తాగి ఊగారు..పిల్లల ఊపిరి తీశారు

ఉత్తరప్రదేశ్‌‌లోని గోరఖ్‌పూర్ బీఆర్‌డీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 70 మంది చిన్నారులు మరణించిన ఘటన ఇంకా దేశ ప్రజల కళ్లేదుట మెదులుతూనే ఉంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతుండటం..ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించడం అన్ని చకా చకా జరిగిపోయాయి..అంతులేని నిర్లక్ష్యమే ఇంతటి విషాదానికి కారణమని ప్రజలు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది పోయి అదే నిర్లక్ష్యంతో ముగ్గురు పసిబిడ్డల ప్రాణాలను బలి తీసుకున్నారు. చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లోని అంబేద్కర్ హాస్పిటల్‌లో నిన్న చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులు ఆక్సిజన్ అందక చనిపోయారు. దీనిపై విచారణ చేపట్టగా ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది మద్యం తాగి విధులు నిర్వర్తించి చిన్నారుల మృతికి కారణమయ్యారని తేల్చారు. వీరూ ముగ్గురు మద్యం తాగి విధులకు హాజరయ్యారు..ఈ క్రమంలో చిన్నారులను పట్టించుకోకపోవడంతో ఆక్సిజన్ అందక చనిపోయారని పోలీసులు తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.