పిల్లల్లో ఊబకాయం ఉంటే!

 

ఇంట్లో పిల్లలు మితిమీరిన బరువుతో ఉంటే కంగారు పడటం సహజం. వారు ఊబకాయులుగా మారిపోతారన్న భయమూ సహజమే! ఎందుకంటే ఊబకాయం కేవలం ఒక లక్షణం మాత్రమే కాదనీ, సవాలక్ష రోగాలకు సింహద్వారం అని ఈపాటికే తేలిపోయింది. కానీ ఇలాంటప్పుడు తల్లిదండ్రుల చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం American Academy of Pediatrics అనే సంస్థ ఓ ఆరు సూచనలను అందిస్తోంది. అవేమిటంటే...

 

డైటింగ్‌ను ప్రోత్సహించవద్దు!

పిల్లల్లో మరీ ముఖ్యంగా టీనేజీ పిల్లల్లో ఊబకాయం ఉందన్న స్పృహ కలగగానే, దాన్ని ఎలాగైనా తగ్గించుకునేందుకు డైటింగ్‌లోకి దూకేస్తారు. నిజానికి డైటింగ్‌ అనేది ఊబకాయానికి ఓ పరిష్కారం కాకపోగా, అది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందంటున్నారు వైద్యులు. పైగా డైటింగ్ వల్ల ఊబకాయం తగ్గకపోగా, పెరిగే అవకాశమే ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.

 

బరువు గురించి మాట్లాడవద్దు

అధికబరువు, ఊబకాయం వంటి విషయాల గురించి పిల్లల వద్ద మాట్లాడకపోవడమే మంచిదంటున్నారు. ఇలాంటి మాటల వల్ల పిల్లల్లో తాము ఎలాగైనా లావు తగ్గాలనే తపన కలుగుతుంది. ఆ తపనలో డైటింగ్, ఉపవాసాలు వంటి పద్ధతులను ఎడాపెడా అనుసరించేయడం మొదలుపెట్టేస్తారు.

 

అవహేళన కూడదు

కళ్ల ముందు ఎవరన్నా పిల్లలు కాస్త బొద్దుగా కనిపిస్తే, వారిని ఏడిపించేవారికి కొదవ ఉండదు. ఇలాంటి అవహేళనలు సదరు పిల్లల్లో ఆత్మన్యూనతకి దారితీస్తాయి. వాళ్లు తమ శరీరాన్ని తాము ద్వేషించే స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా కౌమార వయసులో ఉన్న పిల్లల మనసు మీద, ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ, సరదాగానైనా సరే... ఊబకాయం గురించిన హేళన కూడదు.

 

కలిసి తినండి

వీలైనంతవరకూ, కుటుంబం అంతా కలసి కూర్చుని భోజనం చేయడం మంచిదట! దీనివల్ల వారి మధ్య అనుబంధాలు దృఢం కావడం మాట అటుంచి ఆకలికి తగినంత ఆహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా టీవీ చూస్తూనో, వేళాపాళా లేకుండానో తినే అలవాటు ఉంటేనో... ఆహారం ఎక్కువ తక్కువలుగా తీసుకునే ప్రమాదం ఉంది. పైగా ఒకేచోట కలిసి భోజనం చేయడం వల్ల, ఒకరిని చూసి మరొకరు పోషకాహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 

వ్యాయామాన్ని ప్రోత్సహించండి

‘వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా, బలంగా ఉంటావు!’ అన్న సాకుతో పిల్లల్లో వ్యాయామాన్ని ప్రోత్సహించండి. అంతేకానీ ‘వ్యాయామం చేస్తే బరువు తగ్గుతావు, సన్నబడతావు!’ అని చెప్పవద్దు. ఆరోగ్యం పేరుతో పిల్లల్ని వ్యాయామానికి ప్రోత్సహిస్తే, బరువు దానంతట అదే తగ్గుతుంది.

 

ఆరోగ్యకరమైన వాతావరణం!

ఇంట్లో ఆరోగ్యకరమైన అలవాట్లకు అవకాశం ఇవ్వండి. పళ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు.... వంటి పోషకాలు పిల్లల ఆహారంలో ఉండేలా జాగ్రత్త తీసుకోండి. కూల్‌డ్రింకులు, బేకరీ పదార్థాలు, చాక్లెట్లు... వంటి చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలకు ఇంట్లో చోటు పెట్టవద్దు. దీంతో పిల్లలు బయట ఏం చేసినా కానీ, కనీసం ఇంట్లో అన్నా ఆరోగ్యకరమైన అలవాట్ల మధ్య ఉండే అవకాశం ఉంటుంది.

 

పై సూచనలన్నింటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే- పిల్లల ఆహారపు అలవాట్లనీ, జీవనశైలినీ కాస్త మార్చగలిగితే... వారి ఊబకాయపు సమస్య కూడా ఒక కొలిక్కి వచ్చేస్తుందని తేల్తోంది. అందుకే పిల్లల బరువు గురించి కాదు, వారి ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోమంటున్నారు నిపుణులు.

 

- నిర్జర.