తెలుగు రాష్ట్రాలలో కలకలం.. వ్యాక్సిన్ తీసుకున్న ముగ్గురు హెల్త్ వర్కర్ల మృతి..  

రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్లలో మరణాలు నమోదవుతున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే వ్యాక్సిన్ వేయించుకున్న ముగ్గురు హెల్త్ వర్కర్లు మ‌ర‌ణించ‌డం ప్రస్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిర్మ‌ల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 42 ఏళ్ల 108 డ్రైవర్ ఆ మ‌రుస‌టి రోజే మృతి చెందారు. వ్యాక్సిన్ వేయించుకోవ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు ఛాతీ నొప్పి వ‌చ్చిన‌ట్టుగా అయన కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

 

ఇది ఇలా ఉండగా వ్యాక్సిన్ తీసుకున్న మ‌రో ఇద్ద‌రు హెల్త్ వ‌ర్క‌ర్లు ఆదివారం నాడు మృతి చెందారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా న్యూ శాయంపేట అంగన్‌వాడీ టీచర్ వనిత తీవ్ర‌మైన చాతినొప్పితో నిన్న మృతి చెందింది. వ్యాక్సిన్ వేయించుకున్న‌ప్పటి నుంచి ఆమె అస్వ‌స్థ‌త‌గా ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోపక్క ఏపీలోని గుంటూరు జిల్లాలో క‌రోనా‌ వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి కూడా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఆమె కూడా వ్యాక్సిన్ వేయించుకున్న త‌ర్వాతే అనారోగ్యానికి గురైన‌ట్టు ఆమె కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఆమె బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌కు గురయ్యారని తేల్చారు. మరోపక్క ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ రియాక్షన్‌తో 17 మంది ఆసుపత్రిలో చేరినట్లుగా జీజీహెచ్ అధికారులు తెలిపారు. 10 మందికి వైద్యం చేసి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఏడుగురికి చికిత్స కొనసాగుతోంది. అయితే బాధితుల వివరాలను వైద్యశాఖ గోప్యంగా ఉంచుతోంది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి మరణించడంతో మిగతా బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.