ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిన ప్రత్యేక హోదా
posted on May 7, 2015 10:30AM
నటుడు శివాజీ తన నిరాహార దీక్షతో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో మళ్ళీ వేడి పుట్టించారు. అయితే ప్రత్యేక హోదా కోరుతూ డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఒక్కరోజు దీక్ష చేప్పట్టిన కాంగ్రెస్ నేతలు గానీ వచ్చి శివాజీ దీక్షకి మద్దతు తెలియజేయకపోవడం గమనిస్తే ఈ విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతోంది.
అది ప్రత్యేక హోదా కావచ్చు లేదా రాజధాని కోసం భూసేకరణ కావచ్చు లేదా రైతుల ఆత్మహత్యలు కావచ్చు లేదా మరొక సమస్య కావచ్చు...ఎవరి పోరాటాలు వారివే. రాష్ట్ర, దేశ ప్రజల శ్రేయస్సే తమకు చాలా ముఖ్యం అన్నట్లు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పటికీ అవి ఏనాడూ కలిసి పనిచేయలేవు. చేయవు కూడా. కారణం వారి పోరాటాలు, ఆరాటాలు అన్నీ కూడా ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి తమ పార్టీలను బలపరుచుకొని అధికారంలోకి రావాడానికే. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఒక రాజకీయ పార్టీ ఏదయినా ఒక అంశం అందిపుచ్చుకొని పోరాటం మొదలుపెడితే ఆ క్రెడిట్ పూర్తిగా తనకే దక్కాలనుకొంటుంది తప్ప వేరే పార్టీలతో పంచుకోవాలనుకోదు. ఆ విషయం శివాజీ నిరాహార దీక్షతో మరోమారు రుజువయింది.
దేశాన్ని పదేళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం అనేక రాష్ట్రాలలో జరుగుతున్న పోరాటాలు, ఇరుగుపొరుగు రాష్ట్రాల అభ్యంతరాల గురించి అన్నీ తెలిసి ఉన్నప్పటికీ, సాధ్యాసాధ్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించి చేతులు దులుపుకొంది. ఇప్పుడు ఎలాగు ఆ పార్టీ అధికారం లేదు కనుక ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకొని ఎన్డీయే ప్రభుత్వంపై దానిని సందిస్తోంది.
ఇక ఈ విషయంలో వైకాపా చాలా గుంబనంగా వ్యవహరిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏదో మొక్కుబడిగా డిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసి వచ్చేరు తప్ప ఆయన కానీ వైకాపా నేతలు గానీ ఎవరూ ఈ అంశం మీద గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. కారణం ఒకవేళ బీజేపీ రాష్ట్రంలో తెదేపాతో తెగ తెంపులు చేసుకొనే మాటాయితే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన కావచ్చును. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా వైకాపా చేస్తున్న ఆ ఆలోచనను బయటపెట్టి వైకాపాతో పొత్తులు పెట్టుకొనే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అయినా కేంద్రాన్ని ఇబ్బంది పెట్టగల అనేక అంశాల మీద వైకాపా మౌనం వహించడం గమనిస్తే ఆ పార్టీ బీజేపీతో పొత్తుల కోసం ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉందని అర్ధమవుతోంది. అందుకే ఆ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదేమో? అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాలకే ఆ పార్టీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చాలా ఇబ్బంది పడుతోంది గనుక తమ పార్టీకి మరింత ఇబ్బంది కలిగిస్తున్న తమ పార్టీ నేత శివాజీని తమవాడు కాదు పొమ్మంది. బీజేపీకి మిత్రపక్షంగా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నందున తెదేపా కూడా శివాజీ దీక్షకు దూరంగా ఉంది. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి త్వరగా మెరుగుపడాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరం కనుక తెదేపా కూడా అందుకోసం బీజేపీ మీద నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉంది. ఆ విషయం బీజేపీ నేతలే ఒప్పుకొంటున్నారు.
మిగిలిన అనేక అంశాల మాదిరిగానే ఈ అంశం కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీలకి ఒక ఆయుధంగా అందివచ్చింది. కనుక దీనిని మరింత కాలం నాన్చడం వలన అంతిమంగా బీజేపీకే నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఒకవేళ ఏదోవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లేయితే అందుకు అది ఎటువంటి ప్రయత్నాలు చేస్తోందో...అది ఎప్పటిలోగా సాధ్యపడుతుందనే విషయాన్ని ప్రజలకి వివరిస్తే మంచిది. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భావిస్తున్నట్లయితే అదే విషయాన్ని ఇప్పుడే రాష్ట్రంలో రాజకీయ పార్టీలకి, ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం మంచిది. ఎన్నికల వరకు రాష్ట్ర విభజన సమస్యను నాన్చిన కాంగ్రెస్ పార్టీ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంది. ఇప్పుడు బీజేపీ కూడా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని వచ్చే ఎన్నికల వరకు నాన్చినట్లయితే అప్పుడు బీజేపీ కూడా ఇదే పరిస్థితి ఎదురవవచ్చును. కనుక ఈ సమస్యను వీలయినంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేయడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.