‘పీఎం కేర్స్‌’కు చైనా సంస్థల నుంచి భారీగా విరాళాలు!

భారత్-చైనా సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. భారత్ లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య చైనా పేరుతో మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి భారీగా నిధులు వచ్చాయని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన ‘పీఎం కేర్స్‌’ నిధికి చైనా సంస్థల నుంచి భారీగా నిధులు వచ్చాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. 

ఎన్నో ప్రముఖ చైనా కంపెనీలు పీఎం కేర్స్ కు భారీగా నిధులు ఇచ్చాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. ఓవైపు చైనా కారణంగా జాతి భద్రతకు ప్రమాదం వాటిల్లుతున్న వేళ.. చైనా సంస్థల నుంచి విరాళాలను ఎందుకు అంగీకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పీఎం కేర్స్ కు పేటీఎం నుంచి రూ.100 కోట్లు, టిక్ ‌టాక్‌ నుంచి రూ.30 కోట్లు, షావోమీ నుంచి రూ.15 కోట్లు, హువావే నుంచి రూ. 7 కోట్లు, ఒప్పో నుంచి రూ.1 కోటి పీఎం కేర్స్ కు విరాళంగా వచ్చాయని తెలిపారు. గత నెల 20 నాటికి, పీఎం కేర్స్ నిధికి దాదాపు 9,678 కోట్లు వచ్చాయని, ఈ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ నిధులు దారి మళ్లుతున్నాయని, అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదని ఆరోపించారు. పీఎం కేర్స్ మోదీ సొంత నిధి అయిపోయిందని విమర్శలు గుప్పించారు.

2007 నుంచి బీజేపీకి చైనా కమ్యూనిస్టు పార్టీతో(సీపీసీ) సంబంధాలున్నాయని అభిషేక్ ఆరోపించారు. గత 13ఏళ్లలో ఆ పార్టీ అధ్యక్షులు చైనాతో సంబంధాలు నెరపినంతగా, భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు నెరపలేదని విమర్శిచారు. 2007, 2008 లలో రాజ్‌నాథ్‌ సింగ్‌, 2011 లో గడ్కరీ, 2014లో అమిత్‌ షా సీపీసీతో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. బీజేపీ దేశ భద్రత గురించి లెక్కలేదు.. అయితే తమ గురించి లేదా రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారని అభిషేక్ విమర్శించారు.