‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రుడి విజయం



తెలుగు సినిమా నటీనటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. ఆయన తన ప్రత్యర్థి నటి జయసుధపై 87 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ‘మా’లో మొత్తం 702 మంది సభ్యులున్నారు. వీరిలో 394 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఫిల్మ్‌ఛాంబర్‌ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

‘మా’ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో సినీ పరిశ్రమలోని పెద్ద తలకాయలన్నీ అండగా నిలిచిన జయసుధ విజయం సాధించే అవకాశాలున్నాయని భావించారు. అయితే ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ ప్యానల్ ప్రచారంలో ముందంజ వేయడం, ఇతర కారణాల వల్ల ఆయన గెలుస్తారన్న అభిప్రాయాలు ఏర్పాడ్డాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ విజయం ఖాయమన్న అభిప్రాయాలు బలపడ్డాయి. ఇప్పుడు ఫలితాలు వెల్లడి అయిన తర్వాత అది నిజమైంది. రాజేంద్రప్రసాద్ ప్యానల్ తొలి రౌండ్ నుంచే ఆధిక్యాన్ని చూపించింది. ‘మా’ ఎన్నికలు ఈసారి ఎప్పుడూ లేని విధంగా వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. రెండు ప్యానళ్ళూ విమర్శలు గుప్పించుకున్నారు. ఒక నటుడు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. చివరికి కోర్టు అనుమతితో ఓట్ల లెక్కింపు జరిగింది. కోర్టుకు వెళ్ళిన నటుడికి మొట్టికాయలూ పడ్డాయి.