అంతులే మ‌ృతి

 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఒకప్పుడు దేశ రాజకీయాలలో చక్రం తిప్పిన ఎ.ఆర్.అంతులే (85) మంగళవారం నాడు ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పాడవడంతో నెల రోజుల కిందటే ఎ.ఆర్.అంతులే చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. అంతులే పరిస్థితి విషమంగా ఉందని, కోమాలోకి వెళ్లిపోయారని ఆయన కుటుంబ సభ్యులు సోమవారం  తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన మరణించారు. అంతులే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. 1980 నుంచి 82 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతులే సొంత గ్రామం అంబెట్‌లో బుధవారం అంతులే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆయన మేనల్లుడు ముస్తాక్ అంతులే తెలిపారు.1980 జూన్ 9వ తేదీన మహారాష్ట్ర ఎనిమిదో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండేళ్లు కూడా పదవిలో కొనసాగలేదు. ఇందిరా ప్రిస్థాన్ ట్రస్టు ద్వారా అంతులే అవినీతికి పాల్పడినట్లు హైకోర్టు నిర్దారించడంతో 1982 జనవరి 13న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.