తలసాని రాజీడ్రామా పై స్పందించిన స్పీకర్
posted on Jul 31, 2015 12:40PM
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీడ్రామాకు తెరపడినట్టు తెలుస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మంత్రిగా కొనసాగుతున్న విషయంపై రాజకీయ వర్గాలు మండిపడ్డాయి. ఒక పార్టీలో పదవి పొంది రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి మారి మంత్రిగా కొనసాగడం చట్ట విరుద్ధమని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. అయితే కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ సచివాలయానికి దరఖాస్తు చేయగా వాళ్లు రాజీనామా లేఖ రాలేదని చెప్పడంతో నిజం బయట పడింది. దీంతో ఒక్కసారిగా నేతలందరూ తలసానిపై విరుచుకుపడ్డారు. ఇన్నీ రోజులు రాజీనామా చేశానని తలసాని డ్రామాలాడారని తిట్టిపోశారు. అయితే తలసాని మాత్రం 2014 డిసెంబర్ 16న తాను రాజీనామా చేశానని.. రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పి మరీ ఎన్నో ప్రగల్భాలు పలికారు.
మరోవైపు తలసాని రాజీనామా చేస్తే స్పీకర్ ఇంతవరకూ ఎందుకు ఆమోదించలేదని పలు రాజకీయ నేతలు ప్రశ్నించారు. అంటే దీనిలో స్పీకర్ కు కూడా సంబంధం ఉందా అని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు తలసాని రాజీనామా పై స్పీకర్ మధుసూధనాచారి స్పందించినట్టు తెలుస్తోంది. తలసాని రాజీనామాపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు మధుసూధనాచారిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన తలసాని రాజీనామాపై అనుకూలంగా స్పందినట్టు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.