‘రియల్’ జోరుతో ఏపీ ఆదాయం అదరహో...
posted on Apr 7, 2015 1:25PM
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా మారింది. క్రిందటి నెలాఖరు రోజున కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోయుంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొనేందుకు సిద్దమయిందంటే పరిస్థితి ఎంత తీవ్రత అర్ధమవుతుంది. అలాగని ఈ 10 నెలల్లో రాష్ట్ర ఆర్ధికపరిస్థితి మెరుగవలేదనుకోవడానికీ లేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కేవలం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల మీద వచ్చిన ఆదాయం 6 నుండి 126 శాతం పెరిగింది. రాష్ట్రంలో 13జిల్లాలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 792.51 కోట్లు పెరిగింది.
శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 6.4 శాతం వృద్ధి నమోదు కాగా గుంటూరు జిల్లాలో అత్యధికంగా 126 శాతం వృద్ధి నమోదు అయింది. ఆ తరువాత వరుసగా కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మంచి అభివృద్ధి కనబడింది. కడప, కర్నూలు, విజయనగరం, జిల్లాలలో రిజిస్ట్రేషన్ల ఆదాయంలో కూడా మంచి అభివృద్దే కనబడింది. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం గతేడాది ఇదేసమయానికి రిజిస్ట్రేషన్ల శాఖ రూ. 240.47కోట్లు ఆదాయం ఆర్జించగా ఈ ఏడాది ఇంతవరకు కేవలం 108.35కోట్లు మాత్రమే వసూలయింది. బహుశః రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల దృష్టి ప్రధానంగా రాజధాని ప్రాంతంపై ఆ తరువాత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్న కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖ, చిత్తూరు, నెల్లూరు జిల్లాలపైనే ఉన్నందునే మిగిలిన జిల్లాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా అంత పుంజుకోలేదేమో? రాయలసీమ మరియు ఉత్తరాంద్రాలో వెనుకబడిన అనంతపురం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో పరిశ్రమల స్థాపన మొదలయితే అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవచ్చును.