సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులు, పోలీసు, హోంగార్డు మృతి
posted on Apr 2, 2015 7:44AM
నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండులో నిన్న అర్ధరాత్రి పోలీసులు తనికీలు నిర్వహిస్తున్న సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుండగులు వారిపై కాల్పులు జరపడంతో గన్ మెన్ లింగయ్య (36) హోంగార్డు మహేష్ (35) మరణించారు. సి.ఐ. మొగులయ్య, మరో హోం గార్డు కిషోర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు ఇరువురు తప్పించుకొని పారిపోయారు. పారిపోతూ పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను కూడా పట్టుకుపోయారు. పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయిన దుండగులు ఇరువురు జాతీయ రహదారి వద్దకు చేరుకొని తుపాకీ గురిపెట్టి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక కారుని అడ్డుకొన్నారు. అందులో ప్రయాణిస్తున్న గన్నమని దొరబాబు కారును ఆపకుండా ముందుకి పోనీయడంతో దుండగులు ఆయనపై కూడా కాల్పులు జరిపారు. ఆయన భుజానికి గాయమయింది.
ఈ సంగతి తెలుసుకొన్న సూర్యాపేట పోలీసులు హుటాహుటిన అక్కడికి తరలివచ్చేరు. కానీ అప్పటికే దుండగులు తప్పించుకొని పారిపోయారు. హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉన్న అన్ని చెక్ పోస్టులను పోలీసులు అప్రమత్తం చేసి దుండగులను పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధార్ కార్డ్ ప్రకారం దుండగులు బీహార్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు కిశోర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. సి.ఐ. మొగులయ్య, దొరబాబుకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.