బీజేపీలోకి గంటా.. ఆయన వెంట మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!!

 

ఏపీలో టిడిపికి మరో షాక్ తగలబోతోందా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నారా? మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే పయనించటానికి సిద్ధమయ్యారా?. ఢిల్లీలో మకాం వేసిన గంటా శ్రీనివాసరావు మాజీ టిడిపి నేతల సహాయంతో కమలనాథులతో చేతులు కలిపే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలుగు దేశం పార్టీ ని వీడే యోచన లో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఆయన మకాం వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. గంటా హస్తినలో బిజెపి ముఖ్య నేత రాంమాధవ్ తో సమావేశమైనట్లు తెలుస్తుంది. రాంమాధవ్ ని కలిసిన గంట బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. రెండు రోజులుగా టిడిపి నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ తో గంటా చర్చలు జరిపారని సమాచారం.

మరోవైపు గంటాతో పాటు బీజేపీలోకి వచ్చేందుకు మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారిద్దరితో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంతనాలు సాగించినట్టు సమాచారం. గంటా వైసీపీలోకి కాకుండా బిజెపిలో చేరడం దాదాపు ఖాయమన్న వార్తలకు ఈ పరిణామాలే సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. మొత్తానికీ గంటా టీడీపీని వీడుతున్నట్లు గానే భావించాల్సి ఉంటుందని విశాఖకు చెందిన సొంత పార్టీ నేతలే వెల్లడిస్తున్నారు.ఈ విషయం పై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.