ఇద్దరూ సేమ్ టు సేమ్ పగటి కలలు కంటున్నారు
posted on Nov 3, 2015 8:41AM
ఏపిలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తరచూ “త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది..మేము అధికారంలోకి వస్తాము..ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని” చెపుతుంటారు. ప్రజల కష్టాలు తీరడం ముఖ్యమని భావిస్తున్నారో లేక తను అధికారంలోకి రావడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారో తెలియదు కానీ నిత్యం అదే పాట పాడుతుంటారు. కలలు కనమని మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పారు కనుక జగన్ పగటి కలలు కంటే ఎవరూ కాదనలేరు. అధికార తెదేపా నేతలు కూడా ఆయనకు ‘అదో తుత్తి’ అని నవ్వుకొంటారు.
ఇంచుమించు జగన్ పరిస్థితిలోనే ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయిపోతున్నట్లున్నారు. జగన్ బాటలో ఓదార్పు యాత్రలు చేసాక ఇప్పుడు జగన్ మాదిరిగానే రాహుల్ కూడా మోడీ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెపుతున్నారు.
బిహార్ లోని అరారియాలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలమయింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. ధరలు నియంత్రిస్తామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్పారు కానీ ఏ ఒక్క హామీ నిర్వహించలేకపోయారు. యూపీఏ హయాంలో కేజీ రూ.70 ఉండే కంది పప్పు ధర ఇప్పుడు కేజీ రూ.200కి చేరుకొంది. అయినా మోడీ ప్రభుత్వం ధరల నియంత్రణకి ఎటువంటి చర్యలు చేప్పట్టడం లేదు. ప్రధాని మోడి కేవలం ఏడాదిన్నర తిరక్కుండానే అన్ని వ్యవస్థలపై నియంత్రణ కోల్పోయి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇదేవిధంగా మోడీ పరిపాలన సాగించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయనే అవకాశం కల్పించడం తధ్యం. మోడీ పాలన త్వరగా ముగిసిపోయి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ప్రజలు కూడా అదే కోరుకొంటున్నారు,” అని అన్నారు.
ఏపీలో తెదేపా ప్రభుత్వం కూలిపోయి తను ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ కోరుకొంటున్నారు. మోడీ ప్రభుత్వం పోయి తను ప్రధానమంత్రి అవ్వాలని రాహుల్ గాంధీ కలలుగంటున్నారు. ఒకరు రాష్ట్ర స్థాయిలో మరొకరు జాతీయ స్థాయిలో పగటి కలలు కంటున్నారు. అంతే తేడా. జగన్ పంచాంగం ప్రకారం ఏపీలో మరో ఒకటి రెండేళ్లలో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నట్లు అనుకోవాలి. రాహుల్ గాంధీ మాత్రం మోడీకి మిగిలిన మూడున్నరేళ్ళు అధికారంలో కంటిన్యూ అయ్యేందుకు అనుమతించినట్లున్నారు. కనుక వారిద్దరి జోస్యం ఫలించి వారి పగటి కలలు నిజమవుతాయో లేదో తెలుసుకోవాలంటే అంతవరకు ఆగవలసిందే మరి.