రాహుల్ గాంధీ అసమర్థతే వారికి ప్రేరణ?

 

దేశాన్ని ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీలే తప్ప మరో పార్టీకి అధికారం చేప్పట్టే అవకాశం ఉండకపోతే ఎలా? అని మధనపడిపోయేవారికి కొదవలేదు. అటువంటి వారందరూ కలిసి ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంటు స్థాపించే ప్రయత్నాలు చేస్తుంటారు. గతేడాది ఎన్నికల ముందు కూడా ఎర్ర పార్టీలు, లాలూలు, ములాయములు, అమ్మలు అక్కలు అందరూ కలిసి అటువంటి ప్రయత్నమే చేసారు. కానీ షరా మామూలుగానే ఎన్నికల ముందు పుట్టిన థర్డ్ ఫ్రంటు ఎన్నికల ముగిసే సమయానికి కనబడకుండా పోయింది.

 

అయితే జీవితంలో ఎప్పటికయినా దేశానికి ప్రధానమంత్రి కావాలని తపించే ములాయం సింగ్, లాలూప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి వారు, కాంగ్రెస్, బీజేపీలున్నంత కాలం తమకి ఆ అవకాశం రాదని గ్రహించి, ‘జనతా’ తోకలు తగిలించుకొన్న రకరకాల పార్టీలన్నిటినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి ‘జనతా పరివార్’ అనే మరో కొత్త ప్రయోగం మొదలుపెట్టారు. దానికి సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. దేశంలో లౌకికవాద పార్టీలను అన్నిటినీ కూడగట్టి కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తమ కూటమిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

 

అయితే ఇదే లాలూ, ములాయం సింగ్ లు నిన్నమొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి తోకలుగానే వ్యవహరించారు. కానీ ఇప్పుడు డానికే తామె౩ దానికి ప్రత్యామ్నాయమవుతామని చెప్పుకొంటున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియదు కానీ వారు ఇప్పుడే ఎందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటే అందుకు చాలా బలమయిన కారణమే ఉంది.

 

ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది కానీ దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ‘రాహుకాలం’ దానివలన పార్టీకి మరింత క్షీణదశ మొదలయినట్లేనని భావిస్తున్నందునే వారికి ఈ జనతా ప్రేరేపణ కలిగించి ఉండవచ్చును. కాంగ్రెస్ బలహీనత కారణంగా ఏర్పడుతున్న ఈ రాజకీయ శూన్యతను కొమ్ములు తిరిగిన తమ వంటి నేతలు మాత్రమే నింపగలమనే నమ్మకం వారికి కలిగితే ఆశ్చర్యం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కాకుండా సమర్ధుడు, అనుభవజ్ఞుడు అయిన నేత మరొకరెవరయినా నేతృత్వం వహించి ఉంటే బహుశః ఈ లాలూలకి, ములాయములకి ఈ ‘జనతా ఆలోచన’ వచ్చేది కాదేమో? అంటే రాహుల్ గాంధీ అసమర్ధతమీద వారికంత నమ్మకం ఉందన్నమాట! అంటే వారి జనతా పరివార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమే గానీ బీజేపీకి, ఎన్డీయేకి కాదని అర్ధమవుతోంది.

 

కానీ కనీసం కాంగ్రెస్ పార్టీకయినా ప్రత్యామ్నాయం కాగలదా? అంటే అనుమానమే. ఎందుకంటే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి తోకలుగా ఉన్న జనతా పార్టీలు ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకొంటునప్పటికీ, దేశ ప్రజలు వారిని విశ్వసించబోరు. పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, జైలుకి వెళ్లి వచ్చినవారు వారివారి రాష్ట్రాలలో ఎలాగో అధికారంలోకి రావచ్చును. కానీ అటువంటి వారందరూ చేతులు కలిపితే అదొక ‘జనతా అవినీతి పరివార్’గా మరింత ప్రస్పుటంగా కనబడుతుంది. కనుక ప్రజలు తిరస్కరించే అవకాశాలున్నాయి.

 

జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలే ఎంత శ్రమపడినా దక్షిణాది రాష్ట్రాలపై ఇంతవరకు పట్టు సాధించలేకపోతున్నాయి. అటువంటప్పుడు ఉత్తరాదిన కేవలం రెండు మూడు రాష్ట్రాలకు పరిమితమయిన ఓ మూడు నాలుగు ప్రాంతీయ పార్టీలు కలిసి ‘జనతా పరివార్’ పేరు పెట్టుకొని దక్షిణాది ప్రజలను మెప్పించగలగడం అసంభవం. అయినా ఎటువంటి సిద్దాంతాలు లేకుండా కేంద్రంలో అధికారం సాధించడం, ప్రధానమంత్రి పదవే పరమావధిగా ఏర్పడుతున్న జనతా పరివార్ ని దక్షినాది ప్రజలు అసలు పట్టించుకోబోరని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒకవేళ వారు ఏర్పాటు చేసుకొంటున్న ఈ జనతా గొడుగు క్రింద కొంత కాలం సాగినప్పటికీ, ఎన్నికల సమయానికి మళ్ళీ విచ్చినం అయిపోవచ్చును.