భారత్ "ఛాబహార్" దెబ్బ..పాకిస్థాన్ అబ్బా..!
posted on May 24, 2016 11:49AM
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత విదేశాంగ విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశం వెళ్లినా విజయంతో తిరిగి వస్తున్నారు. వివిధ దేశాలతో భారత్ దశాబ్దాల క్రితం కుదుర్చుకోవాలని , కుదుర్చుకోలేకపోయిన ఎన్నో ఒప్పందాలను మోడీ తన చాతుర్యంతో నెరవేరుస్తున్నారు. రెండు రోజుల ఇరాన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ చరిత్రాత్మకంగా నిలిచే కీలకమైన ఒప్పందంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలవంతమై కీలక ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేసేలా దారి తీశాయి. అదే ఛాబహార్ రేవు అభివృద్ధిలో భారత్ భాగస్వామి అయ్యే ఒప్పందం. అది భారత్‌కు ఏవిధంగా కీలకమనేగా మీ డౌట్..అక్కడే ఉంది భారత వ్యూహకర్తల మేధస్సు.
ఛాబహార్ ఉన్న ప్రాంతం భారతదేశ పశ్చిమ తీరానికి కూతవేటు దూరంలో ఉంది. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు ద్వారా వెళ్లాల్సిన అవసరం లేకుండానే కొన్ని దేశాలను చేరుకునేందుకు ఈ మార్గం సులభతరమవుతుంది. అంతేకాదు ఈ రేవుపై వాణిజ్య ఒప్పందం ద్వారా ఇరాన్‌లో అడుగుపెట్టి, అఫ్గానిస్థాన్, రష్యా, ఐరోపా దేశాలతో అనుసంధానత సాధించేందుకు భారత్‌కు వీలవుతుంది. మన ఇంధన అవసరాల రీత్యా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేయడానికి పైప్‌లైన్ నిర్మించాలని ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నాం. అయితే ఇరాన్ నుంచి భారత్‌కు పైప్‌లైన్ నిర్మించాలంటే అది పాక్ భూభాగం గుండా రావాలి దీనికి పాక్ ససేమిరా అంటోంది. అదీగాక ఇరాన్-పాక్ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే . దీంతో చాబహార్ చాలా కీలకమవుతుంది. అలాగే భారత్ నుంచి ఆఫ్గనిస్థాన్‌కు వెళ్లాలన్నా పాక్‌ను టచ్ చేయాల్సిందే. దీంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాబహార్ కల సాకారమైతే అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆఫ్గాన్‌కు వెళ్లవచ్చు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఛాబహార్ రేవు అభివృద్ధిపై 2003లోనే అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. అనంతరం ప్రభుత్వ మార్పిడి జరగడం..కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో ఇది మరుగునపడింది. అయితే భారత్‌ను అష్టదిగ్బంధం చేయాలని యోచిస్తున్న చైనా మనకు సమీపంలోని ప్రతిదేశంతో ఏదో రకంగా పొత్తుపెట్టుకుని అక్కడ తన ఆయుధాల్ని మోహరిస్తోంది. ఆ ప్లాన్‌లో భాగంగానే పాకిస్థాన్‌లోని గ్వదర్ ఓడరేవును అభివృద్ధి చేసి భారత్‌ను దెబ్బతీయాలని భావిస్తోంది. దీనిని పసిగట్టిన మన రక్షణ శాఖ నిపుణులు వీలైనంత త్వరగా మేల్కొనకపోతే నష్టం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దీనికి ధీటైన జవాబు కోసం అన్వేషిస్తుండగా గతంలో అటకెక్కించిన ఛాబహార్ ప్రతిపాదన వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఇరాన్ పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశాధినేత హాసన్ రౌహానీతో ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత 12 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిలో ఒకటిగా ఛాబహార్ రేవును చర్చి రౌహానిని ఒప్పించారు. అటు ఛాబహార్ రేవు అభివృద్ధిలో భారత భాగస్వామి అవుతుందని ఏ మాత్రం ఊహించని పాక్, చైనాలకు ఈ వార్తతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. మరి ఇరాన్, ఇండియాలపై తన అక్రోశాన్ని వెల్లగక్కేందుకు ఈ ఇద్దరుమిత్రులు ఏం చేయబోతున్నారో..?