రోహిణి దంచుతోంది..!
posted on May 25, 2016 11:59AM
సరిగ్గా వారం క్రితం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతం మొత్తం భారీ వర్షాలు, ఈదురు గాలులతో వణికిపోయింది. అందుకు కారణం రోను తుఫాను. దీని ప్రభావంతో ఈ ఏడాది రోహిణి కార్తె ప్రభావం అంతంగా ఉండకపోవచ్చని నిపుణులు, ప్రజలు భావించారు. దానికి తగ్గట్టుగానే రోను వెళ్లిన రెండు, మూడు రోజుల వరకు ఎండవేడిమి అంతగా కనిపించలేదు. అయితే రోహిణి కార్తె ప్రవేశంతో సోమవారం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు ప్రారంభమైంది. నిన్న మొన్నటి వరకు 35 లోపుగా ఉన్న ఉష్ణోగ్రత..ఏకంగా 45 నుంచి 48 డిగ్రీలకు పెరిగిపోయింది.
రాజమండ్రిలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మచిలీపట్నం, బాపట్ల, రెంటచింతల, నర్సాపురం, కావలిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు సింగరేణి బొగ్గుగనుల ప్రాంతమైతే నిప్పుల కొలిమిని తలపించింది. కేటీపీఎస్, కొత్తగూడెం ప్రాంతాలు ఎండదెబ్బకు నిర్మానుష్యంగా మారాయి. అనేక ప్రాంతాల్లో గబ్బిలాలు, పక్షులు నేలరాలాయి. ఓపెన్‌కాస్ట్ గని కార్మికులు విధుల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఆశ్వారావుపేట మండలం తిరులకుంటలో 20 ఎకరాల జామాయిల్ తోట, మద్దికొండలో ఐదెకరాల పామాయిల్ తోట ఎండదెబ్బకు తగలబడిపోయింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా..సాయంత్రం ఆరు గంటల వరకు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. దీంతో చాలా ప్రాంతాల్లో వడగాల్పులు పెరిగిపోయాయి.
దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు వడగాల్పుల తీవ్రతను తట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. వాహనదారులు నరకం చూశారు. జనం ఇళ్లలో ఉన్నప్పటికీ వేడితీవ్రతను అనుభవించారు. ఇక తప్సనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీదకు వచ్చినవారి బాధలు అన్నీ ఇన్నీ కావు. వడదెబ్బకు నిన్న ఒక్కరోజే 768 మంది మరణించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరణించిన వారిలో తెలంగాణ నుంచి 315 మంది, ఏపీ నుంచి 453 మంది ఉన్నారు. పశ్చిమ, వాయువ్య దేశం నుంచి పొడిగాలులు తెలుగు రాష్ట్రాలపైకి దూసుకురావడంతో గాలిలో తేమశాతం తగ్గి ఎండతీవ్రత పెరిగింది. ప్రస్తుతం ద్రోణులు, అల్పపీడనాలు లేకపోవడంతో వడగాల్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి రోహిణి కార్తెలో రోళ్లు కూడా బద్ధలవుతాయని ఉన్న సామెతను రోహిణి నిలబెట్టుకుంటోంది. దీని ప్రభావం మరో 14 రోజులు ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకే వరకు జనం రోహిణిని భరించకతప్పదు.