మోడీ పాలనపై భిన్నాభిప్రాయలకు కారణం ఏమిటి?

 

మోడీ ప్రభుత్వం ప్రస్తుతం చాలా విచిత్రమయిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ప్రపంచ దేశాలన్నీ మోడీ నామస్మరణ చేస్తుంటే, దేశంలో కొందరు మేధావులు మోడీ అధికారంలోకి వచ్చేక భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలుగుతోందని, దేశంలో మత అసహనం పెరిగిపోతోందని ఆరోపిస్తూ తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారు. దేశంలో చాలా మంది ప్రజలు, విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు మోడీ నేతృత్వంలో భారత్ చాలా వేగంగా అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని దృడంగా విశ్వసిస్తుంటే, దేశంలో కొంతమంది ప్రజలు మోడీ ప్రభుత్వం దేశాభివృద్ధి కంటే అభివృద్ధి జరిగిపోతున్నట్లు గట్టిగా ప్రచారం చేసుకోవడానికే పరిమితం అయిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

సార్వత్రిక ఎన్నికలు మొదలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వరకు బీజేపీ విజయపధంలో సాగిపోతుండటం గమనిస్తే మోడీ పరిపాలన పట్ల ప్రజలలో సదాభిప్రాయమే ఉందని అర్ధమవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి రెండు దశలలో ‘అభివృద్ధి’ ప్రదానాంశంగా మారడానికి కారణం కూడా అదేనని చెప్పుకోవచ్చును.

 

బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వామ పక్షాలు, కాంగ్రెస్ తదితర పార్టీలు ఇంతకు ముందు భూసేకరణ చట్టంతో మోడీ ప్రభుత్వాన్ని చావు దెబ్బతీయాలని ప్రయత్నించి భంగపడ్డాయి. బీజేపీని ఇటువంటి రాజ్యాంగ, సాంకేతిక, ఆర్ధిక, పరిపాలనా పరమయిన అంశాలతో ఎదుర్కోవడం కష్టమని గ్రహించిన కాంగ్రెస్ దాని మద్దతుదారులు బీజేపీకి ఉన్న మతతత్వ ముద్రనే హైలైట్ చేస్తూ దానితోనే మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. అందుకే దేశంలో ఎక్కడ హిందుమతోన్మాదులు పేట్రేగిపోయినా దానిని మోడీ ప్రభుత్వానికి లింక్ చేస్తూ అందరూ కలిసికట్టుగా గట్టిగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. కొందరు సాధువులు, ఆర్.ఎస్.ఎస్. నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, ముంబాయిలో శివసేన ఆగడాలు చాలా శృతి మించిపోవడంతో మోడీ ప్రభుత్వ వ్యతిరేకులు చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది.

 

ఇదివరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశంలో చాలాసార్లు మత ఘర్షణలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు చాలాసార్లు జరిగాయి కానీ వాటిని కాంగ్రెస్ (యూపిఏ) ప్రభుత్వానికి ఆపాదించబడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సెక్యులర్ ముద్ర సంపాదించుకొంది కనుకనే అని చెప్పక తప్పదు. కానీ కాంగ్రెస్ పాలనలో కూడా లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అవినీతి సర్వత్రా వ్యాప్తి చెందింది. మహిళలపై సామూహిక అత్యాచార ఘటనలు జరిగాయి. ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ పరువు ప్రతిష్టలు మంటగలవడం అప్పటి నుంచే మొదలయింది. కాంగ్రెస్ పార్టీని “మత స్వేచ్చ-కుహానా సెక్యులరిజం” కారణంగానే  ఇంత కాలం దేశ ప్రజలు భరిస్తూ వచ్చేరు. కానీ దాని వలన వినాశనమే తప్ప అభివృద్ధి జరుగలేదనే సంగతి రుజువవడంతో అభివృద్ధిని కాంక్షిస్తూ దేశ ప్రజలు మోడీకి పట్టం కట్టారు.

 

ఆయన పరిపాలనలో కూడా కొన్ని తప్పులు ఉండవచ్చును లేదా జరుగుతుండవచ్చును కానీ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే మోడీ పాలన వంద రెట్లు మెరుగయినదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎప్పటికప్పుడు దేశ అవసరాలకి తగ్గట్లుగా అనేక సంస్కరణలు చేస్తూ పాలనలో చురుకుదనం తెచ్చారు. బంగ్లాదేశ్ తో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించారు. భారత్ సైనికులు దశాబ్దాలుగా అడుగుతున్న 'ఒకే హోదా-ఒకే పెన్షన్' డిమాండ్ ని నెరవేర్చారు. అనేక రాష్ట్రాలలో ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో మారుమూల ప్రాంతాలకు విద్యుత్, రోడ్లు తదితర ప్రాధమిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆదాయంలో వాత పెంచి ఇచ్చారు. ఆర్ధిక, పారిశ్రామిక ప్రగతిలో అభివృద్ధి సాధిస్తున్నారు. ప్రపంచ దేశాలలో వ్యాపారానికి అనుకూలమయిన దేశాలలో భారత్ స్థానం 140 నుండి 132కి చేరుకోవడమే దేశ పరిస్థితుల్లో మార్పు మొదలయిందని, దానిని యావత్ ప్రపంచం గుర్తించిందని విస్పష్టంగా తెలియజేస్తోంది.

 

ఒకవేళ మోడీ ప్రభుత్వం ఇదే వేగంగా దేశాభివృద్ధి సాగించినట్లయితే వచ్చే ఎన్నికల సమయానికి వాటి ఫలితాలు ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతాయి. అప్పుడు ఇక బీజేపీని, మోడీని గద్దె దించడం అసంభవం కనుకనే దేశంలో ఇతర సమస్యల గురించి, మాట్లాడకుండా...పోరాడకుండా కేవలం “మత స్వేచ్చ-కుహానా సెక్యులరిజం” అనే అంశాలకి హైప్ క్రియేట్ చేస్తున్నారు. గురించి మాత్రమే మాట్లాడుతున్నారని భావించవచ్చును. ఒకవేళ మోడీ ప్రభుత్వం నిజంగానే ప్రజల మత స్వేచ్చను, భావ ప్రకటన స్వేచ్చను హరించే ప్రయత్నం చేస్తే దానిని ఏవిధంగా రక్షించుకోవాలో దేశప్రజలకు బాగా తెలుసు. దేశంలో జరిగే చెదురుముదురు సంఘటనలను, బీజేపీ అనుబంధ పార్టీలు, నేతలు చేసే వివాదాస్పద వ్యాఖ్యలను, తప్పులను హైలైట్ చేసి చూపిస్తూ దేశంలో పెద్ద అనర్ధం జరిగిపోతోందన్నట్లు, పెద్ద ఉపద్రవం ముంచుకు వస్తున్నట్లు కాంగ్రెస్ దానికి మద్దతు పలికే కొందరు మేధావులు దేశ ప్రజలను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని వారు చేస్తున్న ఈ ప్రయత్నాల వలన, ప్రపంచ దేశాలలో భారత్ పట్ల మళ్ళీ ఒక దురాభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందనే సంగతి ‘సో కాల్డ్ మేధావులు’ విస్మరించడం చాలా శోచనీయం. వారి దుష్ప్రచారాన్ని నమ్ముతున్నవారు దేశంలో నిజంగానే అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయా? లేక తమ చుట్టూ ఏమయినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా? అని స్వయంగా పరిశీలించి చూసుకొన్న తరువాతనే మోడీ ప్రభుత్వం గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడం మంచిది.