సమయం గడిచిపోయింది. అయినా కేంద్రప్రభుత్వం ఇంకా ఆ విషయం పరిశీలనలోనే ఉందని చెపుతూ కాలక్షేపం చేస్తుంటే, దాని కోసం రాష్ర్టంలో అధికార, ప్రతిపక్ష, మిత్రపక్ష రాజకీయ పార్టీలన్నీ కలిసి కృషి చేయకుండా, ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలను రాజకీయ ఆయుధాలుగా చేసుకొని ఒకదానితో మరొకటి యుద్దాలు చేస్తూ రాష్ర్ట ప్రజలను మభ్యపెడుతూ రోజులు దొర్లించేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేవు కనుక రాజకీయపార్టీలు ప్రజలకు జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదు. కనుక ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి ఏవిధంగానయినా మాట్లాడవచ్చును...కాలక్షేపం చేయవచ్చును. కానీ వచ్చే ఎన్నికలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజలకు ప్రత్యేక హోదా గురించి సంజాయిషీ చెప్పుకోక తప్పదు.