నేటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులకి బ్రేక్
posted on May 6, 2015 7:03AM
ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ యాజమాన్యంతో ఆయా రాష్ట్ర రవాణాశాఖ మంత్రులతో వేతన సవరణపై జరిపిన చర్చలు విఫలం కావడంతో నేటి నుండి రెండు రాష్ట్రాలలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. నిన్న ఆర్ధరాత్రి నుండే అనేక దూరప్రాంత బస్సులు డిపోలలో నిలిపివేయగా, సిటీ సర్వీసు బస్సులను ఈరోజు ఉదయం 6 గంటల నుండి నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అంత వేతన సవరణ చేయలేమని చెపుతుంటే, తెలంగాణా ప్రభుత్వం కూడా ఆర్టీసీ నష్టాలలో ఉన్నందున ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గలేదు. సమ్మెను విరమించుకొమ్మని ఇరు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు చేసిన విజ్ఞప్తులను ఉద్యోగులు తిరస్కరించి ఈరోజు నుండి సమ్మెకు దిగుతున్నారు. కనుక రెండు రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవలసిందిగా ఆర్టీసీ యండి సాంభశివరావు అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాలలో డిపోలవారిగా తాత్కాలికంగా డ్రైవర్లు, కండెక్టర్ల నియామకాలు జరుగుతున్నాయి. కానీ లక్షలాది ఉద్యోగులు కలిసి నిర్వహించే ఆర్టీసీణి కొన్ని వందలమంది తాత్కాలిక ఉద్యోగులతో నడిపించడం ప్రజల ఊరట కోసం మాత్రమేనని భావించాల్సి ఉంటుంది.