`మేము సైతం`... వాడుకొంటాం!
posted on Nov 27, 2014 10:39AM
చిత్ర పరిశ్రమలో ఉండే రాజకీయాలు... రాజకీయాల్లోనూ ఉండవేమో!?? గ్రూపులు కట్టడాలు, వర్గాల పేరుతో ఆధిపత్యాలు చెలాయించడంలోనూ చిత్రసీమను మరేది బీటవుట్ చేయదేమో..?? ప్రతీ సారీ, ఏదో ఓ సందర్భంలో చిత్రసీమ లీలలు బయటకు వస్తూనే ఉంటాయ్. ఇది మరో ఉదంతం మాత్రమే..!
హుద్ హుద్ బాధితులను ఆదుకోవడానికి మేము సైతం అనే కార్యక్రమాన్ని చిత్రసీమ తలపెట్టినప్పుడు... కాస్త ఆలస్యమైనా మంచి పని చేస్తున్నారు.. శభాష్ అనుకొన్నారంతా. వివిధ కార్యక్రమాలు ప్రకటించి, ప్రెస్ మీట్లు పెట్టి, లేని ఐకమత్యాన్ని చాటుకోవడానికి తంటాలు పడుతుంటే... సరిలే అనుకొన్నాం. హుద్ హుద్‌కి అతలాకుతలమైన విశాఖ తీరానికి వీళ్లంతా మళ్లీ చిరునవ్వుల్ని పరిచయం చేస్తారు కదా.. అని ఆశపడ్డాం. కానీ... ఇదంతా అంబక్ అని తేలుతుంటే, ఇక్కడా రాజకీయాలు చేస్తారని తెలుస్తుంటే, స్వప్రయోజనాల కోసం.. ఓ మంచి కార్యక్రమాన్ని కూడా తాకట్టు పెడతారని అర్థమవుతుంటే... మన చివుక్కుమంటుంది. మనసులో మరో హుద్ హుద్ మొదలవుతోంది. ఇంతకీ సంగతేంటంటే..
ఈనెల 30వ తేదీన మేము సైతం అనే ఓ బృహత్తర కార్యక్రమం జరపబోతోంది తెలుగు చిత్రసీమ. ఈ కార్యక్రమం కోసం సేకరించిన విరాళాల్ని హుద్ హుద్ బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తారు. నిజానికి ఇది చాలా చాలా మంచి కార్యక్రమం. మేమున్నామన్న భరోసా విశాఖ ప్రజలకు ఇవ్వడానికి చేసిన ఓ గొప్ప సంకల్పం. అయితే ఇక్కడా.. స్వార్థం తాండవిస్తోంది. ఒకరి స్వప్రయోజనాలకు మేము సైతం కార్యక్రమాన్ని వేదిక చేసుకోవడం కలవరపెడుతోంది. `ఈ కార్యక్రమంలో తారలంతా పాల్గొంటారు` అని గొప్పగా చెబుతున్నారుగానీ, ఇప్పటి వరకూ ఎవరెవరు వస్తారు? ఏమేం చేస్తారు? అనే విషయాలపై క్లారిటీ లేదు. 30వ తేదీ షెడ్యూల్ ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. `నన్ను వదిలేయండి బాబూ` అంటూ మహేష్ బాబు తప్పించుకొని తిరుగుతున్నాడట. పవన్ అయితే.. ఇది చేస్తా.. అని పక్కాగా చెప్పడం లేదట. ఎవరికి వాళ్లు కుటుంబాల వారిగా విడిపోయి... `మేం ఆ సమయానికి ఏదో ఒకటి... చేస్తాం లెండి` అంటూ లైట్ తీసుకొంటున్నారట. సీరియస్ గా రిహార్సల్స్ మొదలెట్టిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. ఆఖరికి బ్రహ్మానందం కూడా `నాకు పది నిమిషాలు వదిలేయండి. నేనేదో చేస్తా...` అంటున్నాడట.
