ఆర్టీసీ చక్రాలకు యాజమాన్యమే బ్రేకులు వేస్తోందా?

 

నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ విభజన కోసం పోరాడుకొన్న ఆంద్ర, తెలంగాణా ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై రెండు రాష్ట్రాలలో సమ్మెకు దిగాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకూ 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని వారి ప్రధాన డిమాండ్. ఆర్టీసీ తీవ్ర నష్టాలలోకూరుకొని పోయుంది కనుక అంత పెంచలేమని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పడంతో రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ ఉద్యోగులు ఈరోజు ఉదయం నుండి నిరవదిక సమ్మెకు దిగారు.

 

ఆర్టీసీ చార్జీలు పెంచవలసిన ప్రతీసారి, ఉద్యోగులు జీతాలు పెంచమని అడిగినప్పుడల్లా ఆర్టీసీ నష్టాలలో ఉందనే చిలకపలుకులు పలకడం రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటే. అయితే ఆర్టీసీ నష్టాలతో నడుస్తున్నప్పటికీ అందుకు కారణాలను, కారకులను కనుగొని చర్యలు చేప్పట్టకుండా ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం రెండూ కూడా తీవ్ర నిర్లిప్తత వహిస్తున్నట్లు వారి చిలక పలుకులే దృవీకరిస్తున్నాయి.

 

సాధారణ ప్రజలు ప్రధానంగా ఆధారపడే ఆర్టీసీ బస్సులకు ఆక్యుపెన్సీ సమస్య లేనేలేదు. రెండు రాష్ట్రాలలో ఎన్ని బస్సులు తిరుగుతున్నా అన్ని కూడా ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. ఇక పండగ, పెళ్ళిళ్ళ సీజన్లలో పరిస్థితి చెప్పనక్కరలేదు. రోడ్లమీద తిరగడానికి పనికిరావని పక్కన పడేసిన డొక్కు బస్సులను కూడా ఆ సమయంలో మళ్ళీ బయటకు తీసి ప్రత్యేక బస్సులుగా తిప్పుతూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేయడం ఆర్టీసీకి పరిపాటే. ఆర్టీసీ డిపోలలో షాపుల నుండి, బస్సులపై వాణిజ్య ప్రకటనల ద్వారా ఆర్టీసీకి భారీగా అద్దెలు వసూలవుతుంటాయి. ఇక ప్రధాన నగరాలలో ప్రధాన ప్రాంతాలలో ఆర్టీసీకి ఉన్న భూములను, భవనాలను ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు లీజు మీద ఇవ్వడం ద్వారా భారీ ఆదాయం పొందుతోంది. ఇంకా అనేక మార్గాల ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరుతోంది. అయినా ఆర్టీసీ ఎప్పుడూ నష్టాలలోనే ఎందుకు ఉంటుంది? నష్టాలలో ఉన్నా ప్రభుత్వాలు, ఆర్టీసీ యాజమాన్యం దానిని నివారించే ప్రయత్నాలు ఎందుకు చేయలేవు? అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు.

 

ఆర్టీసీలో నష్టాలకి యాజమాన్యం, ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని ఉద్యోగులు ఆరోపిస్తుంటే, ఆపరేటింగ్ నష్టాలే ఎక్కువని ఆర్టీసీ యాజమాన్యం తన ఉద్యోగులను నిందిస్తోంది. డీజిల్, వాహన విడిభాగాలు ధరల పెరుగుదల, గతుకుల రోడ్లలో ప్రయాణించడం వలన తరచూ వాహనాలకు మరమత్తులు అవసరంపడటం, బంద్ లు జరిగినప్పుడు అందరూ ముందుగా ఆర్టీసీ బస్సులపైనే తమ ప్రతాపం ప్రదర్శించడం, బస్సులలో ప్రయాణికులు లేకపోయినా ఖాళీగా తిరగే బస్సులు, వాటి కోసం పడిగాపులు కాసే ప్రయాణికుల కోసం రూల్స్ పేరిట ఆపకుండా దూసుకుపోవడం వంటివి కంటికి కనబడుతున్న సమస్యలు.

 

దేశ వ్యాప్తంగా తిరుగుతున్నలక్షలాది ప్రైవేట్ బస్సులు ఏ ప్రభుత్వ అండదండలు లేకపోయినా లాభాలు ఆర్జించగలుగుతున్నప్పుడు, ప్రభుత్వ అండదండలున్న ఆర్టీసీ ఎందుకు ఎప్పుడు నష్టాలలోనే ఉంటోంది అంటే ఖచ్చితంగా యాజమాన్యనే తప్పు పట్టవలసి ఉంటుంది. ఆర్టీసీ కార్మికులలో కొందరు యూనియన్ల పేరిట సమస్యలు సృష్టింస్తుండవచ్చును. కానీ మిగిలిన లక్షలాది ఉద్యోగులు అందరూ రేయింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. అటువంటప్పుడు వారిని తప్పు పట్టడానికి లేదు.

కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులను ఒక రకంగా ఆర్టీసీ ఉద్యోగులను మరొకరకంగా చూడటం కూడా భావ్యం కాదు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే ఆర్టీసీయే ప్రజలకు చేరువగా ఉంది. కనుక ఆర్టీసీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సవతి ప్రేమ చూపడం సరికాదు. లక్షలాది ప్రభుత్వోద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వగలిగినప్పుడు, ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వారితో సమానంగా వేతనాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు నష్టాలని, ఆర్ధిక సమస్యలని సాకుగా చూపడం కూడా సరికాదు.

 

ప్రభుత్వంలో అనేకమంది నిజాయితీపరులు, మంచి సమర్ధులు, అందరినీ కలుపుకుపోగల నేర్పుగల అధికారులున్నారు. అటువంటి వారి చేతిలో ఆర్టీసీని పెట్టి ఉండి ఉంటే నేడు ఆర్టీసీకి ఈ దుస్థితి వచ్చేదే కాదు. కానీ ఆర్టీసీ సమస్యల గురించి ఎటువంటి అవగాహన లేని స్వార్ధ రాజకీయ నాయకుల చేతిలో సంస్థను పెట్టడం వలననే ఆర్టీసీ నష్టాలలో కూరుకొనిపోతోంది. ఈవిషయం ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు జీతాల కోసం తమ యాజమాన్యంతో పోరాడుతున్నట్లే ఆర్టీసీని కాపాడుకోవడానికి కూడా పోరాడవలసి ఉంటుంది. 

 

ఆర్టీసీని కాపాడుకొని లాభాల బాటలో తీసుకువెళ్లేందుకు అందులో ఉద్యోగులు, యాజమాన్యం కలిసి కట్టుగా కృషి చేయాలి. అప్పుడే వారికీ జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడే వారి సంస్థకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. లేకుంటే ఏదో ఒకనాడు ఆర్టీసి మూతపడటం, ఉద్యోగులు రోడ్డున పడటం తధ్యం.