సుప్రీంకోర్టులో ఎసిబికి ఎదురు దెబ్బ

 

ఎసిబికి అనే కంటే తెలంగాణా ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎసిబి వేసిన పిటిషన్ని ఈరోజు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ మరియు ఉదయ్ సింహాలు ముగ్గురూ నెల రోజుల పాటు కస్టడీలో ఉంచుకొని వారిని నాలుగు రోజులు ఏకధాటిగా ప్రశ్నించి సమాధానాలు రాబట్టిన తరువాత వారిపై సెక్షన్: 164 క్రింద కేసు కూడా నమోదు చేసారని, ఇంకా వారిని జైల్లోనే ఉంచాలని ఎందుకు అనుకొంటున్నారని? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్.దత్తు ఎసిబి తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ని ఎదురు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులో అనేక లోపాలున్నాయని ఆయన చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ఎసిబి వేసిన పిటిషన్ని కొట్టివేసింది. రేవంత్ రెడ్డి మిగిలిన ఇద్దరికీ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు గట్టిగా సమర్ధించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఎసిబి కంటే తెరాస ప్రభుత్వానికే ఎదురు దెబ్బ తగిలినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.