నిన్నటి దాకా ఒకలా నేడు ఇలా... బీజేపీ పట్ల కేసీఆర్ వైఖరి ఎందుకు మారిందంటే?
posted on Apr 22, 2022 11:02AM
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న పార్టీలా కాకుండా...ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పటి దూకుడు ఎందుకు ప్రదర్శిస్తున్నది. అధికారంలో ఉండి హుందాగా వ్యవహరించాల్సింది పోయి...బీజేపీపై ఎందుకు అలా విరుచుకుపడుతోంది?
రాష్ట్రంలో బీజేపీ బలోపేతమౌతున్నదన్న సంకేతాలా టీఆర్ఎస్ వైఖరి మారడానికి కారణమన్నది విశ్లేషకులు చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత అగ్రసివ్ గా ఉండక పోతే మూడో సారి అధికారం కలగానే మిగిలిపోతుందన్న అంచనాకు వచ్చిన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీపై ఎదురుదాడి తోనే ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు అనుగుణంగానే పార్టీ శ్రేణులకు కూడా మార్గనిర్దేశనం చేశారు. ముందస్తు ఎన్నికల ప్రశక్తే లేదని పైకి చెబుతున్నా....ఆయన ప్రకటనలు, హామీలూ, ప్రత్యర్థులపై విమర్శ తీవ్రత పెరగడం చూస్తుంటే ముందస్తుకు మొగ్గు చూపుతున్నారా అనిపించక మానదు.
ఇక తెరాస మంత్రులు, నేతలు బీజేపీ విమర్శలకు దీటుగా బదులిస్తున్నామన్న పేరుతో భాష మార్చేశారు. గౌరవానికి తిలోదకాలిచ్చేశారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలూ సర్వసాధారణమే అయినా, ప్రస్తుతం బీజేపీ- తెరాసల మధ్య మాటల యుద్ధాన్ని విమర్శల పర్వాన్నీ చూస్తుంటే...రాజకీయ మర్యాద అన్న మాటే రెండు పార్టీలూ మరచిపోయాయనిపించక మానదు.
ఇక రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతున్నదన్న అంచనాకు వచ్చిన కేసీఆర్, బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలన్న ఆత్రమో మరోటో కానీ ఆయన రాజకీయంగా పార్టీకి నష్టం కలగించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా...సాగు నీరు పుష్కలంగా అందుతుండటంతో రైతులు కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారు. అయితే ధాన్యం కొనుగోలు విషయంలో లేని రాద్ధాంతాన్ని సృష్టించి కేసీఆర్ సృష్టించిన గందరగోళం బూమరాంగ్ అయ్యిందనే చెప్పాలి. యాసంగి ధాన్యం కొనుగోలు చేయబోమనీ, వరి పండిస్తే ఉరే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ పట్లా రైతుల వ్యతిరేకతకే దోహదపడ్డాయి.
కేంద్రంపై కాలు దువ్వడానికి అనవసరంగా రైతును లాగి కేసీఆర్ చేతులు కాల్చుకున్నారని పరిశీలకులు విశ్లేషస్తున్నారు.
ఇటీవలి కాలం వరకూ బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అన్న ముద్ర ఉండింది. దాని నుంచి బయటపడాలన్న యావతోనో.. మరో ఉద్దేశంతోనో కేసీఆర్ మాత్రం తన దుందుడుకు వైఖరీ, హడావుడి నిర్ణయాలతో వరుస తప్పిదాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారమే తీసుకుంటే...కేంద్రం బాధ్యతారాహిత్యమంటూ విమర్శలు గుప్పించిన కేసీఆర్ కేంద్రం మెట్టు దిగి రాకపోవడంతో తానే కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఇది ముందే చేసి ఉంటే రైతులలో ఆయన పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండేది కాదు.
మోడీ సర్కార్ తీసుకు వచ్చిన రైతు చట్టాలను దేశ వ్యాప్తంగా అన్ని బీజేపీయేతర పార్టీలూ వ్యతిరేకిస్తే సమర్ధించిన ఏకైక సీఎం కేసీఆర్. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి మద్దతు సంగతి అటుంచితే...కనీసం రైతు ఆందోళనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోడీకి ఇంత కాలం వత్తాసుగా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని మోడీ వ్యతిరేకత అన్న విధానాన్ని ఎంచుకున్నారు.
వెూడీ ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలపై కూడా టీఆర్‌ఎస్ మొదట తటస్థ వైఖరిని అనుసరించింది. రైతు ఆందోళనలకు మద్దతు ఇవ్వలేదు. చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయలేదు. ఈ వైఖరి వెూడీ కనుసన్నల్లో కేసీఆర్ నడుస్తున్నారనే భావన కలిగించింది. ఈ ఏడేళ్లలో ఈ భావన బలపడింది.
అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం తరువాత టీఆర్ ఎస్ లో, కేసీఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు కానవస్తున్నది. భారతీయ జనతా పార్టీ వర్గాలలో ఫ్రెండ్లీ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితి చివరకు ఎదరుదాడికి దిగే పరిస్థితి తెచ్చుకోవడం వెనక బిజెపి బలపడకుండా చూడాలన్న లక్ష్యం తప్ప మరోటి కనిపించదు. తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ బలానికి నిదర్శనంగా విశ్లేషకులు ఈ పరిణామాలను చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో నాలుగు లోకసేభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా బిజెపి పుంజుకుంది. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి చేతిలో కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలైంది. దాంతో టీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన టీఆర్‌ఎస్‌లో గుబులు రేపింది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓటమి కేసీఆర్ కు పెద్ద షాక అని చెప్పాలి. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కేసీఆర్ ఆందోళనకు కారణం కావచ్చు. ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంశాల ప్రాతిపదికన పోరాడేందుకు టీఆర్‌ఎస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపింది. అయితే ఇంత కాలం కేసీఆర్ సర్కార్ మోడీ అనుకూల వైఖరి కారణంగా బీజేపీయేతర పార్టీల కూటమి ఏర్పాటు ప్రక్రియ అంత సజావుగా సాగడం లేదు. కేసీఆర్ తీరును గమనించినన బీజేపీ యేతర పార్టీలు కేసీఆర్ నాయకత్వంలో సమష్టి కార్యాచరణకు సుముఖత వ్యక్త పరచడం లేదు. ఈ పరిస్థితిలో బీజేపీ వ్యతిరేక వైఖరే తనకు ప్రజాబలంగా మారుతుందన్న ఆశాభావంతో కేసీఆర్ ఉన్నారు.