స్పేస్‌క్రాఫ్ట్ దూసుకొచ్చేస్తోంది...

 

చాలాకాలం క్రితం స్కైలాబ్ అనే ఉపగ్రహం భూమి వైపు దూసుకొస్తోందని, అది భూమిని ఢీకొంటే ఇక అంతే సంగతులని వదంతులు వ్యాపించి, చాలామంది ఇక ఇవే చివరి రోజులని లైఫ్‌ని ఎంజాయ్ చేయడం, భోరున ఏడవడం గురించి తెలిసిందే. ఆ తర్వాత ఆ స్కైలాబ్ సముద్రంలో పడిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మానవులు పంపిన ఉపగ్రహాలు వాటి కాల వ్యవధి ముగిసిపోవడం, నియంత్రణ కోల్పోవడం కారణంగా భూమ్యాకర్షణ కారణంగా తిరిగి భూమ్మీదకు వచ్చేస్తూ వుంటాయి. ఇప్పుడు ఒక మానవ రహిత రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ ఒకటి నియంత్రణ కోల్పోయి భూమ్మీదకు దూసుకుని వస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి సామగ్రిని తరలించడం కోసం ప్రయోగించిన మానవ రహిత రష్యన్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ నియంత్రణ కోల్పోవడంతో భూమి మీదకు దూసుకు వస్తోంది. ప్రస్తుతం అది అదుపులో లేకపోవడం వల్ల వేగంగా భూమ్మీదకు వస్తోన్నట్టు తెలుస్తోంది. అది ఏ ప్రాంతంలో భూమిని ఢీకొంటుందో శాస్త్రవేత్తలే చెప్పలేకపోతున్నారు. దానిని అదుపు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.