సజ్జల గారూ ఇదేంటి సారూ..
posted on Apr 22, 2022 11:38AM
రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే,అందులో పెద్దగా తప్పు పట్టవలసింది ఉండదు.అయితే,రాజకీయ నేతలు,ముఖ్యంగా అధికార పార్టీ నేతలు,అందునా ప్రభుత్వ ముఖ్య సలహదారు హోదాలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్వం తానై చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వ్యక్తి, తమ ప్రభుత్వం వైఫల్యాలు అన్నిటికీ, ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడే బాధ్యుడు అంటే, అది చెప్పే వాళ్ళకు ఎలా ఉన్నా, వినేవాళ్ళకు, కొంచెం చాలా అసహ్యంగా, అసభ్యంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, ఓ వంక స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తమకు తెలిసిన ‘పవిత్ర’ భాషలో ప్రతిపక్ష పార్టీలు, తమను ఏమీ పీ...లేవని అంటుంటే, ముఖ్యసలహాదారు,అన్నీ ప్రతిపక్ష నేత పుణ్యమే అనడం ఏమిటో అన్న ప్రశ్న పబ్లిక్ నుంచి వినవస్తోంది.
పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. నిజానికి అదేమి పెద్ద విషయం కాదు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు చుసుకుంటారు.కానీ, పోలవరం డయాఫ్రం వాల్ ఎందుకు దెబ్బతిన్నది, ఎందుకు మరమత్తులు చేయడం లేదు అంటే అందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కారణమని, సజ్జల సమాధానం ఇవ్వడం ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో, చంద్రబాబు రైతులకు త్వరగా నీళ్లివ్వడానికి వేగంగా పనులు చేయించారని, అందుకే ఇప్పుడు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని సజ్జల చెబుతున్నారు.అదే నిజమని అనుకున్నా, మూడేళ్ళుగా అధికారంలో ఉన్న శ్రీ సజ్జల వారి సర్కార్ ఏమి చేస్తోందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు డయాఫ్రం వాల్ ఎలా కట్టాలో నిపుణులకు కూడా తెలియడం లేదని ఆయన చెబుతున్నారు.అంటే మూడేళ్ళుగా పోలవరం పనులను ప్రభుత్వం పట్టించుకోనే లేదని సజ్జల చెపుతున్నారా, ఆనే ప్రశ్న కూడా వినవస్తోంది. అందుకే తమ ప్రభుత్వ వైఫల్యాలకు, చేతకాని తనానికి చంద్రబాబు నాయుడే కారణమని చెప్పడం విడ్డూరంగానే కాదు, వినేందుకు వికారంగానూ ఉందని సామాన్యులు అంటున్నారు.
అలాగే సజ్జల ప్రతిపక్షాల పై చేస్తున్న రాజకీయ విమర్శలు కూడా గీత దాటుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన విశేష రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నాయకుని పట్టుకుని,ఆయన ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని అనడం సజ్జల స్థాయికి తగదని విమర్శకులు అంటున్నారు. నిజానికి, మీడియా స్వేచ్చను కూడా హరించి వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం విపక్షాల పై దుపు తప్పి విమర్శలు చేయడం వలన ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారుతుందని మాజీ మంత్రులు సహ వైసీపీ సీనియర్ నాయకులు కూడా, ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.
నిజానికి,సజ్జల రామకృష్ణా రెడ్డి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదు, పార్టీలోనూ పదవులు ఉన్నా ఆయన ప్రధానంగా ప్రభుత్వ సలహదారు మాత్రమే.నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వంలో అలాంటి సలహాదారులు చాలా మందే ఉన్నారు.అందు లో ఒకటీ అరా పేర్లు తప్పించి, మిగిలినవారు ఎవరో, ఏమి చేస్తుంటారో కూడా ఎవరికీ తెలియదు. మరో వంక సంబందిత శాఖలకు మంత్రులున్నారు. అయినా తగుదునమ్మాఅని అన్నిటికీ సజ్జల ఒక్కరే ఎందుకు సీన్’లోకి వస్తారు, అనే ప్రశ్నకూడా వినవస్తోంది. నిజానికి,సజ్జల వ్యవహర సరళి పట్ల ఇటు మంత్రులు,అధికారులలో,అదే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రికి తమకు మధ్య అడ్డుగోడలు కడుతున్నారనే అభియోగం అన్ని విపుల నుంచి వినవస్తోంది.ఈ నేపధ్యంలోనే మీడియా వర్గాల్లో సజ్జల రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు,అనే చర్చ జరుగుతోంది. అంతే కాదు, సజ్జల వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా పార్టీని, ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ముందు ముందు ముఖ్యమంత్రికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా గుసగుసలు పోతున్నట్లు తెలుస్తోంది.అయితే జగన్మోహన్ రెడ్డికి కూడా అన్నీ తెలుసునని, అయినా ఆయన సజ్జలకు చెక్ పెట్టే సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.