కు.ని. ఆపరేషన్‌కీ, ఓటుకీ లింకు
posted on Apr 13, 2015 5:08PM
బీజేపీ నాయకుడు సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలని ఆమధ్య పిలుపు ఇచ్చి వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారాయన. ఇప్పుడు ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికే ఓటుహక్కు ఇవ్వాలని, అలా చేయించుకోని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఆయన వ్యాఖ్యానించారు. జనాభాని నియంత్రించాలంటే అదే సరైన దారి అని, దీనిపై చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలు, క్రైస్తవులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోరని తాను అనడం లేదని, తాను సూచిస్తున్న చట్టాన్ని అన్ని మతాలవారికీ వర్తించేలా చేయాలని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే ప్రజలు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవడం ప్రారంభించినట్టయితే ఇప్పుడు భారత జనాభా 30 కోట్లు మాత్రమే వుండేదని, అలా చేయించుకోనందునే 130 కోట్లకు చేరిందని ఆయన వ్యాఖ్యానించారు. సాక్షి మహరాజ్ చేసిన ఈ వ్యాఖ్యల మీద నిరసన వ్యక్తమవుతోంది.