చెస్ట్ ఆస్పత్రిపై హైకోర్టు ఆదేశాలు

 

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో వున్న చెస్ట్ ఆస్పత్రిని నగరం బయటకి తరలించి, ఆ ప్రదేశంలో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న సచివాలయానికి వాస్తుదోషం వున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిమీద తెలంగాణ ప్రభుత్వం కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో వాస్తుదోషం కారణంగా అని కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసమే సచివాలయాన్ని తరలించాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. కోర్టు ఇదే విషయాన్ని పిటిషనర్‌కి తెలిపింది. దాంతో పిటిషనర్ చెస్ట్ ఆస్పత్రి పురాతన భవనమని విన్నవించారు. హైకోర్టు చెస్ట్ ఆస్పత్రి పురాతన భవనాల పరిధిలోకి వస్తుందో రాదో చెప్పాలని పురావస్తు శాఖను ఆదేశించింది. ఒకవేళ అది పురాతన భవనం అయిన పక్షంలో అక్కడ సచివాలయం నిర్మాణం చేయడానికి వీల్లేదని, నిర్మాణ పనులన్నీ ఆపివేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.