అయినా కష్టాలేనా..
posted on Aug 8, 2015 11:23AM
‘‘మీకు అండగా నేనుంటా'' ఇవి కాంగ్రెసపార్టీ ఉపాధ్యక్షుడు పలికిన మాటలు. ఈ మాటలు ఎవరితో చెప్పారనుకుంటున్నారా.. తెలంగాణ ఓయూ విద్యార్ధులతో.. అయితే కేవలం తమ పార్టీ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా చీల్చిందని రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అయితే ఈ రాష్ట్ర విభజన వల్ల అటు ఆంధ్రా రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సరైన రీతిలో బుద్ధిచెప్పినా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం సోనియా గాంధీని ఓ దేవతలా పొగిడారు. సోనియాగాంధీనే తెలంగాణను ఇచ్చిందని.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని ప్రశంసలు కురిపించారు. నాటి నుండి నేటి వరకు కూడా కేసీఆర్ కు సోనియాగాంధీ అంటే కాస్తంత గౌరవమే ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనే కేసీఆర్ పై పోటీ పడటానికి బరిలోకి దిగారు.
ఉస్మానియా విద్యార్ధులు ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ప్రతినిధులు అద్దంకి దయాకర్, శ్రావణ్‌లతో కలిసి భేటీ అయ్యారు. ఉస్మానియాలో జరగనున్న విద్యార్ధి ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని వారు రాహుల్ గాంధీని ఆహ్వానించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే ఓయూ భూముల విషయంలో కేసీఆర్ కు, విద్యార్ధులకు మధ్య వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్ధులు కేసీఆర్ తీరుపై ఫిర్యాదు చేయడంతో దీనికి స్పందించిన రాహుల్ గాంధీ.. కేసీఆర్ పై పోరాడండి మీతో నేనుంటా అని భరోసా ఇచ్చారంట. అంతేకాదు ఇంకా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో పోరాడి రాష్ట్రాన్ని సాధించిన వారిలో మొదటి పాత్ర మీదేనని.. అదే విధంగా ప్రజా సమస్యలపై కూడా పోరాడండి అంటూ విద్యార్ధులతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు పనిలో పనిగా కేసీఆర్ పై కూడా విమర్శల బాణాలు విసిరారు రాహుల్.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశత్వాన్ని ఇక ఎంతమాత్రం సహించొద్దని... కేసీఆర్ లో నిరంకుశతత్వ లక్షణాలు ఎక్కువని ఎద్దేవ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఇంకా కష్టాలేనా? ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థుల గోడే కేసీఆర్ కు పట్టడం లేదా ప్రశ్నించారు.
మొత్తానికి రాహుల్ గాంధీ అందరిపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విశ్రాంతి పేరిట కొంత కాలం మాయమైన రాహుల్ గాంధీ తరువాత బయటికి వచ్చి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు.. పోరాట పటిమ పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ పై ఉన్న అముల్ బేబి అనే బ్రాండ్ పోవడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.