మద్రాసు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తుల మధ్య ముసలం

 

దేశంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వింత సమస్య ఒకటి మద్రాసు హైకోర్టు ఇప్పుడు ఎదుర్కొంటోంది. మద్రాస్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చీఫ్ జస్టిస్ సంజె కె. కౌల్ పై కోర్టు ధిక్కారం క్రింద చర్యలు చేప్పట్టడంతో బాటు తనను వేదిస్తున్నందుకు యస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని అదే కోర్టులో న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ సి.యస్. కర్ణన్ హెచ్చరించారు. దానితో ఆయన ఈ విషయం గురించి సుప్రీం కోర్టుకి తెలియజేసి క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు జస్టిస్ కర్ణన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

అసలు ఈ సమస్య ఎలా మొదలయింది అంటే సివిల్ జడ్జీల నియామకం కొరకు చీఫ్ జస్టిస్ సంజె కె. కౌల్ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఒక కమిటినీ ఏర్పాటు చేసారు. వారిలో జస్టిస్ వి. దానపలన్, జస్టిస్ ఆర్.సుధాకర్, జస్టిస్ డి. హరి పరందామన్, జస్టిస్ కిరుబకరాన్ మరియు జస్టిస్ ఆర్. మాల సభ్యులుగా నియమింపబడ్డారు. వారితో బాటు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ మరి కొందరు అధికారులు కూడా ఈ నియామక కమిటీలో సభ్యులుగా నియమింపబడ్డారు. క్రిందటి నెల 15వ తేదీ నుండి 21 వరకు వారు జడ్జీ అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహించవలసి ఉంది.

 

కానీ జస్టిస్ కర్ణన్ ఇంటర్వ్యూలు మొదలయిన మరునాడు అంటే ఏప్రిల్ 16న కమిటీ సభ్యుల నియామకాలు చెల్లవని, కనుక ఇంటర్వ్యూలు తక్షణమే నిలిపివేయామని ఆదేశాలు జరీ చేసారు. దీనిని తను సుమోటు కేసుగా స్వీకరించి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కమిటీలో సభ్యుడిగా నియమితులయిన జస్టిస్ ధనపలన్ నకిలీ విద్యార్హతల సర్టిఫికేట్ కలిగి ఉన్నారనే పిర్యాదులున్నాయని, చట్ట ప్రకారం నియామక కమిటీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం ఒకే వర్గానికి చెందిన ముగ్గురిని నియమించబడ్డారని కనుక ఆ కమిటీ నియామకం చెల్లదని కనుక జడ్జీల ఇంటర్వ్యూలు చేయరాదని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.

 

ఈ వ్యవహారం మళ్ళీ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజె కె. కౌల్ తో కూడిన ధర్మాసనం ముందుకి వచ్చినప్పుడు జస్టిస్ కర్ణన్ ఉత్తర్వులపై స్టే విధించారు. దానితో ఆగ్రహం చెందిన కర్ణన్ ప్రధాన న్యాయమూర్తి తన పరిదిలో ఉన్న కోర్టు వ్యవహారాలలో ప్రధాన న్యాయమూర్తి అనవసరంగా వేలు పెడుతున్నారని, అందుకు ఆయనపై కోర్టు ధిక్కార నేరం క్రింద చర్యలు తీసుకోవలసివస్తుందని హెచ్చరించారు. అంతే కాకుండా దళితుడినయినా తనను వేధిస్తునందున ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా జాతీయ యస్సీ ఎస్టీ కమీషన్ ను ఆదేశించవలసి వస్తుందని ఆయన ప్రధాన న్యాయమూర్తిని హెచ్చరించారు.

 

దీనితో ఆయనకు ఏమి చేయాలో పాలుపోక ఈ జస్టిస్ కర్ణన్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి ఆయనపై తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. రేపు అనగా సోమవారంనాడు ఈ కేసును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెచ్.యల్. దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతుంది.