బాలనేరస్థుల చట్ట సవరణతో నేరాలు ఆగిపోతాయా?

 

డిల్లీలో నిర్భయ ఉదంతం జరిగినప్పుడు యావత్ దేశం చాలా తీవ్రంగా స్పందించింది. అయితే ఆనాటి నుండే మహిళలు, వృద్ద మహిళలు, బాలికలు చివరికి పసిపిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నా ప్రజలలో కానీ ప్రభుత్వంలో గానీ అటువంటి స్పందన కనబడకపోవడం చాలా దురదృష్టకరం. నిర్భయ ఉదంతం జరిగిన తరువాత అప్పటి యూపీఏ ప్రభుత్వం హడావుడిగా బాల నేరస్తుల చట్టానికి కొన్ని సవరణలు చేసింది. నిర్భయ కేసును విచారించేందుకు ‘ఫాస్ట్ ట్రాక్’ కోర్టుని కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇంతవరకు ఆ హేయమయిన నేరానికి పాల్పడినవారెవరికీ శిక్షలు పడలేదు. వారిలో ఒకరు పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు జైలులోనే ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ పొందినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చేయి. ఇక వారిలో ఒకడు బాలనేరస్తుడు కావడంతో అంత హేయమయిన నేరం చేసినప్పటికీ కేవలం మూడేళ్ళ జైలు శిక్షతో బయటపడే అవకాశం పొందాడు.

 

అంత తీవ్రమయిన నేరం చేసినప్పటికీ కోర్టులు ఏమీ చేయలేవని కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా నిర్భయ కేసులో దోషులు కనబడుతుంటే, దేశంలో నానాటికీ అత్యాచారాలు పెరిగిపోకుండా ఉంటాయా? ఇక చాలా ఆందోళనకరమయిన విషయం ఏమిటంటే, నిర్భయ ఉదంతం తరువాత 2013లో అటువంటి హేయమయిన నేరాలకు పాల్పడిన వారిలో 3,887మంది బాల నేరస్తులేనని జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకటించింది. దానిని మొన్న మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ కూడా ద్రువీకరించారు.

 

అందుకే మోడీ ప్రభుత్వం బాల నేరస్తుల చట్టంలో మళ్ళీ కొన్ని సవరణలు చేసింది. వాటి ప్రకారం ఇకపై 16ఏళ్లకు పైబడి వయసున్న బాలనేరస్థులను పెద్దవారిగానే (మేజర్లు) పరిగణించి, వారు చేసిన నేరాల స్థాయిని బట్టి శిక్షలు విధిస్తారు. వారిలో చిన్న నేరాలు, తీవ్రమయిన నేరాలు, అత్యాచారాలు, హత్యలు వాటి క్రూరమయిన నేరాలు చేసినవారికి విడివిడిగా శిక్షలు విధించేలా చట్టంలో ఏర్పాటు చేసారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ సవరణలను లోక్ సభ ఆమోదించింది. అయితే దాని వలన చిన్న పిల్లల హక్కులకు భంగం కలుగుతుందని, ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకొని నిరుపేదలు, గిరిజనుల పిల్లలపై అన్యాయంగా కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. కానీ వారి హక్కుల కాపాడటానికి చట్టంలో కొన్ని ప్రతిపాదనలు చేసామని మంత్రి మేనకా గాంధీ వారి అభ్యంతరాలను త్రోసిపుచ్చారు.

 

ఈ చట్ట సవరణ చేయడం వరకు బాగానే ఉంది. కానీ ఎన్ని చట్టాలున్నా సమాజంలో నేరాలు ఆగడం లేదు. అంటే వాటిని చూసి ఎవరూ భయపడటం లేదనే సంగతి స్పష్టం అవుతోంది. నిర్భయ నిందితుల తరపున ఎవరూ వాదించమని, ఒకవేళ ఎవరయినా లాయరు ఆ కేసును స్వీకరిస్తే వారిని బార్ కౌన్సిల్ నుండి బహిష్కరిస్తామని మొదట అందరూ బింకాలు పలికారు. కానీ మూడేళ్ళుగా ఆ కేసు కొనసాగుతూనే ఉందంటే అందుకు ఎవరిని నిందించాలి?

 

రెండు మూడు నెలలలోనే తేల్చవలసిన ‘హిట్-అండ్-రన్’ కేసును బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఏకంగా 13 ఏళ్ళు సాగదీయగలిగాడంటే ఎవరిని నిందించాలి? అనేక చార్జ్ షీట్లలో కేసులు ఎదుర్కొంటున్న వారు, జైలు శిక్షలు ఖరారయిన లాలూ ప్రసాద్, జయలలితవంటి వాళ్ళు అందరూ చట్ట సభలలో ప్రవేశించడమే కాకుండా రాజ్యాధికారం కూడా ఆశించగలుగుతున్నారంటే ఎవరిని నిందించాలి? అటువంటి వారిని గుడ్డిగా ఆరాధిస్తున్న వారిని ఏమనుకోవాలి? అని ప్రశ్నించుకొంటే లోపం ఎక్కడో లేదు సమాజంలోనే ఉందని అర్ధమవుతుంది. అందుకే ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా అవి సమర్ధంగా ఆచరణకు నోచుకోవడం లేదు. కానీ నేరాలను, నేరస్తులను నియంత్రించేందుకు ఏదో ఒక అంకుశం అవసరం కనుక ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి.

 

అయితే అందరూ వాటిలో లొసుగులను కనిపెట్టేందుకు చూపిస్తున్న శ్రద్ధ వాటిని పటిష్టంగా అమలుచేయడంలో చూపకపోవడం వలననే దేశంలో నేరాలు ఆగడం లేదని చెప్పవచ్చును. అందుకే కొందరు ఆ చట్టాలను అధిగమించగలుగు తుంటే ఆ శక్తిలేని వారికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందనే పెద్దల మాటను పట్టించుకొన్నపుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. లేకుంటే చట్టం కొందరికి చుట్టంగా, మరికొందరికి ఆదాయ మార్గంగానే మిగిలిపోతుంది.