ఇప్పటి వరకూ మేము సైతం కార్యక్రమానికి సంబంధించి 4 ప్రెస్‌మీట్లు పెట్టారు. ఒక్కసారి కూడా తెలుగు చిత్రసీమలోని అగ్ర కథానాయకులు, దర్శకులు ఒక్కటిగా రాలేదు. ఎవరికి తీరిక ఉన్నప్పుడు వాళ్లు మైకు పట్టుకొని.. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా మాట్లాడేసి వెళ్లిపోయారు. చిరంజీవి వచ్చినప్పుడు దాసరి లేరు. దాసరి వచ్చినప్పుడు చిరు లేడు. బాలకృష్ఱ, పవన్, మహేష్, ఎన్టీఆర్ వీళ్లంతా ఇప్పటి వరకూ పత్తా లేరు. స్వచ్చందంగా పాల్గొనవలసిన కార్యక్రమం... బలవంత రాద్దాంతంలా తయారైంది. సినిమాల్లేకి ఖయ్యూమ్‌లాంటివాళ్లు, తేరగా కనిపించే జబర్దస్త్ టీమ్ తప్ప... సీరియస్‌గా ప్రాక్టీస్ చేసేవాళ్లు ఒక్కరూ లేరు. డైన్ విత్ ద స్టార్స్ అనేది మరో పోగ్రాం. అంటే స్టార్స్ అందరితో కలసి భోజనం చేసే అవకాశం ఇస్తారన్నమాట. ఇందులో ఒక జంట పాల్గొవాలంటే రూ.లక్ష రూపాయలు చెల్లించాలి. ఇందుకోసం కొంతమంది స్టార్స్ అంగీకారం తెలిపారు. అయితే వీళ్లంతా విరాళాలు ఇచ్చిన వారితో భోజనం చేయరట. కనీసం వడ్డించరట. `హలో .. హలో` అని దూరం నుంచి పలకరించి వెళ్లిపోతారట. ఇదేం విడ్డూరం...?? ఆమాత్రం దానికి లక్షరూపాయలు ఇవ్వడం ఎందుకు...??
ఇక అన్నింటికంటే భయంకరమైన కుంభకోణం.. శాటిలైట్ హక్కులు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో చూపిస్తారు. అందుకోసం టీవీ ఛానళ్ల నుంచి బిడ్‌ని ఆహ్వానించారు. జెమినీ, మా టీవీ యధావిధిగా ఈ హక్కుల్ని కైవసం చేసుకోవడానికి పోటీ పడ్డాయి. మా టీవీ రూ.6 కోట్ల వరకూ కోడ్ చేసింది. అయితే జెమినీకి ఈ హక్కులు దక్కాయి. అంటే జెమిని రూ.7 కోట్ల వరకూ ఆఫర్ చేసింది అనుకొంటారేమో..? అదేం కాదు. ఇచ్చింది కేవలం మూడున్నర కోట్లు మాత్రమే. ఎక్కడైనా ఎక్కువ మొత్తం బిడ్ చెల్లించిన వాళ్లకే హక్కులు కైవసం అవుతాయి. కానీ ఇక్కడ రివర్స్ అయ్యింది. అదే సినీ మాయా జాలం. ఈ విషయంలో ఒక అగ్ర నిర్మాత పుత్రరత్నం అయిన ఒక నిర్మాత చక్రం తిప్పారని అంటున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన ఇలా జెమినీ టీవీ పక్షం వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇలా వెదుకుతూ పోతే... ఇలాంటి ముళ్లెన్నో కనిపిస్తున్నాయి. ఓ మంచి ఉద్దేశం కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని... తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంతవరకూ భావ్యం..?? ఇది ఎవరి మెప్పు కోసం చేస్తున్న కార్యం..? ఇప్పటికైనా నిర్వాహకులు ఈ విషయమై ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాల్సిందే. ఎవరి అండదండలతో ఎదిగారో, ఎవరి అభిమానాన్ని మెట్లుగా వాడుకొని ఇంత స్థాయికి వచ్చారో గుర్తు తెచ్చుకొని.. తిరిగి ఆ రుణం తీర్చుకోవాల్సిన తరుణంలో అయినా స్వార్థాన్ని, రాజకీయాల్ని పక్కన పెడితే బాగుంటుంది.